Sukanya Samriddhi Yojana: ఈ పథకంలో అత్యధిక శాతం వడ్డీ పొందే అవకాశం

జీతం రాగానే ఏదైనా పొదుపు పథకంలో కొంత సేవింగ్స్ చేయాలనుకుంటున్నారా?

Published By: HashtagU Telugu Desk
Sukanya Samriddhi Yojana

Sukanya Samriddhi Yojana

సుకన్య సమృద్ధి యోజన పథకం (Sukanya Samriddhi Yojana) తో ఆడపిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పొదుపు పథకంతో (Savings Scheme) ఆడపిల్లల తల్లిదండ్రులు వారి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందనవసరం లేదు. ఈ పథకం కింద అత్యధికంగా 7.6 శాతం వడ్డీని లబ్ధిదారులు అందుకోవచ్చు. మీ దగ్గరిలో ఉన్న ఏ బ్యాంకు నుంచైనా లేదా పోస్టాఫీస్‌ నుంచైనా ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌ను తెరవవచ్చు. పుట్టిన ఆడపిల్లల నుంచి 10 ఏళ్ల లోపు ఆడపిల్లల పేరు పైన వారి తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. 10 ఏళ్లు పూర్తయిన ఆడపిల్లలకు ఈ స్కీమ్ వర్తించదు. 10 ఏళ్లలోపు ఆడ పిల్లలకు తల్లిదండ్రులు అకౌంట్ ఓపెన్ చేయిస్తే.. ఆడపిల్లలు 18 ఏళ్లు వచ్చిన తరువాత అకౌంట్ హోల్డర్లుగా మారుతారు.

ఒక కుటుంబంలో కేవలం ఇద్దరు ఆడపిల్లల పేర్లు మీద మాత్రమే ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయడానికి వీలుంటుంది. ఒకే గర్భంలో ఇద్దరు, ముగ్గురు ఆడపిల్లలు పుడితే వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత 15 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు డబ్బును జమచేయవలసి ఉంటుంది. ఒక వేళ ఆడపిల్లకు 21 ఏళ్లు పుర్తయితే ఈ స్కీమ్ కూడా మెచ్యురిటీలోకి వస్తుంది. ఆడపిల్ల పేరుపైన అకౌంట్ ఓపెన్ చేసిన తల్లిదండ్రులు ప్రతీ సంవత్సరం కనీసం రూ.250 డిపాజిట్ చేయవలసి ఉంటుంది. రూ.250 నుంచి రూ.1.5 లక్షల వరకు ఎంతైనా తల్లితండ్రులు జమ చేయవచ్చు. 15 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ప్రతీ నెల కొంత లేదంటే సంవత్సరానికి ఒకే సారి లెక్కన డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంది. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌లో ప్రతీ సంవత్సరం కనీసం రూ.250 డిపాజిట్ చేయవలసి ఉంటుంది. లేదంటే అకౌంట్‌ను ఇనాక్టివ్ అకౌంట్‌గా పరిగణించి రూ.50 ఫైన్ విధిస్తారు.

సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana) కింద జమ చేసిన మొత్తం నగదుపై ప్రభుత్వం 7.6 శాతం వడ్డీని అందిస్తుంది. ప్రతీ సంవత్సరం ఆ సంవత్సర ఆర్ధిక సంవత్సర చివర్లో ఈ వడ్డీని అకౌంట్‌లో జమ చేస్తారు. ఆ మొత్తం సొమ్ముపై ఎటువంటి ఇన్‌కమ్ ట్యాక్స్‌ను వసూలు చేయరు. ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఆడపిల్లకు జమ చేసిన అమౌంట్‌కు మెచ్యురిటీ వచ్చేవరకు మూడు నుంచి నాలుగు రెట్ల లాభాన్ని పొందుతారు. ఉదాహరణకు ఆడపిల్ల పుట్టినప్పుడు అకౌంట్ ఓపెన్ చేసి నెలకు రూ.1000 డిపాజిట్ చేస్తే.. 15 ఏళ్లకు రూ.1 లక్ష 80 వేలు అవుతుంది. మొదట 15 సంవత్సరాలు తరువాత ఆడపిల్లకు 21 ఏళ్లు వచ్చే వరకు అంటే.. ఇంకో 6 సంవత్సరాలు వడ్డీ కలపుకుంటే మొత్తం రూ.5,27,445 అవుతుంది. ఈ పథకంతో తల్లిదండ్రులు అకౌంట్‌లో వేసేది కొంత డబ్బే అయినప్పటికీ ఆడపిల్లకు 21 ఏళ్లు వచ్చే వరకు పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది.

Also Read:  Rent Now, Pay Later: “రెంట్ నౌ, పే లేటర్” చేతిలో డబ్బు లేకున్నా అద్దె కట్టండి

  Last Updated: 03 Mar 2023, 02:41 PM IST