ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో తన కొత్త ‘డిస్ట్రిక్ట్’ (Zomato District App) యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా సినిమా టికెట్ బుకింగ్, ఈవెంట్ బుకింగ్, రెస్టారెంట్ టేబుల్ రిజర్వేషన్ వంటి సౌకర్యాలు అందించనుంది. ఒకే యాప్ ద్వారా వినియోగదారులు సినిమాలు, లైవ్ ఈవెంట్స్, స్పోర్ట్స్ టికెట్లు, షాపింగ్, డైనింగ్ వంటి సేవలను పొందవచ్చు. ఇది జొమాటో వ్యాపారాన్ని విస్తరించేందుకు, వినోద రంగంలో కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు గొప్ప అవకాశం అని పరిశీలకులు భావిస్తున్నారు.
జొమాటో ఇప్పటికే పేటీఎం టికెటింగ్ వ్యాపారాన్ని రూ. 2,048 కోట్లకు కొనుగోలు చేసింది. టికెటింగ్ రంగంలో తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ఇది ఒక కీలక అడుగుగా చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ యాప్ ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఇది లభ్యం కానుంది. ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో ముందున్న జొమాటో, ఇప్పుడు టికెటింగ్ బిజినెస్‌ను మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు సినిమా టికెట్లు బుక్ చేసుకోవచ్చు, లైవ్ ఈవెంట్స్, స్పోర్ట్స్ టికెట్లను పొందవచ్చు. అలాగే, రెస్టారెంట్ టేబుల్ రిజర్వేషన్ కూడా చేయొచ్చు. అంటే ఫుడ్ ఆర్డర్ చేయడమే కాకుండా, బయటకు వెళ్లే ప్రణాళికలను కూడా ఒకే యాప్ ద్వారా సులభంగా చేయవచ్చు. వినియోగదారులకు ఇది మరింత అనుకూలంగా మారుతుందని కంపెనీ పేర్కొంది.
జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ మాట్లాడుతూ, “బయటకు వెళ్లేందుకు అవసరమైన అన్ని సేవలను ఒకే చోట అందించేందుకు డిస్ట్రిక్ట్ యాప్ రూపకల్పన చేయబడింది. ఇది వినియోగదారులకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని, జొమాటో మెయిన్ యాప్‌లోని ఫీచర్లను కూడా ఇందులో చేయనున్నామని” తెలిపారు. 2025 ఆగష్టు వరకు పేటీఎం టికెటింగ్ సేవలు కొనసాగుతాయని, ఆ తర్వాత పూర్తి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. మొత్తంగా, జొమాటో కొత్త డిస్ట్రిక్ట్ యాప్ వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించనుంది. ఫుడ్ డెలివరీ రంగాన్ని దాటి, వినోద, టికెటింగ్, డైనింగ్ సేవలందించే ఒక సమగ్ర ప్లాట్‌ఫామ్‌గా మార్చే దిశగా ఇది అడుగులు వేస్తోంది. ఈ యాప్ ద్వారా జొమాటో ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు, వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందించనుంది.