భూమి ఎలా ఏర్పడింది ? భూమిపై ఉండే రాళ్లు రప్పలు, మట్టి ఎక్కడివి? అనే ప్రశ్నలు నేటికీ పెద్ద మిస్టరీయే!! దీనికి సంబంధించి గతంలో ఎన్నో సిద్ధాంతాలు తెరపైకి వచ్చినప్పటికీ.. వాటితో ముడిపడిన ఆధారాలు వెలుగులోకి రాలేదు. ఈనేపథ్యంలో భూమిపై పరిశోధనలు చేస్తున్న స్విట్జర్లాండ్ లోని ETH ZURICH యూనివర్సిటీ, నేషనల్ సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్ ఇన్ రీసెర్చ్ ప్లానెట్స్ శాస్త్రవేత్తలు ఓ కొత్త విషయాన్ని గుర్తించారు. కోన్ డ్రైటిక్ ఆస్టరోయిడ్స్ లోని కణాల సమ్మేళనంగా భూమి ఏర్పడింది అనే సిద్ధాంతం గతంలో ప్రచారంలో ఉండేది. తాజా అధ్యయనంలో మాత్రం అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. కోన్ డ్రైటిక్ ఆస్టరోయిడ్స్ పై ఉన్న దాని కంటే తక్కువ సంఖ్యలో భూమిపై హీలియం, హైడ్రోజన్ అణువులు ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాలక్రమంలో భూమిపై ఉన్న హీలియం, హైడ్రోజన్ అణువులు ఆవిరి అయ్యాయనే విశ్లేషణ కూడా ఉంది.
విత్తన గ్రహాలు “ప్లానెటెజీమల్స్”..
ఇక మరో థియరీపైనా శాస్త్రవేత్తలు సరికొత్త విశ్లేషణ అందించారు. అదేమిటంటే.. ప్రతి గ్రహానికి ఒక విత్తన గ్రహం ఉంది. దాని నుంచే పెద్ద పెద్ద గ్రహాల ఆవిర్భావానికి బీజం పడిందని అంటారు. ఈ విత్తన గ్రహాలను “ప్లానెటెజీమల్స్” అంటారు. వీటిలో ఉండే గురుత్వాకర్షణ త్వరణ బలం వల్ల అంతరిక్ష వాతావరణంలోని పదార్థాలను లాక్కొని “ప్లానెటెజీమల్స్” పరిమాణం కిలోమీటర్ల కొద్దీ పెరిగిందని అంటున్నారు. తాజాగా జరిగిన సిమ్యులేషన్ స్టడీస్ లో ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి. భూమిలాగే శుక్ర గ్రహం, బుధ గ్రహం, అంగారక గ్రహం కూడా రాళ్లు రప్పలతో ఏర్పడింది. వీటన్నింటి పుట్టుక వెనుక కూడా విత్తన గ్రహాలు “ప్లానెటెజీమల్స్” ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. బహుశా హైడ్రోజన్, హీలియం గ్యాస్ లు, రాళ్ళు రప్పలు ఇవన్నీ శుక్ర , బుధ , అంగారక గ్రహాలపై ఉండటానికి కూడా విత్తన గ్రహ మూలాలే కారణమై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.