Waltair Veerayya Review: వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరు ‘పూనకాలు’ తెప్పించాడా!

  • Written By:
  • Updated On - January 13, 2023 / 03:57 PM IST

ఒకరు మాస్ మెగాస్టార్, మరొకరు మాస్ మహారాజ.. వీరిద్దరు తోడైతే ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయమే. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ మాస్ కాంబోను డైరెక్ట్ చేసిన బాబీ కొల్లి ‘వాల్తేరు వీరయ్య’ 13 జనవరి 2023న వరల్డ్ వైడ్ గా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో వీరయ్య థియేటర్లలో సందడి చేస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్, టీజర్ 90ల నాటి పాతకాలపు చిరంజీవిని సినీ ప్రేమికులకు గుర్తు చేసింది. మాస్ లుక్స్ క్యూరియాసిటీ పెంచాయి. వాల్తేరు వీరయ్య సినీ ప్రేమికులను ఆకట్టుకున్నాడో లేదో తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదువాల్సిందే.

వీరయ్య స్టోరీ ఇదే

వాల్తేరు వీరయ్య కథ విశాఖపట్నంలోని ఓ మత్స్యకారుడి చుట్టూ తిరుగుతుంది. సముద్రం పై పట్టున్న వాడు వాల్తేరు వీరయ్య (చిరంజీవి). అవసరమైనప్పుడల్లా నేవీ అధికారులకు తనవంతు సాయం చేస్తుంటాడు. వైజాగ్ పోర్ట్ లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదనే నడుస్తుంటుంది. మలేషియాలో డ్రగ్ మాఫియాను నడిపే సాల్మన్ సీజర్ (బాబీ సింహా) వల్ల పోలీస్ ఆఫీసర్ సీతాపతి (రాజేంద్రప్రసాద్) విధుల నుండి సస్పెండ్ అవుతాడు. సాల్మన్ ను ఎలాగైనా మలేషియా నుండి తీసుకురావాలని సీతాపతి ప్రయత్నిస్తాడు. అది వీరయ్య వల్ల సాధ్యమవుతుందని తెలుసుకుంటాడు. సాల్మన్ ను రప్పించేందుకు ఇద్దరూ ఓ ఒప్పందం చేసుకుంటారు.

మలేషియా వెళ్లిన వీరయ్య.. అక్కడ సాల్మన్ సీజర్ తో పాటు అతని అన్న కాలా అలియాస్ మైఖేల్ సీజర్ (ప్రకాష్ రాజ్)కూ ఎరవేస్తాడు. మైఖేల్ కీ – వీరయ్యకి మధ్య సంబంధం ఏంటి ? సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ విక్రమ్ సాగర్ (రవితేజ) వీరయ్యను ఎందుకు శిక్షించాడు ? విక్రమ్ సాగర్ గతమేంటి ? ఈ క్రమంలో విక్రమ్ – వీరయ్య, మైఖేల్ – వీరయ్య లకు మధ్య పోరు ఎలా జరిగిందో తెలియాలంటే.. తెరపై సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

మెగాస్టార్ చిరంజీవి ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారు. అందుకే ఆయనకు మెగాస్టార్ అని బిరుదు. ఇక ఈ మూవీలో కూడా వాల్తేరు వీరయ్య పాత్రకు పూర్తి న్యాయం చేశారు. డ్యాన్స్‌లలో తానే కింగ్ అని మరోసారి చాటుకున్నాడు. వయసు మీద పడుతున్న యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా తనదైన స్టెప్పులతో మైస్మరైజ్ చేస్తాడు. కామెడీ టైమింగ్‌, డైలాగ్ డెలివరీ కూడా ఆకట్టుకున్నాయి. శ్రుతి హాసన్‌కి మంచి పాత్ర లభించడంతో ఆమె చక్కగా నటించింది. ఆమె తెరపై గ్లామరస్‌గా కనిపించడంతో పాటు చిరంజీవితో ఈజీగా డ్యాన్స్ చేసింది. ఆమె అభిమానులందరినీ ఆశ్చర్యపరిచేలా రెండు విన్యాసాలు కూడా చేసింది. మాస్ రాజా రవితేజ తన అద్భుతమైన నటనతో పవర్ ఫుల్ ఇంపాక్ట్ చేశాడు. చిరంజీవి, రవిత్రేజ స్క్రీన్ ప్రెజెన్స్ సినీ ప్రేమికులకు పుష్కలంగా వినోదాన్ని పంచుతుంది.

కేథరిన్ తన పాత్రలో ఓకే. బాబీ సింహా తన ప్రతినాయకుడి పాత్రలో భయంకరంగా కనిపించాడు. ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే విలన్ పాత్రలో తనదైన పాత్రను పోషించాడు. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ వంటి వారు పెద్దగా వినోదాన్ని అందించలేదు. బాస్ పార్టీ అనే పాటలో ఊర్వశి రౌతేలా చక్కగా డ్యాన్స్ చేసి అదరగొట్టింది. బాబీ రాసిన వాల్తేర్ వీరయ్య కథ కొత్తదేమీ కాదు. సినిమా కథ రొటీన్‌గా ఉంది.  డైరెక్టర్ చిరంజీవి హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ని చేర్చడానికి ప్రయత్నించాడు. 90ల నాటి పాతకాలపు చిరంజీవిని అభిమానులకు చూపించేలా చిరంజీవి పాత్రను, లుక్‌ని బాబీ డిజైన్ చేశాడు. ఆ కోణంలో చిరంజీవి అత్యంత భారీ రంగులు ధరించి, చొక్కాలు, లుంగీలు, బనియన్లు మాస్ లుక్‌తో కనిపించడంతో బాబీ విజయవంతమయ్యాడు.

కమర్షియల్ ఎంటర్‌టైనర్ కోసం బాబీ అదే ఆరు పాటలు, ఆరు ఫైట్స్ టెంప్లేట్‌ని ఫాలో అయ్యాడు. సీరియస్‌గా, గజిబిజిగా, రొమాంటిక్‌గా, ఉల్లాసంగా, యాక్షన్‌గా రకరకాల కోణాల్లో చిరంజీవిని చూపించాడు. అయితే, కథ రొటీన్‌గా మారడంతో ప్రేక్షకులను నిరాశపర్చాడు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ బాబీ పూనకాలుని ప్రేరేపించడానికి ప్రయత్నించాడు. సెకండాఫ్‌లో రవితేజ ఎంట్రీ మరింత ఉత్సాహాన్నిచ్చింది. చిరంజీవి, రవితేజల సన్నివేశాలు సినిమాను మరో స్థాయికి ఎలివేట్ చేశాయి. ఇద్దరి మధ్య భావోద్వేగాలను హైలైట్ చేశాయి. చివరగా, సెకండాఫ్ ఊహించదగిన రీతిలో ముగుస్తుంది. అభిమానులను ఉత్సాహపరిచే సీన్స్ అంటూ ఏమీ లేవు.

దేవి శ్రీ ప్రసాద్ పాటలకు మాస్ బీట్స్ తో అదరగొట్టాడు. అన్ని పాటలు బాగా చిత్రీకరించబడ్డాయి చిరంజీవి వయస్సును పరిగణనలోకి తీసుకొని కొరియోగ్రఫీ చేసారు. దేవి శ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం బాగుంది. డైలాగ్స్ రొటీన్ గా, మాస్ గా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫ్లస్ పాయింట్స్

చిరంజీవి లుక్స్, నటన

రవితేజ యాక్టింగ్

మైనస్ పాయింట్స్

రొటీన్ స్టోరీ

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం

మిస్సింగ్ ఎమోషన్స్

రేటింగ్ : 3/5