Hathya Movie : ఏపీలో జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘హత్య’. ధన్య బాలకృష్ణ, రవివర్మ, భరత్, పూజ రామచంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. మహాకాల్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి నిర్మాణంలో శ్రీవిద్య బసవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నేడు జనవరి 24న ఈ సినిమా రిలీజయింది.
కథ :
ఇల్లందులో ముఖ్యమంత్రి బాబాయ్ జేసి ధర్మేంద్ర రెడ్డి(రవి వర్మ) హత్యకు గురవుతారు. అయితే గుండెపోటుతో మరణించారు అని చెప్పినా ఇది హత్య అనే ఆరోపణలు వస్తాయి. అక్కడ హత్య జరిగిన ప్రదేశంలో ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో ముఖ్యమంత్రి కిరణ్(భరత్) ఓ సిట్ టీమ్ ని ఏర్పాటు చేసి దానికి స్పెషల్ ఆఫీసర్ గా సుధ(ధన్య బాలకృష్ణ)ని నియమించి ఈ కేసు ఆమెకు అప్పచెప్తాడు. అసలు ధర్మేంద్ర ఎలా చనిపోయాడు?హత్య ఎవరు ఎందుకు చేశారు? హత్య వెనక ఉన్న కోణం ఏంటి? సుధ ఈ కేసుని డీల్ చేసిందా? ధర్మేంద్రకు సలీమా (పూజా రామచంద్రన్)కు ఉన్న సంబంధం ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
నటీనటులు :
చాన్నాళ్ల తర్వాత ధన్య బాలకృష్ణ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించి మెప్పించింది. ధర్మేంద్ర రెడ్డి పాత్రలో రవి వర్మ కాస్త ఏజ్డ్ రాజకీయ నాయకుడిగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. పూజా రామచంద్రన్ కూడా తన పాత్రతో మెప్పిస్తుంది. శ్రీకాంత్ అయ్యంగార్, భరత్ రెడ్డి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
విశ్లేషణ :
ఈ సినిమా ట్రైలర్ రిలీజయినప్పటి నుంచి ఇది వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన కథ అని ప్రచారం జరిగింది. సినిమా చూస్తే కూడా అదే అర్ధమవుతుంది. కల్పిత పాత్రలు, కల్పిత కథ అని చెప్పినా ఇది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనే అర్ధమవుతుంది. అయితే కోర్టులో ఉన్న కేసు మీద ఎలాంటి స్టాండ్ తీసుకోకుండా ఒక మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తీయడం గమనార్హం.
ఫస్ట్ హాఫ్ లో హత్య జరగడం చూపించి, స్పెషల్ ఆఫీసర్ ఎంటర్ అవ్వడం, హత్య కేసుని డీలింగ్ చేయడం సాగుతుంది. ఇంటర్వెల్ నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మర్డర్ మిస్టరీని చూపించారు. రాజకీయ నేపథ్యం కథే అయినా మంచి మర్డర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా అనిపిస్తుంది. సినిమాలో కాస్త ఎమోషన్ కూడా పండించారు చివర్లో.
సాంకేతిక అంశాలు :
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కలర్ గ్రేడింగ్ కొత్తగా చూపించారు. మర్డర్ థ్రిల్లర్ కు తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అందరికి తెలిసిన పొలిటికల్ కథని ఆసక్తికరంగా మలిచి తెరపై చూపించడంలో డైరెక్టర్ శ్రీవిద్య బసవ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. నిర్మాణ పరంగా కూడా కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు.
సినిమా ప్లస్ లు :
సినిమాటోగ్రఫీ విజువల్స్
నటీనటుల పర్ఫార్మెన్స్
సినిమా మైనస్ లు :
ఫస్ట్ హాఫ్ లో కాస్త బోర్ కొట్టడం
సెకండ్ హాఫ్ లో లవ్ స్టోరీ
రేటింగ్ : 3/5