Nasa : నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ .. నీ అడుగు జాడలు “స్ట్రాంగ్” అంటున్న నాసా.. ఎందుకు?

  • Written By:
  • Publish Date - July 22, 2022 / 01:00 PM IST

సరిగ్గా 53 ఏళ్ల క్రితం, 1969 జులై 20న “అపోలో11” మిషన్ ద్వారా తొలిసారిగా చందమామపై మనిషి కాలు మోపాడు. ఆ రోజున చందమామపై అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తొలి అడుగు పెట్టారు. ఆ అడుగు జాడల ముద్ర నేటికీ చెరిగిపోలేదని నాసా ప్రకటించింది. 53 ఏళ్ల కింద చంద్రుడిపై పడిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, కమాండ్ మాడ్యూల్ పైలట్ మైకేల్ కాలిన్స్, లూనార్ మాడ్యూల్ పైలట్ ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్ ల అడుగు జాడలు ఏళ్ళు గడిచినా ఇప్పటికీ అలాగే పదిలంగా ఉన్నాయని వెల్లడించింది. ఈమేరకు వివరాలతో ట్విట్టర్ వేదికగా నాసా ఒక వీడియోను పోస్ట్ చేసింది. నాసా రోబోటిక్ వ్యోమనౌక “లూనార్ రెకనైజన్స్ ఆర్బిటర్” ఇటీవల ఈ వీడియోను తీసి పంపిందని వెల్లడించింది. 1969 జులై 16న నింగికి ఎగిసిన అపోలో11 మిషన్ నాలుగు రోజుల్లో చంద్రుడిపై ల్యాండ్ అయింది.

ఫ్యూచర్ ప్లాన్ ఇదీ..

2025 సంవత్సరంకల్లా చంద్రుడి దక్షిణ ధ్రువంపై మనిషి కాలు మోపాలనే లక్ష్యంతో ఒక మిషన్ రూపుదిద్దుకుంటోంది. అదే “ఆర్టెమిస్ 1” మిషన్. 2017 డిసెంబరు నుంచే ఈ మిషన్ కు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా తొలి విడత ప్రయోగాత్మకంగా ఈ ఏడాది ఆగస్టు 29న మూడు బొమ్మలను “ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్” ద్వారా చంద్రుడిపైకి పంపుతారు. ఇది విజయవంతం అయితే.. 2023 సంవత్సరంలో నేరుగా వ్యోమగాములను లూనార్ లూప్ లోకి పంపుతారు. ఆ తర్వాత 2025కల్లా వ్యోమగాములను చంద్రుడి దక్షిణ ధృవంపైకి దింపాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

 

నాటి అపోలో 11కు పునాది పడింది ఇలా…

1969 మే 25న అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ… అపోలో స్పేస్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. మనుషులతో కూడిన స్పేస్ ప్రూబ్‌ని చందమామపైకి పంపబోతున్నట్లు తెలిపారు. ఆ తర్వాత రేంజర్ 7 అనే మనుషులు లేని మిషన్‌ను చందమామపైకి పంపారు. అది జాబిల్లికి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ క్లోజ్ ఫొటోలను ప్రపంచానికి చూపించింది. ఆ తర్వాత అపోలో 8 మిషన్ ద్వారా వ్యోమగాములను చందమామ చెంతకు పంపింది నాసా. ఈ ప్రోగ్రామ్‌లో చందమామపై కాలు పెట్టలేదు గానీ… 10 సార్లు చందమామ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత అపోలో 11 చందమామపై దిగింది. తొలిసారి ముగ్గురు వ్యోమగాములు చందమామపై కాలు పెట్టారు.