Bahumukham Review : ‘బహుముఖం’ మూవీ రివ్యూ.. సైకోగా మారిన నటుడు..

  • Written By:
  • Updated On - April 14, 2024 / 08:41 PM IST

Bahumukham Review : హర్షివ్ కార్తీక్(HarShiv Karthik), స్వర్ణిమ సింగ్, మరియా మార్టినోవా.. పలువురు మెయిన్ లీడ్స్ లో హర్షివ్ కార్తీక్ స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘బహుముఖం’. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన బహుముఖం సినిమాకు శ్రీ చరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫణి కళ్యాణ్ సంగీతం ఇచ్చారు. అమెరికన్ కెమెరామెన్ ల్యూక్ ఫ్లెచర్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. బహుముఖం సినిమా ఏప్రిల్ 5న థియేటర్స్ లో రిలీజయింది.

కథ..

తన్వీర్(హర్షివ్ కార్తీక్) చిన్నప్పుడే వాళ్ళ ఫ్యామిలీ అమెరికాలో స్థిరపడుతోంది. తన్వీర్ తల్లికి యాక్టింగ్ ఇష్టం ఉన్నా యాక్టర్ కాలేకపోతుంది. తల్లి కోరికని తీర్చాలని, తల్లి కాలేకపోయింది కాబట్టి తాను యాక్టర్ అవ్వాలని చిన్నప్పుడే అనుకుంటాడు తన్వీర్. కానీ అనుకోని పరిస్థితుల్లో తన్వీర్ జైలుకి వెళ్తాడు. జైలు నుంచి బయటకి వచ్చాక కూడా నటుడు అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అతన్ని అందరూ రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఒక సారి తన్వీర్ సైకో పాత్ర ఆడిషన్ కి వెళ్లి సరిగ్గా చేయకపోవడంతో విమర్శలు ఎదుర్కొంటాడు. దీంతో తన్వీర్ సైకో పాత్రని బాగా చేయాలని, మంచి నటుడు అవ్వాలని అనుకోకుండా నిజమైన సైకోలా మారిపోయి హత్యలు చేస్తుంటాడు. అసలు తన్వీర్ చిన్నప్పుడే జైలుకి ఎందుకు వెళ్ళాడు? తన్వీర్ సైకోలా ఎందుకు మారాడు? తన్వీర్ నటుడు అయ్యాడా? ఆ హత్యలు ఎందుకు చేసాడు? తన్వీర్ మళ్ళీ మాములు మనిషి అయ్యాడా అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ..

అమెరికాలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటున్న హర్షివ్ కార్తీక్ సినిమాల మీద ఉన్న ఫ్యాషన్ తో అక్కడే సినిమా తీసాడు. ఉదయం సినిమా తీస్తూ రాత్రి జాబ్ చేస్తూ సినిమా కోసం కష్టపడ్డాడు. ఈ సినిమాని తనే రాసుకొని దర్శకుడిగా తెరకెక్కిస్తూనే నిర్మించి మరో పక్క మెయిన్ లీడ్ లో కూడా నటించడం విశేషం. బహుముఖం సినిమా అంతా తన్వీర్ పాత్ర చుట్టే తిరుగుతుంది. ఇక ఈ సినిమా మొత్తాన్ని అమెరికాలోనే తీయడం గమనార్హం. తల్లి కలని తను నిజం చేయాలి అనే పాయింట్ తో పలు సినిమాలు వచ్చినా ఈ కథని సస్పెన్స్ సైకో థ్రిల్లర్ గా రాసుకొని కొత్తగా చూపించారు. ఫస్ట్ హాఫ్ లో మాత్రం స్క్రీన్ ప్లే కొంచెం సాగుతుంది. కథలో నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఆసక్తి ఉన్నా ట్విస్టులు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది. నటుడు అవ్వలేక సైకోగా మారిన పాయింట్ ని మాత్రం బాగానే చూపించారు.

నటీనటులు..

హర్షివ్ కార్తీక్ ఈ సినిమాని మొత్తం తనే నడిపించాడు. నటుడు అవ్వాలనే తపనతో ఉన్న పాత్రలో, మరో వైపు సైకోగా.. ఇలా రెండు పాత్రల్లోనూ అదరగొట్టాడని చెప్పొచ్చు. హీరోయిన్ గా నటించిన స్వర్ణిమ సింగ్ కొద్దిసేపే కనిపించి ఓకే అనిపిస్తుంది. ఇక అమెరికన్ నటి మరియా మార్టినోవా తన నటనతో మెప్పిస్తుంది. బహుముఖం సినిమా అంతా అమెరికాలోనే తీయడంతో అక్కడ అమెరికా నటీనటులు, అక్కడి ఇండియన్స్ ని తీసుకున్నారు. వారంతా కూడా పర్వాలేదనిపిస్తారు.

సాంకేంతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బహుముఖం సినిమాకి ప్లస్ అయ్యాయి. అమెరికా లోకేషన్స్ తో పాటు ప్రతి సన్నివేశాన్ని చక్కగా చూపించారు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు శ్రీ చరణ్ పాకాల అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడు. ఈ సినిమాకి కూడా అదే రేంజ్ లో ఇచ్చాడు. ఇక హర్షివ్ కార్తీక్ ఓ పక్క నటిస్తూనే మరో పక్క కథ, కథనం, దర్శకత్వం కూడా మొదటి సినిమాకే ఇంత పర్ఫెక్ట్ గా చేసాడంటే గ్రేట్ అని చెప్పొచ్చు. నిర్మాతగా కూడా సినిమాకి కావాల్సినంత బాగా ఖర్చుపెట్టాడు.

‘బహుముఖం’ సినిమా తల్లి కలని తన కలగా మార్చుకొని నటన అంటే పిచ్చిగా ఎదిగిన ఓ అబ్బాయి అనుకోకుండా సైకోలా మారితే ఎలా ఉంటుంది అని సస్పెన్స్ థ్రిల్లింగ్ తో తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.