సౌదీలో లక్ష కోట్లతో “మిర్రర్ లైన్”.. ఏమిటీ కాస్ట్లీ ప్రాజెక్ట్ ?

భవిష్యత్ లో ఇంధన వనరులు తుడిచిపెట్టుకొని పోతే అరబ్ దేశాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతుంది.

  • Written By:
  • Publish Date - July 25, 2022 / 07:00 PM IST

భవిష్యత్ లో ఇంధన వనరులు తుడిచిపెట్టుకొని పోతే అరబ్ దేశాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతుంది. ఈ విపత్తును ముందే ఊహించిన సౌదీ అరేబియా ప్రభుత్వం తమ ఆర్ధిక వ్యవస్థను టూరిజం దిశగా నడిపించే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ఈక్రమంలోనే దాదాపు రూ.40 వేల కోట్లతో ప్రాజెక్టు “నియోమ్” చేపడుతున్నారు. ఇందులో భాగంగా బెల్జియం పరిమాణంలో ఉన్న ఎడారిని ఒక అద్భుతమైన సిటీ లా మారుస్తున్నారు. మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కూడా సౌదీ చేపట్టింది. ఈ ఎడారి నగరం నియోమ్ లో ఒక భారీ నిర్మాణం చేపట్టబోతున్నారు. అదే “మిర్రర్ లైన్”. దీని నిర్మాణ బడ్జెట్ రూ.లక్ష కోట్లు. ఈ నిర్మాణం 121 కిలోమీటర్ల వెడల్పు, 488 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఇంత పెద్ద విస్తీర్ణంలో నియోమ్ సిటీలోని రోడ్డు వెంట రెండు భారీ బిల్డింగ్స్ కట్టనున్నారు. అష్టభుజి ఆకారంలో ఈ బిల్డింగ్స్ ఉంటాయి. వీటిలో మౌంటెన్ రిసార్ట్ , స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఉంటాయి.మిర్రర్ లైన్ లో కట్టబోయే బిల్డింగ్స్ ఎత్తు.. న్యూయార్క్ లోని అంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే ఎక్కువే ఉంటుందని సమాచారం. ఈ బిల్డింగ్స్ కింది ఒక హై స్పీడ్ ట్రైన్ రూట్ ఉంటుంది. ఈ బిల్డింగ్స్ నుంచి స్థానిక ప్రాంతాల్లో ఎక్కడికైనా నడిచి 5 నుంచి 20 నిమిషాల్లోగా వెళ్లొచ్చు. 2030 కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో విశేషం ఏమిటంటే.. నియోమ్ అనేది జీరో కార్బన్ సిటీ గా అవిర్భవించనుంది.

నియోమ్ విశేషాలు..

ప్రస్తుతం సౌదీ అరేబియా ఎడారిని స్వర్గంలా మార్చేస్తోంది. ఆ ప్రాజెక్టు పేరు నియోమ్ (NEOM).ఎర్ర సముద్రానికి (Red Sea) వాయవ్య ప్రాంతంలో ఈ భారీ ప్రాజెక్టు రాబోతోంది. ఇది మొత్తం టెక్నాలజీపై ఆధారపడే ప్రాజెక్టు. ఇందులో ప్రతీదీ టెక్నాలజీతో ముడిపడి ఉంటుంది. ప్రతీ భవనం, రోడ్డు, వాహనాలు, పార్కులు, కాంప్లెక్సులు అన్నీ టెక్నాలజీతోనే పనిచేస్తాయి.నియోమ్‌లో ప్రధానంగా మూడు ఉప భాగాలున్నాయి. అవి ఒక్సాగాన్, ట్రోజెనా, ది లైన్. వీటికి సంబంధించి సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ (MBS) ఈ సంవత్సరం కీలక ప్రకటన చేశారు. వీటిలో ట్రోజెనా (trojena) ద్వారా నియోమ్ స్మార్ట్ సిటీలో పర్వత టూరిజంను అభివృద్ధి చేయబోతున్నారు. ఇందులో స్కై విలేజ్, అల్ట్రా లగ్జరీ ఫ్యామీలీ అండ్ వెల్‌నెస్ రిసార్టులు, రిటైల్ స్టోర్లు, రెస్టారెంట్ల వంటివి ఉంటాయి. సింపుల్‌‌గా చెప్పాలంటే ప్రపంచ టూరిస్టులంతా ఇక్కడికి కచ్చితంగా వెళ్లాలి అనుకునేలా ఇది ఉంటుంది. ఇందులో మౌంటేన్ బైకింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటివి కూడా ఉంటాయి.