Bengaluru Building Collapse: కర్ణాటకలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల మధ్య బెంగళూరులో పెను ప్రమాదం (Bengaluru Building Collapse) చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. తూర్పు బెంగళూరులోని హోరామావు ఆగ్రా ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో కనీసం 20 మంది కూలీలు, ఇతర వ్యక్తులు భవన శిథిలాల కింద సమాధి అయ్యారు. వెంటనే ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్‌లో 14 మందిని శిథిలాల నుండి బయటకు తీయగా, 1 వ్యక్తి మరణించాడు. ప్రస్తుతం 5 మంది గల్లంతయ్యారు. SDRFతో పాటు అగ్నిమాపక దళం బృందం రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహిస్తోంది. ఇందులో బెంగళూరు పోలీసులు కూడా సహాయం చేస్తున్నారు.
వర్షం నుంచి తప్పించుకునేందుకు కార్మికులు భవనం లోపలికి వెళ్లారు
తూర్పు బెంగళూరులోని హెన్నూరు సమీపంలోని హోరామావు ఆగ్రా ప్రాంతంలోని బాబుసాపాల్య వద్ద మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగినట్లు బెంగళూరు పోలీసులను ఉటంకిస్తూ పిటిఐ తెలిపింది. భారీ వర్షం నుండి తప్పించుకోవడానికి చాలా మంది కార్మికులు నిర్మాణంలో ఉన్న భవనంలో తలదాచుకున్నారు. ఈ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం పడిపోవడం చూసి కార్మికులు బయటకు పరుగులు తీయడానికి ప్రయత్నించార. అయితే 20 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు.
Also Read: Indian Players: ఈ ముగ్గురు ఆటగాళ్లపైనే టీమిండియా ఆశలు.. లిస్ట్‌లో ఇద్దరూ ఆల్ రౌండర్లు!
ఇప్పటి వరకు 14 మంది కూలీలను రక్షించారు
బెంగళూరు పోలీస్ డిసిపి (ఈస్ట్) డి.దేవరాజు ANIతో మాట్లాడుతూ.. అనేక ఏజెన్సీలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. శిథిలాల నుంచి ఇప్పటివరకు 14 మందిని రక్షించారు. శిథిలాల కింద 20 మంది సమాధి అయినట్లు నివేదికలు ఉన్నాయి. వారిలో ఒకరు మరణించారు. మిగిలిన ఐదుగురు కూలీల కోసం గాలిస్తున్నారు.
బెంగళూరులో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి
బెంగళూరు నగరంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉత్తర బెంగళూరులో కూడా వరదలు వచ్చాయి. యలహంకలోని పలు ప్రాంతాలు నడుము లోతు నీటిలో ఉండడంతో బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న భవనం పునాది మునిగిపోయిందని, ఈ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రస్తుతం భవనం కూలడానికి గల కారణాలపై విచారణ జరుపుతామని అధికారులు చెబుతున్నారు.