ఎన్నో జంతు జాతులు అంతరించాయి !! అయితే వాటిలో ఒక జంతు జాతిని మళ్ళీ పుట్టించే దిశగా ప్రయోగాలు మొదలయ్యాయి. దాని పేరే “టాస్మానియన్ టైగర్”. పేరులో టైగర్ ఉంది కదా అని దాన్ని టైగర్ అనుకోకండి. అదొక తోడేలు మాత్రమే.
ఎందుకీ ప్రయోగం..
ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ యూనివర్సిటీ పరిశోధకులు, అమెరికాలోని Colossal అనే సంస్థ సంయుక్తంగా అంతరించిపోయిన “టాస్మానియన్ టైగర్” జాతికి మళ్ళీ జీవం పొసే ప్రయోగంలో నిమగ్నమయ్యాయి. మొత్తం 35 మంది శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో పాల్గొంటున్నారు. వాస్తవానికి “టాస్మానియన్ టైగర్” జాతి తోడేళ్ళ ఉనికి 1936 సంవత్సరం నాటికే ముగిసినట్లు తెలిసింది.”టాస్మానియన్ టైగర్” ఉండగా ఆస్ట్రేలియాలోని అడవుల్లో జీవావరణ వ్యవస్థ లో సమతుల్యత ఉండేది. అవి 1930వ దశకంలో అంతరించినప్పటి నుంచి అడవుల్లో జీవావరణ వలయం దెబ్బతింది.దీంతో అడవులలోని జంతువుల ఆహార చక్రం దెబ్బతింది. ఫలితంగా ఎన్నో జంతువులు దారితప్పి.. అడవుల నుంచి నేరుగా ఏజెన్సీ గ్రామాలపైకి దండెత్తి వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. ఇవన్నీ ఆగాలంటే మళ్ళీ “టాస్మానియన్ టైగర్”ను రంగంలోకి దింపాల్సిందే అని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.
ప్రయోగం ఇలా..
ఈనేపథ్యంలో “టాస్మానియన్ టైగర్” జాతికి తిరిగి ల్యాబ్ లో ప్రాణ ప్రతిష్ట చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా 1930వ దశకం సమయంలో ల్యాబ్ లో భద్రపర్చిన “టాస్మానియన్ టైగర్” క్షీరదాల పిండాలను .. 108 ఏళ్ల క్రితం “టాస్మానియన్ టైగర్” నుంచి సేకరించిన డీ ఎన్ ఏ జన్యువులను వినియోగించి ల్యాబ్ లో సరికొత్త సృష్టి చేయబోతున్నారు. CRISPR editing, జీనోమ్ ఇంజినీరింగ్ అనే టెక్నాలజీల ద్వారా “టాస్మానియన్ టైగర్” డీ ఎన్ ఏ జన్యువుల్లో పలు కీలక మార్పులు కూడా చేయబోతున్నారు.ఇలా మార్పులు చేసిన “టాస్మానియన్ టైగర్” డీ ఎన్ ఏ జన్యువులను Dasyurid అనే మరో క్షీరదం యొక్క జన్యువుల్లోకి ప్రవేశపెడతారు. ఆ జన్యువులను Dasyurid అనే క్షీరదం గుడ్డులోకి పంపిస్తారు. ఆ గుడ్డులోనే “టాస్మానియన్ టైగర్” కు సంబంధించిన పిండం వృద్ధి చెందుతుంది. ఇదంతా జరిగిన 42 రోజుల తర్వాత “టాస్మానియన్ టైగర్” మళ్ళీ భూమిపైకి అడుగుపెడుతుంది.