Horseshoe Crab : వ్యాక్సిన్ల కోసం రక్తం ధారపోస్తున్న పీతలు.. వాటి లీటరు రక్తం రూ.12 లక్షలు!!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావడం అంటే ఇదేనేమో!! మనుషుల ప్రాణాలు నిలిపేందుకు పెద్దఎత్తున కరోనా వ్యాక్సిన్ల తయారీ జరుగుతుండటంతో .. హార్స్ షూ జాతి పీతల సంఖ్య తగ్గిపోతోంది.

  • Written By:
  • Publish Date - July 17, 2022 / 10:00 AM IST

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావడం అంటే ఇదేనేమో!! మనుషుల ప్రాణాలు నిలిపేందుకు పెద్దఎత్తున కరోనా వ్యాక్సిన్ల తయారీ జరుగుతుండటంతో .. హార్స్ షూ జాతి పీతల సంఖ్య తగ్గిపోతోంది. వాటి ఉనికే ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరుగుతుంటే.. పీతలకు ప్రాణ గండం చుట్టు ముట్టడం ఏమిటనే సందేహం వచ్చిందా ? దీనికి సమాధానం దొరకాలంటే ఈ కథనం చదవాల్సిందే.

రక్తంతో నిలుపుతుంది వ్యాక్సిన్ ను..

“రక్తంతో నడుపుతాను రిక్షాను.. నా రక్తమె నా రిక్షకు పెట్రోలు” అని ఓ సినీ కవి చెప్పారు. మనిషి తన రక్తాన్ని పెట్రోలుగా మార్చుకొని రిక్షా తొక్కడం అసాధ్యం.. కానీ హార్స్ షూ జాతి పీతల రక్తాన్ని ఇంధనంగా మార్చి మన వ్యాక్సిన్లకు ప్రాణ ప్రతిష్ట చేస్తున్నాయి. వెయ్యి కోట్లలో ఒక వంతు బ్యాక్టీరియా వంటి ప్రమాదకర సూక్ష్మజీవులు ఉన్నా గుర్తించగల సామర్థ్యం హార్స్ షూ పీతల సొంతం. 1960వ దశకంలో శాస్త్రవేత్తలు ఈ ప్రత్యేకతను గుర్తించారు. నాటి నుంచీ… వ్యాక్సిన్లు, ఇంజెక్షన్లు, సర్జికల్‌ ఇంప్లాంట్లు ప్రమాదకర బ్యాక్టీరియా, సూక్ష్మజీవులతో కలుషితం కాలేదని తేల్చుకునేందుకు ఈ పీతల రక్తాన్ని వినియోగించడం మొదలైంది.‘హార్స్‌షూ’ పీతల రక్తం లేత నీలి రంగులో ఉంటుంది. దీనికి కారణం..వాటి రక్త కణాల్లో ఉండే రాగి అణువులే. అందుకే  హార్స్ షూ జాతి పీతల రక్తాన్ని నీలి బంగారం (బ్లూగోల్డ్‌) అని పిలుస్తుంటారు.

ధర తెలిస్తే నోరెళ్ళబెడతారు..

కరోనా మహమ్మారి మొదలైన తర్వాత వందల కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నారు. వాటన్నింటినీ హార్స్‌షూ పీత రక్తంతో పరీక్షించి, భద్రమని తేల్చాకే మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.
వ్యాక్సిన్ల ఉత్పత్తి లో ఈవిధంగా అత్యంత కీలకంగా మారిన హార్స్‌షూ’ పీతల లీటర్ రక్తం ధర ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్య పోతారు. ఒక లీటరు రక్తం ధర రూ.12 లక్షలు. ఇంతటి రేటు ఉండటానికి కారణం.. హార్స్‌షూ పీతల సేకరణ, నిల్వ, రవాణా, రక్తం తీయడం వంటివన్నీ అత్యంత వ్యయ ప్రయాసలతో కూడుకున్న అంశాలు.

రక్తాన్ని ధారపోస్తున్నాయి..

సముద్ర తీర ప్రాంతాల్లో హార్స్‌షూ
పీతలను సేకరిస్తారు.ఆ వెంటనే వాటిని ల్యాబ్‌కు తీసుకొస్తారు. అక్కడ వాటి బరువును తూచి, రక్తం సరిపడా ఉన్నవాటిని వేరుచేస్తారు. రక్తం బాగా ఉన్న పీతల గుండెకు సూదులుగుచ్చి రక్తం సేకరిస్తారు. శరీరంలో ఉండే సగానికిపైగా రక్తాన్ని లాగేశాక.. తీసుకెళ్లి తిరిగి సముద్రంలో వదిలేస్తారు. ఈక్రమంలో శరీరంలో రక్తం బాగా తగ్గిపోయి దాదాపు మూడో వంతు పీతలు చనిపోతుంటాయి.గత 40 ఏళ్లలో ఈ పీతల సంతతి 80 శాతం మేర అంతరించి పోయిందని అంచనా.సాధారణంగా ఏటా ఒక్క అమెరికా తూర్పు తీరప్రాంతంలోనే 5 లక్షలకుపైగా ‘హార్స్‌షూ’ పీతలను సేకరిస్తారని అంచనా. అంతేకాదు మెక్సికో, చైనా, మరికొన్ని దేశాల్లోనూ భారీ ఎత్తున హార్స్‌షూ పీతలను సేకరిస్తుంటారు.

రక్తంతో ఏం చేస్తారు ? ఎలా చేస్తారు ?

* హార్స్‌షూ పీత రక్త కణాలను వేరుచేసి ‘ఎల్‌ఏఎల్‌ (లిమ్యులస్‌ అమిబోసైట్‌ లైసేట్‌)’ను ఉత్పత్తి చేస్తారు.
* వ్యాక్సిన్లు, యాంటీ బయాటిక్స్, ఇతర ఇంజెక్షన్లు, ఔషధాలలో ప్రతి బ్యాచ్‌ను ఈ ఎల్‌ఏఎల్‌తో పరీక్షిస్తారు.
* సదరు వ్యాక్సిన్‌/ఇంజెక్షన్‌/ఔషధంలో ప్రమాదకర బ్యాక్టీరియా ఏమాత్రం ఉన్నా.. ఎల్‌ఏఎల్‌ గుర్తిస్తుంది.
* బ్యాక్టీరియా ఉన్నట్టు సదరు వ్యాక్సిన్‌/ఔషధాన్ని పడేస్తారు లేదా శుద్ధిచేసి మళ్లీ పరీక్షిస్తారు.
* శరీరం లోపల అమర్చే స్టెంట్లు, పేస్‌మేకర్లు, ఇతర ఇంప్లాంట్లు, సర్జికల్‌ పరికరాలను కూడా ఎల్‌ఏఎల్‌తో పరీక్షిస్తారు.
* హార్స్‌షూ పీతల రక్తం నుంచి తీసే ‘ఎల్‌ఏఎల్‌’ ద్వారా ‘సెప్సిస్‌’ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు.

పీతలందు ఈ పీత వేరయా..

తాబేలు లాంటి తల.. తలపై పది కళ్లు.. డొప్ప మధ్యలో వేలాడుతున్నట్టుగా శరీరం.. పదునుగా ఉండే ముళ్లు.. మధ్య నుంచి పొడవాటి తోక ఉండే జీవి ‘హార్స్‌షూ పీత. దీనికి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ.