Painting Exhibition: రూ.వెయ్యికే 8.5 కోట్ల విలువైన చిత్రం.. తలలు పట్టుకున్న నిర్వాహకులు

ప్రముఖ చిత్రకారులు వేసిన పురాతన పెయింటింగ్‌లను వేలంలో అమ్మడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. అలాంటి వేలంలో పాల్గొన్న ఒక అమెరికన్ మహిళ తెలియకుండానే పెద్ద విజయం సాధించింది. ఆమె 12 డాలర్లకు (సుమారు రూ. 1000) ఓ చిత్రాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లింది.

Published By: HashtagU Telugu Desk
Painting Exhibition

Painting Exhibition

Painting Exhibition: ప్రముఖ చిత్రకారులు వేసిన పురాతన పెయింటింగ్‌లను వేలంలో అమ్మడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. అలాంటి వేలంలో పాల్గొన్న ఒక అమెరికన్ మహిళ తెలియకుండానే పెద్ద విజయం సాధించింది. ఆమె 12 డాలర్లకు (సుమారు రూ. 1000) ఓ చిత్రాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లింది. అయితే, ఆ చిత్రం అత్యంత అరుదైనదిగా, దాని విలువ మిలియన్ డాలర్లు (సుమారు 8.5 కోట్ల రూపాయలు) ఉంటుందని తాజాగా వెలుగు చూసింది. దీంతో, సదరు వేలం నిర్వాహకులు పెద్దగా విచారిస్తున్నారని తెలుస్తోంది. అత్యంత విలువైన చిత్రాన్ని నామమాత్రపు ధరకే అమ్మేశామని వారు చింతిస్తున్నారు.

పెన్సిల్వేనియాకు చెందిన హెయిదీ మార్కోవ్, గత జనవరిలో భర్తతో కలిసి ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్‌కు వెళ్లారు. అక్కడ పలు చిత్రాలు వేలం వేస్తుండడంతో ఆమె కూడా పాల్గొంది. అందులో ఒక చిత్రమే ప్రత్యేకంగా ఆమె దృష్టిని ఆకర్షించింది, ఆ చిత్రాన్ని కొనాలని ఆమె భర్తను అడిగింది. తొలుత భర్త కొంచెం విముఖత వ్యక్తం చేసిన పట్టుబట్టి ఆమె 12 డాలర్లకు ఆ చిత్రం కొనుగోలు చేయించుకుంది. ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత, ఆ చిత్రాన్ని సర్వసాధారణంగా పరిశీలించగా అసలు విలువ బయటపడింది.

ఆ చిత్రం ఫ్రెంచ్ ఆర్టిస్ట్ పియరే అగస్టీ రెనాయిర్ చేత బొగ్గుతో గీసిన అరుదైన పెయింటింగ్‌ అని, మార్కెట్లో దాని విలువ సుమారు 1 మిలియన్ డాలర్లు (8.5 కోట్ల రూపాయలు) ఉండవచ్చని తెలిసింది. అత్యంత విలువైన చిత్రాన్ని కేవలం 12 డాలర్లకు సొంతం చేసుకున్నందుకు హెయిదీ సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా, పెయింటింగ్ విలువను గుర్తించడంలో జరిగిన పొరపాటుకు సదరు వేలం నిర్వాహకులు చింతిస్తున్నారు.

  Last Updated: 01 Apr 2025, 05:21 PM IST