Queen’s Classic Recipe: బ్రిటన్ రాణి.. అమెరికా అధ్యక్షుడికి “క్లాసిక్ స్కోన్ రీసైప్” డెలివరీ.. ఎందుకు.. ఏమిటి?

బ్రిటన్ రాణి ఎలిజబెత్2 తుది శ్వాస విడిచిన నేపథ్యంలో ఆమె జీవిత ఘట్టాలను యావత్ ప్రపంచం నెమరువేసుకుంటోంది.

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 09:30 AM IST

బ్రిటన్ రాణి ఎలిజబెత్2 తుది శ్వాస విడిచిన నేపథ్యంలో ఆమె జీవిత ఘట్టాలను యావత్ ప్రపంచం నెమరువేసుకుంటోంది. ఆమె బతికి ఉన్నంత కాలం ఎంతో ఇష్టంగా తిన్న వంటకాల గురించి డిస్కషన్ జరుగుతోంది. అమెరికా చరిత్ర నిపుణుడు మైఖేల్ బేస్ ఖ్లోస్ 1960వ దశకం నాటి ఒక ఘటనను గుర్తు చేసుకుంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అదేమిటంటే..అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ బ్రిటన్ లో పర్యటించారు. బాల్ మోరల్ కోటలో క్వీన్ ఎలిజబెత్ ఇటీవల తుది శ్వాస విడిచారు. అదే కోటలో 1960వ దశకంలో రాణితో అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్
భేటీ అయ్యారు. ఆ సందర్భంగా
తనకు ఎంతో ఇష్టమైన “క్లాసిక్ స్కోన్ రీసైప్” ను తినిపిస్తానని రాణి హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఒకసారి అమెరికాలోని ఓ నగరంలో పర్యటిస్తూ అధ్యక్షుడు ఐసెన్ హోవర్ బార్ బెక్యూ గ్రిల్ వద్ద నిలబడి ఫోటో దిగారు. అది అన్ని అంతర్జాతీయ వార్తా పత్రికలు, న్యూస్ పేపర్స్ లో ప్రచురితం అయింది. దాన్ని చూసిన రాణి ఎలిజబెత్2 .. “మీరు బాల్ మోరల్ కోటలో నన్ను కలిసేందుకు వచ్చినప్పుడు “క్లాసిక్ స్కోన్ రీసైప్” వంటకాన్ని తినిపిస్తా అని మాట ఇచ్చాను. దాన్ని నిలబెట్టుకోలేక పోయాను. త్వరలోనే ఆ మాటను నిలబెట్టుకుంటాను” అని వ్యాఖ్యానించారు. మాటపై నిలబడటంలో క్వీన్ ఎలిజబెత్ ఆమెకు ఆమే సాటి. ఇచ్చిన మాట ప్రకారం “క్లాసిక్ స్కోన్ రీసైప్” ను తయారు చేయించి అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ కు రాణి పంపారు. అది 16 మందికి సరిపోతుంది అని పేర్కొంటూ ఒక లేఖను కూడా ఐసెన్ హోవర్ కు రాణి అప్పట్లో రాశారు. వంటకం తయారీకి వాడిన సామగ్రి వివరాలను కూడా ఆ లేఖలో ప్రస్తావించడం గమనార్హం. ఈ వివరాలన్నీ అమెరికా చరిత్ర నిపుణుడు మైఖేల్ బేస్ ఖ్లోస్ తాజాగా చేసిన ట్వీట్ లోనూ ప్రస్తావించారు. ఇందుకు సంబంధించి నాడు రాణి రాసిన
లేఖలను కూడా తన ట్వీట్ లో చరిత్ర నిపుణుడు మైఖేల్ బేస్ ఖ్లోస్ ట్యాగ్ చేయడం గమనార్హం.

ఇక రాణి ఎలిజబెత్2 ప్రతి రోజూ మధ్యాహ్నం టీ తో పాటు జామ్ తో కూడిన శాండ్ విచ్ వంటకాన్ని ఇష్టంగా తినేవారట. ఐదేళ్ల వయసు నుంచే ఆమె ఇలాంటి పలు ఫుడ్స్ ను మెనూలో తీసుకునేవారట.

222 ఏళ్ల నాటి పాత్రల్లో..

రాణి ఎలిజబెత్-2 వ్యక్తిగత చెఫ్‌గా 15 ఏళ్ల పాటు పనిచేసిన డారెన్ మాగ్రాడీ.. 2007లో ఈటింగ్ రాయల్లీ- రెసిపీస్ అండ్ రిమెంబరెన్స్ అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో రాణి ఆహారపు అలవాట్ల గురించి వివరించారు. రాణి ఆహార విషయంలో 60 ఏళ్లుగా పెద్ద మార్పులేవీ లేవు. రాజ మహల్‌లోని వంట గదిలో రాణికి వంట సిద్ధం చేయడానికి సుమారు 20 మంది చెఫ్‌లు పని చేసేవారు. ప్రధానంగా వంట చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఇందుకోసం క్రీ.శ. 1800 నాటి పాత్రలను వినియోగించడం ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తోంది.  ప్రతి రోజూ రాణి కోసం మూడు రకాల మెనూలను సిద్ధం చేయగా.. వాటిలో రాణి ఒకదాన్ని మాత్రమే ఎంచుకుంటారని డారెన్ మాగ్రాడీ వివరించారు.

టీ, బిస్కెట్లతో బ్రేక్‌ఫాస్ట్‌ షురూ..

దివగంత రాణి.. ఆహారం విషయంలో కొన్ని ప్రత్యేక పద్ధతులను అవలంభించేవారు. రోజూ తన బ్రేక్‌ఫాస్ట్‌ను టీ, బిస్కెట్లతో ప్రారంభించేవారు. సరిగ్గా ఉదయం 7:30 గంటలకు సేవకులు ఒక ట్రేలో 2 వెండి టీ కప్పులతో రాణి పడకగదికి చేరుకుంటారు. ఒక టీ కప్పులో ఎర్ల్ గ్రే టీ, మరో కప్పులో వేడినీరు ఉంటుంది. రాణి కోసం తయారు చేసే టీని ఎర్ల్ గ్రే అని పిలుస్తారు. బేరిపండు, నారింజ తొక్కల నుంచి తీసిన నూనెను టీ తయారీలో వినియోగిస్తారట. తర్వాత అందులో పాలను జత చేస్తారు. అయితే చక్కెర మాత్రం అసలు వాడరట. అలాగే రాణికి చాక్లెట్ ఆలివర్స్ బిస్కెట్ అంటే చాలా ఇష్టమట. దీంతో పాటు అస్సాంకి చెందిన సిల్వర్ టిప్స్ చాయ్ని కూడా ఎక్కువగా ఇష్టపడేవారట.