Site icon HashtagU Telugu

New Rules : క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా? 2022 అక్టోబర్ 1 రూల్స్ తెలుసుకోండి!!

Credit Card Emi

ఆమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌ వంటి థర్డ్ పార్టీ వెబ్ సైట్లలో, యాప్ లలో మీరు షాపింగ్ చేస్తారా ?వాటిలో పేమెంట్స్ కోసం మీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు నంబర్లు, సీవీవీ, ఎక్స్ పరీ డేట్ ఎంటర్ చేస్తారా ?అవన్నీ ఒకవేళ లీక్ అయితే.. హ్యాకర్ల చేతికి చిక్కితే ఇంకేమైనా ఉందా? అకౌంట్లో డబ్బులన్నీ ఖతమైతై!! ఈ పరిస్థితి డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగదారులకు ఎదురుకాకుండా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన పద్ధతే “టోకనైజేషన్”. వాస్తవానికి ఇది జులై ఒక‌టో తేదీ నుంచే అమ‌ల్లోకి రావాల్సి ఉంది. కానీ అమ‌లు గ‌డువును మూడు నెల‌లు(సెప్టెంబ‌ర్ 30 వర‌కు) పొడిగిస్తున్నట్లు ఆర్​బీఐ ప్రకటించింది. కొన్ని భాగ‌స్వామ్య ప‌క్షాల ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకుని అమలును వాయిదా వేసినట్లు తెలిపింది.

ఏమిటీ టోకనైజేషన్?

ఇప్పటివరకు థర్డ్ పార్టీ యాప్స్, వెబ్ సైట్ల ద్వారా పేమెంట్స్ చేసేటప్పుడు డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలన్నీ ఎంటర్ చేసేవాళ్ళం. ఇకపై డెబిట్/క్రెడిట్ కార్డు నెట్ వర్క్ జారీ చేసే టోకెన్ నంబర్ ను ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఫలితంగా మీ కార్డు వివరాలు థర్డ్ పార్టీ యాప్ లలో నిక్షిప్తం కావు. ఎవరైనా ఒక వినియోగదారుడు తన కార్డుకు సంబంధించిన టోకనైజేషన్‌ కోసం వచ్చే విజ్ఞప్తిని అంగీకరించే సంస్థను “టోకెన్‌ రిక్వెస్టర్‌ ” అంటారు. ఈ టోకెన్‌ రిక్వెస్టర్‌, సంబంధిత టోకెన్‌ జారీ చేయడం కోసం ఆ విజ్ఞప్తిని కార్డు నెట్‌వర్క్‌(మాస్టర్‌ కార్డు, వీసా లేదా రుపే)కు పంపిస్తుందన్నమాట. ఆ తర్వాత కార్డు జారీ చేసిన బ్యాంకులకు సమాచారం అందుతుంది. తాజాగా అన్ని ఆన్‌లైన్‌ చెల్లింపు గేట్‌వేలు, వ్యాపారులు, ఇ-కామర్స్‌ కంపెనీలు తమ వినియోగదార్లకు చెందిన కార్డుల టోకనైజేషన్‌ను అమలు చేయాలని ఆర్‌బీఐ కోరింది. ఆర్బీఐ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ కార్డ్ టోకెనైజేషన్ సిస్టం తప్పనిసరి కాదు. సమ్మతంలేని వినియోగదారులు లావాదేవీ జరిపిన ప్రతిసారి తమ డెబిట్‌, క్రెడిట్‌ కార్డు పేరు, కార్డ్ నంబర్, సీవీవీ, ఇతర వివరాలు ఎంటర్ చేసి ఆన్‌లైన్ పేమెంట్లు చేసుకోవచ్చు. ఈ టోకెనైజేషన్ సిస్టమ్ ఇండస్ట్రీకి కొత్త. ఇప్పటి వరకు ఇలాంటి విధానాన్ని ఇండస్ట్రీ వర్గాలు అమలు చేయలేదు. దీంతో ఇండస్ట్రీలో ఈ విధానంపై కాస్త గందరగోళం నెలకొంది. ఈ టోకెనైజేషన్ విధానంలో కస్టమర్ల కార్డుల వివరాలు ప్రత్యేకంగా జనరేట్ చేసిన కోడ్‌‌తో రీప్లేస్ అవుతాయి.