Site icon HashtagU Telugu

Mathu Vadalara 2 : ‘మత్తు వదలరా 2’ మూవీ రివ్యూ.. సస్పెన్స్ కామెడీ..

Mathu Vadalara 2

Mathu Vadalara

Mathu Vadalara 2 : 2019లో వచ్చిన మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన మత్తు వదలరా 2 సినిమా నేడు సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రితేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా, సత్య, సునీల్, రోహిణి, వెన్నెల కిషోర్, అజయ్.. పలువురు ముఖ్య పాత్రల్లో మత్తు వదలరా 2 సినిమా తెరకెక్కింది.

కథ :
మత్తు వదలరా సినిమాకు కంటిన్యూ ఇస్తూనే ఈ సినిమాని తీశారు. బాబు(శ్రీ సింహ), యేసు(సత్య) ఫస్ట్ పార్ట్ లో డ్రగ్ కేసులో పట్టిస్తే అభినందించాల్సింది పోయి జాబ్ లోంచి తీసేస్తారు, రెంట్ హౌస్ లోంచి తోసేస్తారు. దీంతో రోడ్డు మీద పడ్డ వీళ్లకు HE టీమ్ యాడ్ కనపడటంతో దానికి అప్లై చేస్తారు. జాబ్ రాకపోయినా లంచం ఇచ్చి జాబ్స్ తెచ్చుకుంటారు.

HE (High in Emergency) టీమ్ కిడ్నాప్స్, మర్డర్స్.. లాంటి ఎమర్జెన్సీ కేసుల్ని డీల్ చేస్తుంది. ఆ టీమ్ లో బాబు, యేసు కలిసి కిడ్నాప్ కేసుల్ని డీల్ చేస్తూ ఉంటారు. వీళ్ళ డబ్బు అవసరాల కోసం కిడ్నాపర్స్ నుంచి రికవరీ చేసిన డబ్బుల్లో కొంత దొంగతనం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒకేసారి సెటిల్ అయిపోవాలని ఓ కిడ్నాప్ కేసుని HE టీమ్ కి తెలియకుండా డీల్ చేసి డబ్బులు కొట్టేద్దాం అనుకుంటారు. అలా రియా అనే ఒక అమ్మాయి కిడ్నాప్ కేసుని డీల్ చేస్తారు. కానీ వీళ్ళు కాపాడిన రియా ఫేక్ అని, అసలు రియాని వేరే వాళ్ళు చంపేసి వీళ్ళని అందులో ఇరికించినట్టు అర్ధమవుతుంది. అంతే కాకుండా ఇంకో మర్డర్ కేసులో కూడా ఇరికిస్తారు. HE టీమ్ నుంచి తప్పించుకొని బాబు, యేసులు తిరుగుతూ ఉంటారు. అసలు రియాని ఎవరు చంపారు? రియా మర్డర్, ఇంకో మర్డర్ ని వీళ్ళ మీదకు ఎవరు తోసారు? ఆ కేసు నుంచి వీళ్లిద్దరు ఎలా బయటపడ్డారు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే..

నటీనటుల విషయానికొస్తే :
ఈ సినిమాలో సత్యనే మెయిన్ లీడ్ అనేంతగా తన కామెడీతో ఫుల్ గా నవ్వించాడు. సినిమా అంతా సత్యనే నడిపిస్తున్నట్టు ఉంటుంది. శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా కూడా తమ నటనతో మెప్పించారు. సునీల్, వెన్నెల కిషోర్.. తమ కామెడీతో నవ్వించారు. రోహిణి, రాజా.. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల్లో మెప్పించారు.

విశ్లేషణ..
మత్తు వదలరా ఫస్ట్ పార్ట్ కి కంటిన్యూగా ఈ సినిమాని క్రైం సస్పెన్స్ కామెడీతో పర్ఫెక్ట్ గా తెరకెక్కించారు. బాబు, యేసులు కిడ్నాప్ ఆపరేషన్స్ చేయడం, డబ్బుల కోసం వెళ్లి అనుకోకుండా రియా హత్య కేసులో ఇరుక్కోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఇంటర్వెల్ నుంచి ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ లో బాబు, యేసు, నిధి(ఫరియా అబ్దుల్లా)లు కలిసి ఈ కేసుని ఎలా సాల్వ్ చేసారు ట్విస్ట్ లు రివీల్ చేస్తారు. సినిమా అంతా సత్య తన భుజాలపై మోసాడని చెప్పొచ్చు. ఫస్ట్ పార్ట్ కి మించి ఈ సినిమాలో ఇంకా ఎక్కువగా నవ్వించారు. మెగా ఫ్యాన్స్ మెచ్చే సీన్స్ బోలెడన్ని ఉన్నాయి ఈ సినిమాలో. ఇక మొదటి పార్ట్ లో సాగిన సీరియల్ ఈ పార్ట్ లో కూడా సాగి ప్రేక్షకులని నవ్విస్తుంది. అయితే కథ, కథనం మాత్రం ఫస్ట్ పార్ట్ లాగే అనిపించినా నవ్వించడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. చివర్లో మత్తు వదలరా పార్ట్ 3కి కూడా లీడ్ ఇచ్చారు.

సాంకేతిక అంశాలు :
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. సస్పెన్స్ మర్డర్ కథని ఫుల్ లెంగ్త్ కామెడీగా చూపించి దర్శకుడు రితేష్ రానా సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా కూడా సినిమాకు కావలసినంత ఖర్చుపెట్టారు.

పాజిటివ్ అంశాలు :
సత్య
మెగా రిఫరెన్సులు
ఫుల్ లెంగ్త్ కామెడీ

నెగిటివ్ అంశాలు :
ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీత
రొటీన్ కథ

రేటింగ్ : 3/5

Also Read : Gangavva Properties : గంగవ్వ ఆస్తులు తెలిస్తే నోరు వెళ్లబెడతారు..!