YS Sharmila : షర్మిల పాదయాత్రను జనం పట్టించుకోవడం లేదా..తెలంగాణలో పొలిటికల్ జర్నీకి ఫుల్ స్టాప్ పెడితే మంచిదా..?

తెలంగాణ రాజకీయాల్లో ఒక మెరుపులా దూసుకొచ్చిన వైఎస్ షర్మిల, అంతే వేగంగా రాజకీయ రంగంలో మసకబారిపోతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 08:46 AM IST

తెలంగాణ రాజకీయాల్లో ఒక మెరుపులా దూసుకొచ్చిన వైఎస్ షర్మిల, అంతే వేగంగా రాజకీయ రంగంలో మసకబారిపోతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని వైఎస్ఆర్ టీపీ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల, తన తండ్రి, సోదరుడి మార్గంలోనే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సుదీర్ఘ పాదయాత్ర చేస్తోంది. అయితే గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర తెలంగాణలోని చేవెళ్లలో ప్రారంభమై, శ్రీకాకుళంలోని ఇచ్చాపురం వరకూ సాగింది. అయితే ఆ పాదయాత్ర వల్ల రాజశేఖర్ రెడ్డి స్వపక్షంలోనే, కాదు, విపక్షాలను కూడా తోసి రాజని సీఎం అయ్యారు.

ఇక సోదరుడు వైఎస్ జగన్ సైతం 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చేసిన పాదయాత్ర సూపర్ హిట్ అయ్యింది. సుదీర్ఘకాలంగా సీఎం కావాలనే కలను జగన్ పాదయాత్రతో సాకారం చేసుకున్నాడు. అయితే వైఎస్ షర్మిల కూడా తెలంగాణలో చేపట్టిన పాదయాత్రకు స్పందన కరువు అయ్యిందనే చెప్పాలి. నిజానికి ప్రజా సమస్యలను అడ్రస్ చేస్తూ, ప్రజల బాగోగులు స్థితి గతులను పరిశీలిస్తూ, వారి మనసులకు దగ్గర చేసేదే పాదయాత్ర. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సరైన సమయంలో పాదయాత్రను ఎంచుకున్నారు. అప్పటి సీఎం చంద్రబాబు పరిపాలనలో కరెంటు చార్జీలు పెంచడంతో పాటు, వరుసగా వచ్చిన కరువులతో గ్రామీణ రైతాంగంలో అసంతృప్తి నెలకొని ఉంది. సరిగ్గా ఆసమయంలోనే వైఎస్ చేపట్టిన పాదయాత్ర సక్సెస్ అయ్యింది. అంతేకాదు ఉచిత విద్యుత్, రుణమాఫీలపై సంతకం పెడతానని వైఎస్ హామీ బాగా పనిచేసింది.

కానీ షర్మిల పాదయాత్ర కేవలం నామమాత్ర పార్టీ ప్రచారానికి సరిపోతుందని, ప్రజలు తమ సాధకబాధకాలను వినడానికి వచ్చిన నేతగా షర్మిలను గుర్తించడం లేదనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. షర్మిల రాజకీయ ప్రస్థానం తెలంగాణలో ప్రాంతీయ పార్టీ నేతగా కన్నా, కూడా జాతీయ పార్టీ ద్వారా అడుగు పెట్టి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీపై ప్రజల్లో అభిమానం ఉన్నప్పటికీ, దాన్ని ఓట్లు గా మార్చే శక్తి షర్మిల వద్ద లేదని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ మూలాలు కలిగి ఉన్న పార్టీలను తెలంగాణ ప్రజలు ఆదరించే అవకాశం లేదని, గతంలో ఎంతో బలంగా ఉన్న టీడీపీ ఉనికే కోల్పోయిందని, ఇప్పుడు షర్మిల పాదయాత్ర చేసినా ప్రయోజనం లేదనే వాదన వినిపిస్తోంది. ప్రాంతీయ పార్టీ కన్నా కూడా షర్మిల ఒక జాతీయ పార్టీ ద్వారా తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించి ఉంటే, ఆ పార్టీకి నిజంగానే తురుపు ముక్కగా షర్మిల నిలిచి ఉండేవారని విశ్లేషకులు భావిస్తున్నారు.