Tamil Nadu: రష్యాపై ‘తమిళ్’ యువకుడు యుద్ధభేరి!

ఈ ఫొటోలో కనిపిస్తున్న 21 ఏళ్ల యువకుడి పేరు సాయినిఖేష్ రవిచంద్రన్. చిన్నప్పట్నుంచే ఆర్మీ అంటే చెప్పలేనంత ఇష్టం. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుతున్న సాయినిఖేష్ ఇండియన్ ఆర్మీలో చేరడానికి రెండుసార్లు ప్రయత్నించాడు.

  • Written By:
  • Publish Date - March 9, 2022 / 03:12 PM IST

ఈ ఫొటోలో కనిపిస్తున్న 21 ఏళ్ల యువకుడి పేరు సాయినిఖేష్ రవిచంద్రన్. చిన్నప్పట్నుంచే ఆర్మీ అంటే చెప్పలేనంత ఇష్టం. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుతున్న సాయినిఖేష్ ఇండియన్ ఆర్మీలో చేరడానికి రెండుసార్లు ప్రయత్నించాడు. కానీ సరైన హైట్ (ఎత్తు) లేకపోవడంతో రిజెక్ట్ కావాల్సి వచ్చింది. అయినా ‘తగ్గేదేలే’ అంటూ సైనికుడి అవతారమెత్తాడు. ఎలాగో తెలుసా..?

గతకొన్ని రోజులుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న అందరికీ తెలిసిందే. పెద్ద దేశమైన రష్యా దాడులను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది ఉక్రెయిన్. ఈ నేపథ్యంలో రష్యాపై పోరాడటానికి తమతో కలిసి రావాలని ఉక్రెయిన్ పిలుపునిచ్చింది. ఈ అవకాశం సాయినిఖేష్ ఆకాంక్షను నెరవేర్చింది. ఉక్రెయిన్ పిలుపు మేరకు స్వచ్ఛందంగా ఆ దేశం తరుపున పోరాడాలని నిర్ణయించుకున్నాడు. సాయినిఖేష్ ఉక్రెయిన్ లో ‘ఏరోస్పేస్ ఇంజనీరింగ్’ ఐదో సంవత్సరం చదువుతున్నాడు. ఈ యువకుడిది కోయంబత్తూరులోని తుడియాలూరు సమీపంలోని సుబ్రమణ్యంపాళయం. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన తర్వాత సాయి జాడ కుటుంబసభ్యులకు లభించలేదు. కొన్నాళ్ల తర్వాత సాయినిఖేష్ తల్లిదండ్రులు (ఝాన్సీ లక్ష్మి, భర్త రవిచంద్రన్) తమ పెద్ద కుమారుడు ఉక్రెయిన్ లో యుద్ధం చేస్తున్నాడని తెలుసుకుని ఉలిక్కిపడ్డారు. విషయం తెలిసిన వెంటనే భారత రాయబార కార్యాలయాన్ని అప్రమత్తం చేశారు. ‘సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో’ అధికారుల బృందం రెండు రోజుల క్రితం సాయినిఖేష్ నివాసానికి వెళ్లి అతని గురించి వివరాలు సేకరించినట్లు తమిళనాడు పోలీసు వర్గాలు తెలిపాయి. అతను ఉక్రెయిన్ దళాలలో ఎందుకు చేరాడని కూడా అడిగారు.

పోలీసుల సమాచారం ప్రకారం..  సాయినిఖేష్‌కు సైనిక, సాయుధ శిక్షణపై మక్కువ ఉందని ఇంటెలిజెన్స్ స్లీత్‌లకు చెప్పారు. కోయంబత్తూర్‌లోని అతని గది నిండా భారత సైన్యం, అధికారుల ఫోటోలు ఉన్నాయని చెప్పారు. అతను ఖార్కివ్‌లోని వీడియో గేమ్ డెవలపింగ్ కంపెనీలో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడని, ఆ విషయం తమతో చెప్పాడని సాయినిఖేష్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకూ రష్యా దాడులు తీవ్రకానుండటంతో భారత విద్యార్థులు స్వదేశానికి పయనమవుతన్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన సాయినిఖేష్ తుఫాకులు చేతపట్టి రష్యాపై యుద్ధానికి దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.