Site icon HashtagU Telugu

Rangabali Review: రంగబలి మూవీ రివ్యూ.. హిట్టా.. ఫట్టా?

Rangabali

Rangabali

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. లవ్ స్టోరీస్ సబ్జెక్టుతో మంచి హీరోగా స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఈ కుర్ర హీరోకు సరైన హిట్ పడక చాలారోజులవుతుంది. ఈ నేపథ్యంలో రంగబలి అంటూ సినిమా ప్రమోషన్స్ నుంచే భారీ అంచనాలు నెలకొల్పాడు. ఇంతకు రంగబలి ప్రేక్షకులను మెప్పించిందా? నాగశౌర్య హిట్ కొట్టాడా అనేది తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదువాల్సిందే.

స్టోరీ

శౌర్య (నాగ‌శౌర్య‌)కు త‌న ఊరు రాజ‌వ‌రం అంటే పిచ్చి ప్రేమ‌. అదే అత‌ని బ‌లం, బ‌ల‌హీన‌త కూడా. బీ ఫార్మ‌సీ పూర్తి చేసి జులాయిగా తిరుగుతుంటాడు. ఏదేమైనా స‌రే సొంతూరు విడిచి వెళ్లొద్ద‌ని, అక్క‌డే కింగులా బ‌త‌కాల‌ని అనుకుంటాడు. త‌ను ఊళ్లో ఏం చేసినా అంద‌రి చూపు త‌న‌వైపే ఉండాల‌ని, అంతా త‌న గురించే మాట్లాడుకోవాల‌ని భావిస్తూ అప్పుడ‌ప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌డానికి షో చేస్తూ ఉంటాడు. దీంతో అత‌న్ని ఫ్రెండ్స్ షో అని పిలుస్తుంటారు. శౌర్య తండ్రి విశ్వం (గోప‌రాజు) ఊళ్లో మెడిక‌ల్ షాపు నిర్వ‌హిస్తుంటాడు. కొడుకు శౌర్య‌కు దాని బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌నుకుంటాడు. శౌర్య మాత్రం ఊళ్లో గొడ‌వ‌లు ప‌డుతూ..తండ్రి మెడిక‌ల్ షాప్‌లో చిల్ల‌ర దొంగ‌త‌నాలు చేస్తూ జ‌ల్సాగా గ‌డిపేస్తుంటాడు.

కొడుకు చేస్తున్న ప‌నులు న‌చ్చ‌ని విశ్వం అత‌న్ని ఎలాగైనా దారిలో పెట్టాల‌ని వైజాగ్ పంపిస్తాడు. తండ్రి కోరిక మేర‌కు ఫార్మ‌సీ ట్రైనింగ్ కోసం ఓ మెడిక‌ల్ కాలేజీలో చేర‌తాడు శౌర్య‌. అక్క‌డే స‌హ‌జ (యుక్తి త‌రేజా`తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. అది ప్రేమ‌గా మారుతుంది. వీరి ప్రేమ పెళ్లికి అంగీక‌రాం తెలిపిన స‌హ‌జ తండ్రి (ముర‌ళీశ‌ర్మ‌) శౌర్య‌ది రాజ‌వ‌రం అని తెలిసి పెళ్లికి అడ్డుచెబుతాడు. ఇంత‌కీ ఆయ‌న అడ్డు చెప్ప‌డానికి కార‌ణం ఏంటీ?.. రంగ‌బ‌లి సెంట‌ర్ వెన‌కున్న క‌థేంటీ?..స‌హ‌జ తండ్రి అడ్డు చెప్ప‌డం వెన‌కున్న మిస్ట‌రీ ఎంటీ? .. రాజ‌వ‌రం ఎమ్మెల్యే ప‌ర‌శురామ్ (షైన్ టామ్ చికో) కు స‌హ‌జ తండ్రికున్న సంబంధం ఏంటీ? ..ప‌ర‌శురామ్‌ని శౌర్య ఎందుకు క‌లిశాడు?..ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన క‌థ‌.

బలాలు బలహీనతలు

ఎక్క‌డికో వెళ్లి ఎలాగోలా బ్ర‌త‌క‌డం కంటే సొంతూరులోనే సింహంలా బ్ర‌త‌కాల‌నుకునే ఓ యువ‌కుడి క‌థ‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అలాంటి ఓ యువ‌కుడి ప్రేమ‌క‌థ‌కు, అత‌ని సొంతూరిలోని ఓ సెంట‌ర్ వ‌ల్ల ఎదురైన స‌మ‌స్య కోసం, దాని ప‌రిష్కారం కోసం ఆ యువ‌కుడు ఎంత వ‌ర‌కు వెళ్లాడు? దాని ప‌ర్య‌వ‌సానంగా ఎలాంటి స‌వాళ్ల‌ని ఎదుర్కొన్నాడ‌న్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన క‌థ‌. ప్ర‌ధ‌మార్థం కామెడీతో సాగింది. ఇక సెకండ్ హాఫ్ అస‌లైన క‌థ‌లోకి వెళ్ల‌డంతో సెకండ్ హాఫ్ అంతా సిరీయ‌స్‌గా యాక్ష‌న్ నేఫ‌థ్యంలో సాగింది. శౌర్య పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ ఊరితో అత‌నికున్న అనుబంధాన్ని తెలియ‌జేస్తూ స‌ర‌దాగా సాగే స‌న్నివేశాలు ప్ర‌ధ‌మార్థంలో ఆక‌ట్టుకుంటాయి. గ‌ణేష్ విగ్ర‌హం కోసం ప‌క్క ఊరి వారితో గొడ‌వ‌కు దిగ‌డం వంటి స‌న్నివేశాల‌తో స‌ర‌దాగా సాగింది. స‌త్య ఎంట‌ర్ కావ‌డంతో ప్ర‌ధ‌మార్ధానికి మ‌రింత బ‌లం చేకూరింది.

హీరో, హీరోయిన్‌ల మ‌ధ్య సాగే ప‌రిచ‌యం స‌న్నివేశాలు, రొటీన్ ల‌వ్ ట్రాక్ పెద్ద‌గా ఆక‌ట్టుకోదు. రంగ‌బ‌లి సెంట‌ర్ వెన‌కున్న ర‌హ‌స్యాన్ని తెలుసుకునే క్ర‌మంలో వ‌చ్చే స‌న్నివేశాలు, ఈ నేప‌థ్యంలో ఊరి ఎమ్మెల్యేతో వైరం.. రంగ‌బ‌లి సెంట‌ర్‌కు శ‌ర‌త్ కుమార్‌కున్న సంబంధం ఫ‌ర‌వాలేదు అనిపించినా ప్రేక్ష‌కుడికి మాత్రం ప‌ర రొటీన్ అనిపిస్తుంది. రంగ‌బ‌లి సెంట‌ర్ వెన‌కున్న క‌థ‌లో బ‌లంలేదు. నాగ‌శౌర్య ఆ సెంట‌ర్ పేరు మార్చ‌డానికి చేసే ప్ర‌య‌త్నాలు సిల్లీగా ఉన్నాయి. దీంతో ద్వీతీయార్థం తేలిపోయింది.

న‌టీన‌టుల న‌ట‌న‌

శౌర్య పాత్ర‌లో ప‌క్కింటి కుర్రాడిలా నాగ‌శౌర్య త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇలాంటి క్యారెక్ట‌ర్ శౌర్య‌కు కొత్తేమీ కాదు. ఈ త‌ర‌హా పాత్రల‌ని చాలా సినిమాల‌లో చేశాడు. దీంతో శౌర్య క్యారెక్ట‌ర్‌గా చాలా ఈజ్‌తో చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఇక యాక్ష‌న్ స‌న్నివేశాల్లో శౌర్య మ‌రింత ఎన‌ర్జీతో క‌నిపించి ఆక‌ట్టుకున్నాడు. ఇక తెలుగులో తొలి సినిమా అయినా యుక్తి త‌రేజా స‌హ‌జంగా న‌టించింది. రొమాంటిక్ సాంగ్ లో త‌న‌దైన గ్లామ‌ర్ హోల‌తో ఆక‌ట్టుకుంది. ల‌వ్ ట్రాక్ పెద్ద‌గా పండ‌క‌పోయినా గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది.

ఎదుటివాడు సంతోష‌ప‌డితే త‌ట్టుకోలేని అగాదం అనే పాత్ర‌లో స‌త్య న‌వ్వులు పూయించాడు. గోప‌రాజు ర‌మ‌ణ‌, షైన్ టామ్ చాకో, స‌త్య‌, శ‌ర‌త్ కుమార్‌, క‌ల్యాణి న‌ట‌రాజ‌న్, ముర‌ళీశ‌ర్మ‌, బ్ర‌హ్మాజీ, స‌త్య‌, శివ‌న్నారాయ‌ణ న‌రిపెద్ది, అనంత శ్రీ‌రామ్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, స‌ప్త‌గిరి, నోయెల్ సేన్‌, భ‌ద్ర‌మ్‌, రాజ్ కుమార్ క‌సిరెడ్డి త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిథి మేర‌కు న‌టించారు. విలన్ పర్వాలేదనిపించాడు. శ‌ర‌త్ కుమార్ క‌నిపించేది కొంత సేపే అయినా త‌న ప్ర‌భావాన్ని చూపించారు.

ఎలా ఉందంటే..

`ల‌వ్ స్టోరీ` వంటి మూవీకి ప్ర‌ధాన హైలైట్గా నిలిచే పాట‌ల్ని అందించిన సంగీత ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ సీహెచ్ ఈ సినిమా సాంగ్స్ విష‌యంలో దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు. ప్ర‌ధాన క‌థ‌ని ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చడంలో మాత్రం విఫ‌లమ‌య్యాడ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక ఇది ద‌ర్శ‌కుడి తప్పు. అత‌ని ప్ర‌తిభ‌ని ద‌ర్శ‌కుడు ప‌వ‌న్‌ ఆశించిన స్థాయిలో రాబ‌ట్టుకోలేక‌పోయాడు. ప్రమోషన్స్ లో అంచనాలు పెంచి, ఎమోషన్స్ పండించడంలో విఫలమైంది మూవీ.