బీహార్ లోని సమస్తిపూర్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని పట్టపగలే కాల్చి చంపారు దుండగులు. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…సమస్తపూర్ జిల్లా కల్యాణ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్వారా లో దుల్కర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే ఈయన హైదరాబాద్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సెలవుపై కల్యాణ్ పూర్ కు వెళ్లాడు. నమాజ్ చేసుకునేందుకు దుల్కర్ ఇంటి నుంచి మసీదుకు బయలుదేరాడు. కొద్దిదూరం వెళ్లగానే గుర్తు తెలియని దుండగులు అతనిపై దాడి చేశారు.
దుల్కర్ పై కాల్పులు జరపడంతో ఆయన అక్కడిక్కడే మరణించాడు. బుల్లెట్ల చప్పుడు విన్న స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే దుల్కర్ తీవ్ర గాయాలతో మరణించాడు. దుల్కర్ మృతితో ఆగ్రహానికి లోనైన గ్రామస్థులు దల్కర్ శవంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడంతో…పోలీసులు వారిని ఒప్పించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని..త్వరలోనే దండుగులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.