Dirty Fellow: డర్టీ ఫెలో రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే!

  • Written By:
  • Publish Date - May 24, 2024 / 08:31 PM IST

నటీనటులు: శాంతిచంద్ర, దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ , సత్యప్రకాష్,నాగి నిడు
నిర్మాణ సంస్థ: రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: జి.యస్. బాబు
దర్శకత్వం: ఆడారి మూర్తి సాయి
సినిమాటోగ్రఫీ: రామకృష్ణ. యస్‌.
విడుదల తేది: మే 24, 2024

ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా నటించిన సినిమా ‘డర్టీ ఫెలో’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘డర్టీ ఫెలో’పై హైప్‌ క్రియేట్‌ అయింది. మంచి అంచనాలతో నేడు(మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

స్టోరీ ఏటంటే..

మాఫియా డాన్‌ జేపీ (నాగినీడు), శంకర్ నారాయణ (సత్య ప్రకాష్) ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు కలిసే సెటిల్‌మెంట్స్‌ చేస్తుంటారు. అయితే జేపీని తప్పిస్తే తనే మాఫీయా డాన్‌గా ఉండొచ్చని శంకర్‌ నారాయణ కుట్ర చేస్తాడు. జేపీని పోలీసులకు పట్టించే ప్రయత్నం చేస్తాడు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో శంకర్‌ నారాయణ కొడుకు చనిపోతాడు. దీంతో శంకర్‌ నారాయణ జేపీపై పగ పెంచుకుంటాడు. ఎప్పటికైనా నీ కొడుకు శత్రు అలియాస్‌ డర్టీ ఫెలో(శాంతి చంద్ర)ని తానే చంపుతానని జేపీకి వార్నింగ్‌ ఇస్తాడు. కట్‌ చేస్తే.. సిద్దు (శాంతి చంద్ర) ఓ గూడెంలోని పూజరి ఇంట్లో ఉంటూ.. అక్కడి పిల్లలకు చదువు చెబుతుంటాడు.

పూజారి కూతురు రాగ (దీపికా సింగ్) సిద్దుని చూసి ఇష్టపడుతుంది. అదే గ్రామానికి సేంద్రియ వ్యవసాయ పరిశోధన మీద చిత్ర (సిమ్రితి) వస్తుంది. ఆ గూడెం, ఆ అటవీ ప్రాంతాన్ని శంకర్ నారాయణ మనిషి పోతురాజు తన గుప్పిట్లో పెట్టుకుని ఉంటాడు. అలాంటి పోతురాజుని సిద్దు హతమార్చేస్తాడు. దీంతో సిద్దు, డర్టీ ఫెల్లో ఒక్కరే అని శంకర్ నారాయణ తెలుసుకుంటాడు? మరో వైపు సిద్దుని చిత్ర షూట్ చేస్తుంది? ఆ తరువాత ఏం జరుగుతుంది? అసలు డర్టీ ఫెల్లో, సిద్దు ఒకరేనా? చిత్ర ఎందుకు షూట్ చేసింది? శంకర్ నారాయణ చివరకు ఏం చేస్తాడు? అన్నది తెరపై చూడాల్సిందే.

మూవీ ఎలా ఉందంటే

మాఫీయా నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. డర్టీ ఫెలో కూడా అలాంటి సినిమానే. కానీ ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా యాడ్‌ చేయడంతో కాస్త కొత్తగా అనిపిస్తుంది. సినిమాలో వచ్చే కొన్ని ట్విస్టులు కూడా ఆకట్టుకుంటాయి. ఎక్కడా ల్యాగ్ ఉండదు. మూవీ బిగినింగ్ నుంచి అలా వెళ్తూ ఉంటుంది. యాక్షన్‌, ఎమోషన్స్‌, రొమాన్స్‌తో ఫస్టాఫ్‌లో కథనం చాలా ఫాస్ట్‌గా సాగుతుంది. హీరో ఎంట్రీ.. టైటిల్‌ సాంగ్‌… హీరోయిన్లతో రొమాన్స్‌ అన్ని యూత్‌ని ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభంలోనే డర్టీఫెలోని పరిచయం చేసి.. ఆ తర్వాత సిద్దు పాత్ర చుట్టు కథను నడించాడు దర్శకుడు. దీంతో అసలు సిద్దు, డర్టీఫెలో ఒకరేనా కాదా? అనే క్యూరియాసిటి ప్రేక్షకుల్లో కలిగేలా చేశాడు. అలాగే చిత్ర పాత్రను కూడా విభిన్నంగా తీర్చి దిద్దాడు. ఇంటర్వెల్‌ ముందు ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో మాఫియా డాన్‌ ‘డర్టిఫెలో’ చుట్టే కథనం సాగుతుంది. స్విమింగ్‌ ఫూల్‌ సీన్‌ అదిరిపోతుంది.

ఆర్టిస్టుల ఫర్మామెన్స్

సిద్దు, డర్టీ ఫెలొ పాత్రల్లో శాంతి చంద్ర చక్కగా నటించాడు. రెండు కారెక్టర్ల మధ్య వేరియేషన్స్‌ను చూపించాడు. యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ అదరగొట్టేశాడు. స్టైల్‌, యాక్షన్‌ తో మాస్‌ ఆడియన్స్‌ మెప్పించాడు. ఇక నాగి నీడు చాలా రోజుల తరువాత అందరినీ లెంగ్తీ పాత్రతో మెప్పించాడు. సత్య ప్రకాష్ విలనిజం చాలా రోజులకు మళ్లీ తెరపై కనిపించింది. పోతురాజు పాత్ర బాగుంది. దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ ముగ్గురూ కూడా తెరపై అందంగా కనిపించారు. ఈ మూడు పాత్రలకు మంచి ప్రాధాన్యం లభించింది. అన్ని పాత్రలకు ప్రాముఖ్యత ఉంది. అందరూ తమ పరిధి మేరకు నటించారు.

రేటింగ్ : 2.5/5