RamLeela Maidan : రామ్ లీలా మైదానం ఘన చరిత్ర.. క్వీన్ ఎలిజబెత్, ఐసెన్‌హోవర్ నికితా క్రుష్చెవ్ లాంటి మహామహులకు వేదిక!!

ఏటా దసరా సందర్భంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రావణ దహన కార్యక్రమం జరగడం ఆనవాయితీ.

  • Written By:
  • Publish Date - October 5, 2022 / 03:30 PM IST

ఏటా దసరా సందర్భంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రావణ దహన కార్యక్రమం జరగడం ఆనవాయితీ. ఈసారి రావణ దహనం కార్యక్రమానికి టాలీవుడ్ హీరో ప్రభాస్ ను కూడా నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ తో పాటు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం కేజ్రీవాల్ హాజరుకానున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాంలీల మైదానంలో రావణ దహనానికి హాజరు కావాలంటూ ఆయనకు రామ్ లీలా కమిటీ ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రాంలీలా మైదాన్ మెగా దసరా వేడుకల చారిత్రక విశేషాలు తెలుసుకుందాం..

ఏటా దసరా వచ్చిందంటే  ఢిల్లీలోని రాంలీలా మైదాన్ వేడుకలకు వేదికగా మారుతుంది. ప్రస్తుతం ఈ మైదాన్ ఉన్న అజ్మేరీ గేట్ సమీపంలోని మైదానం, 19వ శతాబ్దానికి ముందు రాంలీలా వేడుకలకు ఆతిథ్యం ఇచ్చేది. తాను కూడా దసరా ఊరేగింపును చూద్దామని అనుకుంటున్నానని..ఊరేగింపు మార్గాన్ని మార్చమని బహదూర్ షా జఫర్ అప్పట్లో ఆదేశించాడని అంటారు. ఈ ఆదేశాల ప్రకారమే ఊరేగింపు మార్గం మారిందని చెబుతారు.  1876 ​​నాటికి చాందినీ చౌక్ గుండా ఊరేగింపు జరగగా.. ఆ తర్వాత నుంచి రాంలీలా మైదాన్ కేంద్రంగా ఒక కిలోమీటరు దూరంలో ఉన్న గేట్ వెలుపల రాంలీలా వేడుకలు జరుపుకుంటున్నారు.రామ్ లీలా మైదాన్‌లో జరిగే వేడుకలను మొదట ఖత్రీ కమ్యూనిటీ సభ్యులు ఆదరించారు… ఆ వేడుకలే నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి.

వీఐపీల తాకిడి..

* 1955 సంవత్సరంలో సోవియట్ యూనియన్ తరఫున భారత్ లో పర్యటించిన నికితా క్రుష్చెవ్, నికోలాయ్ బుల్గానిన్ రాం లీలా మైదాన్ ను సందర్శించారు.

* 34వ అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్‌హోవర్ 1959లో రాంలీలా మైదాన్‌లో ఒక సభలో ప్రసంగించారు.

*  క్వీన్ ఎలిజబెత్ II పట్టాభిషేకం జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత మొదటిసారి భారతదేశాన్ని సందర్శించింది. ఆమె రామ్ లీలా
మైదాన్‌లో భారీ సభను ఉద్దేశించి మాట్లాడారు.

* ఎమర్జెన్సీ నేపథ్యంలో జేపీ నారాయణ్‌ మైదానంలో ర్యాలీ నిర్వహించారు.

* అన్నా హజారే ఢిల్లీలోని రాం లీలా మైదానంలో చేసిన నిరసన.. చివరికి ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావానికి దారి తీసింది.

* గతంలో ప్రధానమంత్రి  నరేంద్రమోదీ , కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ , ఉపాధ్యక్షులు, పలువురు హిందీ సినీ నటులు మైదానంలో వేడుకల్లో పాల్గొన్నారు.

* ఈ సంవత్సరం లువ్ కుష్ రాంలీలాలో కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే విశ్వామిత్రుడి పాత్రను పోషించారు. ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే నిషాద్ రాజ్ పాత్రను పోషించారు.

* ఢిల్లీలోని రాజకీయ నాయకులకు రాంలీలా కార్యక్రమాలలో ప్రదర్శనలిచ్చిన సుదీర్ఘ చరిత్ర ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మాజీ మంత్రి హర్షవర్ధన్ రాజు జనక్ పాత్రను పోషించగా, సీత తండ్రి, సామాజిక న్యాయం సాధికారత మాజీ మంత్రి విజయ్ సంప్లా పార్వతి తండ్రి హిమవత్ పాత్రను పోషించారు.