President Droupadi Murmu: క్వీన్‌ ఎలిజబెత్- 2 అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి

క్వీన్‌ ఎలిజబెత్- 2 అంత్యక్రియలు భారీ స్థాయిలో నిర్వహించేందుకు బ్రిటన్‌ రాయల్ ఫ్యామిలీ ఏర్పాట్లు చేస్తోంది.

  • Written By:
  • Publish Date - September 14, 2022 / 07:31 PM IST

క్వీన్‌ ఎలిజబెత్- 2 అంత్యక్రియలు భారీ స్థాయిలో నిర్వహించేందుకు బ్రిటన్‌ రాయల్ ఫ్యామిలీ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 19న లండన్‌లో జరిగే రాణి అంత్యక్రియల్లో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారని కేంద్రప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి ముర్ముకు ఇదే తొలి విదేశీ పర్యటన.సెప్టెంబర్ 17న ఆమె లండన్ బయల్దేరి వెళ్తారు. ప్రపంచ దేశాధినేతలతో కలిసి.. దివంగత రాణి స్టేట్ ఫ్యునరల్‌లో పాల్గొంటారు. భారత్ తరపున రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము క్వీన్‌కు నివాళులు అర్పిస్తారని విదేశాంగశాఖ వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు, రాజులు, రాణులు కలిపి మొత్తంగా 500 మంది వీఐపీలు క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల్లో పాల్గొంటారని సమాచారం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోపాటు న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా ప్రధానులు, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా, జర్మనీ అధ్యక్షుడు స్టెయిన్మియర్‌లు హాజరవుతున్నట్లు ఇప్పటికే ఖరారయ్యింది. బెల్జియం, స్వీడన్, నెదర్లాండ్స్, స్పెయిన్ దేశాల రాజులు, రాణులు కూడా హాజరవుతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి మూడు దేశాలను బ్రిటన్ పక్కనబెట్టింది. అధికారికంగా నిర్వహిస్తున్న క్వీన్ ఎలిజబెత్‌ అంత్యక్రియలకు రష్యా, బెలారస్, మయన్మార్‌కు బ్రిటన్ ఆహ్వానం పంపలేదు.

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోన్న కారణంతో రష్యాను.. మాస్కోకు మద్దతుగా ఉన్న బెలారస్‌ను బాయ్‌కాట్ చేసింది. అలాగే సైన్యం తిరుగుబాటు చేసి అధికారం హస్తగతం చేసుకున్న కారణంగా మయన్మార్‌తోనూ దౌత్య సంబంధాలు తగ్గించింది బ్రిటన్‌. రాణి అంత్యక్రియలకు తరలివచ్చే అతిథులతో లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఆదివారం సాయంత్రం సమావేశమవుతారు బ్రిటన్ కొత్త రాజు చార్లెస్ 3. సోమవారం ఉదయం వెస్ట్‌మినిస్టర్ అబే నుంచి విండ్సర్‌ క్యాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్ వరకు క్వీన్ ఎలిజబెత్ అంతిమయాత్ర కొనసాగనుంది.

దాదాపు 50 ఏళ్ల తర్వాత బ్రిటన్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. చివరిసారిగా 1965లో అప్పటి యూకే ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్ ఫ్యూనరల్‌ అధికార లాంఛనాలతో జరిగింది. క్వీన్‌ ఎలిజబెత్-2 భర్త ఫిలిప్ అంత్యక్రియలు కూడా రాజకుటుంబ మర్యాదలతోనే నిర్వహించారు.