30 Dead : కల్తీ నాటుసారా ఘటన తమిళనాడులో పెను విషాదాన్ని మిగిల్చింది. మంగళవారం రాత్రి కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురం ప్రాంతంలో కల్తీ నాటుసారా తాగిన ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 30కు(30 Dead) పెరిగింది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది రోజువారీ కూలీలే. కల్తీ నాటుసారా తాగిన మరో 60 మంది బాధితులు కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం అవసరం కావడంతో 10 మందిని పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్)కు తరలించారు. కల్తీ నాటు సారా తాగిన వారి బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించి విల్లుపురం, జిప్మర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపించారు. మద్యంలో మిథనాల్ అనే విషపదార్థం కలిపారని ల్యాబ్ రిపోర్టుల్లో వచ్చింది. ఈ మద్యం తాగిన వారిలో తలనొప్పి, వాంతులు, వికారం, కడుపు నొప్పి, కళ్ల మంటలు వంటి లక్షణాలు బయటపడ్డాయి.
We’re now on WhatsApp. Click to Join
ఈ ఘటనపై తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంకా చాలా మంది ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పారు. వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ కేసును క్షుణ్ణంగా విచారించాలని క్రైమ్ బ్రాంచ్- క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం(సీబీసీఐడీ)ని సీఎం స్టాలిన్ ఆదేశించారు. కల్లకురిచి కలెక్టర్‌ను ట్రాన్స్‌ఫర్ చేశారు. ఎస్పీని సస్పెండ్ చేశారు. జిల్లా ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ యూనిట్‌కు చెందిన డీఎస్సీ తమిళ్ సెల్వన్ నేతృత్వంలోని టీమ్‌ను సస్పెండ్ చేశారు.