సునామీ, భూకంపాలు అంటే ఎవరైనా వణికిపోతారు. అవి వస్తాయనే సంకేతం ఇచ్చే ఒక చేపను చిలీలో సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారుల బృందం గుర్తించింది. రాకాసి చేప ,ఓర్ ఫిష్ వంటి పేర్లతో పిలిచే ఈ అరుదైన చేప 16 అడుగుల పొడవు ఉంది. ఇది సముద్ర గర్భపు లోతుల్లో జీవిస్తుంది. భూమి పొరల్లో కదలికలు వచ్చినప్పుడు మాత్రమే సముద్రజలాల ఉపరితలానికి అవి వస్తాయి. ఈ చేప సముద్ర జలాల్లో పైకి వచ్చిందంటే.. సముద్ర గర్భంలో భారీ భూకంపాలు సంభవిచ్చి నట్టుగా భావించాల్సి ఉంటుందని అంటున్నారు. తొలుత ఈ వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడంతో దాదాపు 10 మిలియన్ల ఓట్లు వచ్చాయి.
చిలీ కంటే ముందు ఏప్రిల్ నెలలో న్యూజిలాండ్‌లో ఒక ఓర్ ఫిష్ కనిపించింది. స్థానికంగా బీచ్‌కు వెళ్లినవారు దీనిని గుర్తించారు. ఓర్ ఫిష్ కనిపిస్తే ఏదో కీడు జరగబోతోందని కొన్ని చోట్ల పూర్వకాలం నుంచి నమ్ముతున్నారు. ముఖ్యంగా సునామీ, భూకంపాలు వస్తాయని విశ్వసించేవారని మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే ఈ సిద్ధాంతాన్ని సైన్స్ నిర్ధారించలేదు. కాగా ప్రస్తుతం ఈ చేప జలాలపైకి రావడానికి కారణం ఏంటో అధికారులు గుర్తించాలని సూచనలు అందుతున్నాయి. ఈ చేపలు సముద్రపు నీటి అడుగున జీవిస్తాయి. అయితే ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు, బ్రీడింగ్ సమయంతోపాటు చనిపోయాక కూడా జలాలపైకి వస్తాయని నిపుణులు వివరించారు. ఈ చేపలు కనిపించడం చాలా అరుదు.