Simbaa Review : అనసూయ, జగపతి బాబు, వశిష్ట సింహ, శ్రీనాథ్, కబీర్ సింగ్, దివి.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా సింబా. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. కొత్త దర్శకుడు మురళి మనోహర్ రెడ్డి దర్శకత్వంలో సింబా సినిమా తెరకెక్కింది. ఈ సినిమా నేడు ఆగస్ట్ 9న థియేటర్స్ లో రిలీజయింది.
కథ :
తన భర్తకు యాక్సిడెంట్ లో కాళ్ళు పోవడంతో అక్ష(అనసూయ) టీచర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఒకరోజు రోడ్డు మీద వెళ్తుంటే ఒక వ్యక్తిని చూడగానే అక్ష అతని వెనుకే వెళ్లి అతన్ని చంపేస్తుంది. ఈ కేసుని పోలీసాఫీసర్ అనురాగ్(వశిష్ఠ సింహ) ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. జర్నలిస్ట్ ఫాజిల్(శ్రీనాథ్) కూడా ఈ మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. ఒక రోజు ఫ్యామిలీతో అక్ష, లవర్ ఇష్ట(దివి)తో ఫాజిల్, అనురాగ్ కేసు విచారణ కోసం ఒక షాపింగ్ ప్లేస్ కి వెళ్తారు. అక్కడ ఒక వ్యక్తిని చూడగానే అక్షతో పాటు ఈసారి ఫాజిల్ కూడా అతని వెనకాలే ఫాలో అయి చంపేస్తారు. ఈ కేసులో వీళ్ళని అనుమానించి అనురాగ్ అక్ష, ఫాజిల్ ని అరెస్ట్ చేస్తాడు.
చనిపోయిన ఇద్దరూ కూడా ఇండస్ట్రియలిస్ట్ పార్థ(కబీర్ సింగ్) మనుషులు కావడంతో అక్ష, ఫాజిల్ ని చంపేయాలని సిన్సియర్ ఆఫీసర్ అనురాగ్ ని కేసు నుంచి తప్పించి పార్థ తమ్ముడు, అతని మనుషులు అక్ష, ఫాజిల్ ని కోర్టుకు తీసుకెళ్తుండగా వారిపై అటాక్ చేస్తారు. కానీ అక్ష, ఫాజిల్ తో పాటు డాక్టర్ ఇరానీ(అనీష్ కురువిళ్ళ) కూడా మధ్యలో వచ్చి పార్థ తమ్ముడ్ని చంపేస్తారు. అసలు ఈ ముగ్గురు ఎందుకు పార్థ మనుషులను చంపుతున్నారు? అనురాగ్ కేసుని ఎలా సాల్వ్ చేసాడు? ఫారెస్ట్ మ్యాన్ అలియాస్ పురుషోత్తం రెడ్డి(జగపతిబాబు)కి ఈ ముగ్గురికి సంబంధం ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ :
ఈ సినిమా ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమానే అయినా సెల్యులర్ మెమరీ అనే ఓ కొత్త కాన్సెప్ట్ ని చూపించారు. అలాగే మొక్కలు నాటాలి, చెట్లను పెంచాలి అని పర్యావరణానికి సంబంధించి మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ అనసూయ, ఫాజిల్ గురించి చూపించి వాళ్ళు హత్యలు చేయడం, వాళ్ళని పోలీసులు పట్టుకోవడం, అయినా మళ్ళీ ఇంకో హత్య చేయడంతో అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఇంటర్వెల్ ముందు ఆసక్తి కలుగుతుంది, ఇక సెకండ్ హాఫ్ లో వీళ్ళు వింతగా ప్రవర్తించడానికి, మనుషులను చంపడానికి కారణం ఏంటి? పురుషోత్తం రెడ్డికి వీళ్లకు ఏంటి సంబంధం అని ఆసక్తిగా రివీల్ చేసారు. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఓ పక్క హత్యలు, థ్రిల్లింగ్ అంశాలతో మరో పక్క చెట్లు నాటాలి అని మెసేజ్ తో ఇంకో పక్క సెల్యులర్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్ తో డైరెక్టర్ ఈ సినిమాని కమర్షియల్ గా బాగానే హ్యాండిల్ చేసాడు.
నటీనటుల పర్ఫార్మెన్స్ :
అనసూయ ఓ పక్క టీచర్ గా మెప్పిస్తునే మరో పక్క యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేసింది. వశిష్ఠ సింహ పోలీసాఫీసర్ పాత్రలో కరెక్ట్ గా సెట్ అయ్యాడు. జర్నలిస్ట్ పాత్రలో శ్రీనాథ్ మెప్పిస్తాడు. జగపతి బాబు పర్యావరణ ప్రేమికుడిగా, ఫారెస్ట్ ఆఫీసర్ గా బాగా నటించారు. దివి ఒక చిన్న పాత్రలో అలరించింది. అనీష్ కురువిళ్ళ, కస్తూరి.. మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదనిపించారు.
సాంకేతిక అంశాలు :
సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం హెవీగా ఉంటుంది. సంపత్ నంది కొత్త కథని రాసుకున్నాడు. డైరెక్టర్ మురళి మోహన్ ఆ కథని చాలా బాగా తెరకెక్కించాడు. ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా బాగానే బాగానే హ్యాండిల్ చేసాడు. నిర్మాణ పరంగా కూడా సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.