Liger: లైగర్ రివ్యూ: పూరీ పంచ్ మిస్ అయ్యింది..

  • Written By:
  • Updated On - August 25, 2022 / 06:16 PM IST

మూడేళ్ల ఎదురు చూపుల అనంతరం విడుదలైన విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబలో వచ్చిన లైగర్ సినిమా ఎట్టకేలకు ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ లో చూద్దాం.

కథ ఇదే..
కరీంనగర్ కు చెందిన ఓ యువకుడు ముంబై చేరి మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా ఎలా నిలిచాడు అనే పాయింట్ మీదే నడుస్తుంది. అయితే రొటీన్ స్పోర్ట్స్ డ్రామాగా లైగర్ తెరకెక్కింది. సినిమాలో హీరో విజయ్ దేవరకొండ, అతడి తల్లి రమ్యకృష్ణ ఇద్దరూ ముంబై చేరుకొని ఓ టీస్టాల్ నడుపుతుంటారు. తన కొడుకును ఓ మార్షల్ ఆర్ట్స్ స్టార్ గా రమ్యకృష్ణ కలలు కంటుంది. అందుకు తగ్గట్టుగానే, విజయ్ దేవరకొండ కూడా కష్టపడుతుంటాడు. అంతలోనే హీరోయిన్ అనన్య పాండేతో ప్రేమలో పడతాడు. అయితే హీరోకు ఉన్న నత్తి కారణంగా అతడిని పక్కన పెడుతుంది. ఇక తల్లి రమ్యకృష్ణ కూడా విజయ్ ప్రేమను అంగీకరించదు.చివరకు విజయ్ దేవరకొండ, తన ప్రేమను, మార్షల్ ఆర్ట్స్ లో తన లక్ష్యాన్ని అందుకున్నాడు అనేదే అసలైన పాయింట్.

విశ్లేషణ..
ఈ తరహా సినిమాను గతంలో పూరీ జగన్నాథ్ అమ్మనాన్న తమిళ అమ్మాయిగా మనందరి ముందు ఉంచి సూపర్ హిట్ కొట్టాడు. దీంతో అంతా ఆ సినిమా తరహాలో ఉంటుందేమో అంతా ఊహించారు. కానీ ఈ సినిమాలో అమ్మానాన్న తమిళ అమ్మాయిలోని, ఎమోషనల్, ఫ్యామిలీ ఫ్లేవర్ ఇందులో పూర్తిగా మిస్ అయ్యింది. నిజానికి ఈ సినిమాను పాన్ ఇండియా సబ్జెక్ట్ అని తీశారు. కానీ ఇలాంటి సబ్జెక్టులు చాలానే బాలివుడ్ లో వచ్చాయి. దంగల్, సుల్తాన్ లాంటివి హిట్ కొట్టగా, మరిన్ని సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. కానీ లైగర్ మాత్రం పూరీ మార్కు మిస్ అయ్యిందనే చెప్పాలి. పూరీ బలం తన స్క్రిప్ట్, డైలాగ్స్, హీరోకు నత్తి పెట్టడం వల్ల డైలాగ్స్ పేలలేదు. గతంలో దేశ ముదురు లాంటి సినిమాలను పూరీ జగన్నాథ్ కేవలం తన డైలాగ్స్, స్క్రీన్ ప్లేతో బ్లాక్ బస్టర్ కొట్టించాడు. కానీ ఆ మ్యాజిక్ లైగర్ లో కనిపించలేదు. ఇక ఈ సినిమాలో కనిపించిన మైక్ టైసన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనే చెప్పాలి. ఇక పాటలు పూర్తిగా మైనస్ అయ్యాయనే చెప్పాలి. గతంలో చక్రి, మణిశర్మ, అనూప్ రూబెన్స్, దేవి శ్రీతో కలిసి మ్యాజిక్ చేసిన పూరీ ఈ సారి మ్యూజిక్ విషయంలో పూర్తిగా తప్పులో కాలేశాడు. ఒక్కో పాటకు ఒక్కో మ్యూజిక్ డైరక్టర్ పెట్టడంతో పాటల్లో యునిక్ నెస్, మిస్ అయ్యింది. మొత్తానికి సినిమాతో వాట్ లాగదేంగే అని చెప్పిన విజయ్ పంచ్ మాత్రం మిస్ అయ్యింది.ఇక చివరగా సినిమాలో ప్రతీ డైలాగులోనూ బూతులు నిండిపోయాయి. సాలా అనే పదం ఇష్టం వచ్చినట్లు వాడేశారు. ఆఖరికి తల్లి పాత్ర వేసిన రమ్యకృష్ణ సైతం కొడుకు పాత్రలోని విజయ్ దేవరకొండను పట్టుకొని సాలా అంటుంది.ఇది ప్రేక్షకులకు కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది.

బాటం లైన్..
పంచ్ మిస్ అయ్యింది…