Site icon HashtagU Telugu

Valeria Marquez: బ్యూటీ సెలూన్‌లో టిక్ టాక్ ఇన్ఫ్లుయెన్సర్ కాల్చివేత…

Valeria Marquez

Valeria Marquez

Valeria Marquez: మెక్సికో నగరాన్ని కలకలం రేపిన దారుణ ఘటనలో, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ వలేరియా మార్క్వెజ్ (23) టిక్‌టాక్ లైవ్ స్ట్రీమ్ చేస్తున్న సమయంలోనే అఘాయిత్యానికి గురయ్యారు. గిఫ్ట్ ఇచ్చే నెపంతో ఆమె బ్యూటీ సెలూన్‌లోకి ప్రవేశించిన ఓ దుండగుడు విచక్షణ లేకుండా కాల్పులు జరిపాడని జాలిస్కో రాష్ట్ర ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది.

వివరాల్లోకి వెళితే, జాలిస్కో రాష్ట్రంలోని గ్వాడలజారా నగరంలో “బ్లోసమ్ ది బ్యూటీ లాంజ్” అనే పేరుతో వలేరియా మార్క్వెజ్ ఒక బ్యూటీ సెలూన్‌ను నడుపుతున్నారు. ఘటన జరిగే సమయంలో ఆమె సెలూన్‌లో నుంచే టిక్‌టాక్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు.

ఆర్టీ (RT) వార్తా సంస్థ ఎక్స్‌ (X) లో షేర్ చేసిన వీడియో క్లిప్‌ ప్రకారం, ఆమె ఒక టేబుల్ వద్ద కూర్చుని చేతిలో ఒక మెత్తటి బొమ్మను పట్టుకుని తన స్నేహితులతో ముచ్చటిస్తున్నట్లు కనిపించింది. కాల్పులు జరగడానికి కాస్త ముందు “వారు వస్తున్నారు” అని ఆమె అనడం, ఆ వెంటనే మరో వ్యక్తి “హే, వేల్?” అని పిలవడం, దానికి ఆమె “అవును” అని సమాధానం ఇవ్వడం వినిపిస్తుంది. ఆ తర్వాత లైవ్ స్ట్రీమ్ మ్యూట్ చేయబడింది.

కొద్ది క్షణాల్లోనే కాల్పుల శబ్దాలు స్పష్టంగా వినిపించాయి. వెంటనే వలేరియా మార్క్వెజ్ తన పక్కటెముకలను పట్టుకుని టేబుల్‌పై కుప్పకూలిపోయారు. అనంతరం ఒక వ్యక్తి ఆమె ఫోన్‌ను తీసుకుంటున్నట్లు కనిపించింది. ఆ వ్యక్తి ముఖం కొన్ని క్షణాల పాటు లైవ్ స్ట్రీమ్‌లో కనిపించి, ఆపై వీడియో ఆగిపోయిందని సమాచారం.

ఇదే లైవ్ స్ట్రీమ్‌లో కొంతసేపు ముందు, తాను సెలూన్‌లో లేనప్పుడు ఎవరో వ్యక్తి ఖరీదైన బహుమతితో వచ్చారని, అయితే తనకు అతని కోసం వేచి ఉండాలని అనిపించలేదని మార్క్వెజ్ కొంత ఆందోళనతో చెప్పినట్లు పేర్కొంటున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం, దుండగుడు మోటార్‌సైకిల్‌పై వచ్చి, బహుమతి ఇస్తానని చెప్పి సెలూన్‌లోకి ప్రవేశించాడు. అనంతరం అతను విచక్షణలేకుండా కాల్పులు జరిపాడు. మార్క్వెజ్ ఛాతీ, తలపై బుల్లెట్లతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లలో కలిపి దాదాపు రెండు లక్షల మంది ఫాలోవర్లను కలిగిన మార్క్వెజ్, తరచుగా బ్యూటీ, లైఫ్‌స్టైల్ అంశాలపై వీడియోలు పోస్ట్ చేసేవారు. ఆమె మృతి నెట్టింట తీవ్ర విచారం కలిగిస్తోంది.