Site icon HashtagU Telugu

Kargil Vijay Divas : కార్గిల్ విజయ్ దివస్.. భారత వీర సైనికుల విజయగాధ ఇదిగో!!

Kargil

Kargil

నేడు కార్గిల్ విజయ్ దినోత్సవం..తొలిసారి 1999 జులై 26న తొలి కార్గిల్ విజయ్ దినోత్సవం జరిగింది. ఏమిటా విజయం ? కార్గిల్ లో ఏం జరిగింది ? అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

భారత పరాక్రమాన్ని చాటారు..

1999 మేలో పాకిస్థాన్ సైనికులు, ఉగ్రవాదులు కార్గిల్ మార్గం ద్వారా భారత భూ భాగంలోకి చొరబడ్డారు. దొడ్డిదారిన భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని భావించిన పాక్ సైనికులకు భారత ఆర్మీ తమ పరాక్రమాన్ని రుచి చూపించింది. పాక్ సైనికులపై విరుచుకుని పడింది. దేశం నుంచి పాక్ సైనికులను తరిమికొట్టింది. ‘ఆపరేషన్ విజయ్’ తో కార్గిల్ నుంచి పాకిస్తాన్ చొరబాటు దారులపై యుద్ధ భేరి మోగించింది. ఈ యుద్ధం జూలై 26న ముగిసింది. దీంతో 1999 జులై 26న తొలి కార్గిల్ విజయ్ దినోత్సవాన్ని భారతీయులు గ్రాండ్ గా జరుపుకున్నారు.

గొర్రెల కాపరి ఇచ్చిన సమాచారంతో..

పాకిస్థాన్ దళాలు, ఉగ్రవాదులు భారత్ కు చెందిన అత్యంత ఎత్తైన కార్గిల్‌ పర్వత శ్రేణుల్లోకి దొంగ దారిలో 1999 మేలో చొరబడ్డారు. ఈ చొరబాటులో కీలకమైన ప్రాంతం టైగర్‌ హిల్స్‌. మన ఆర్మీ తేరుకునే లోపే ద్రాస్‌, కక్సర్‌, ముస్తో సెక్టార్లలోనూ పాక్ ఆర్మీ బంకర్లు కట్టేసింది. గొర్రెలను మేపేందుకు కార్గిల్ పర్వత లోయల్లోకి వెళ్లిన తాశి నామ్ గ్యాల్ అనే వ్యక్తి అక్కడ పాక్ ఆర్మీ ఉండటాన్ని గుర్తించారు. క్షణం ఆలస్యం చేయకుండా భారత ఆర్మీకి ఈవిషయాన్ని చేరవేశాడు. వెంటనే పర్వతాల్లోకి వెళ్లిన ఇండియన్‌ ఆర్మీ ట్రూప్‌పై పాక్ ఆర్మీ , ఉగ్రవాదులు దాడి చేశారు. ఐదుగురు భారత సైనికులను పట్టుకుని అత్యంత క్రూరంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా పాక్‌ దళాల సాయంతో టెర్రరిస్టులు చేసిన దాడిలో కార్గిల్‌ లోని భారత ఆయుదాగారం ధ్వంసమైంది. అత్యంత ఎత్తున ఉండే టైగర్‌ హిల్స్‌ పర్వత ప్రాంతంపై తిష్ట వేసిన పాక్‌ దళాలు భౌగోళిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని భారత సైన్యంపై దాడులకు తెగబడ్డాయి.పై నుంచి పాక్‌ సైనికులు, టెర్రరిస్టులు తేలికగా దాడి చేస్తూ తూటాలు, బాంబుల వర్షం కురిపించారు. వాటిని కాచుకుంటూ మన సైనికులు వీరోచితంగా పోరాటం చేయాల్సి వచ్చింది.

రంగంలోకి వాయుసేన..

మే 26న భారత వాయుసేన రంగంలోకి దిగింది. మొదటి వారంలోనే రెండు మిగ్‌ విమానాలు, ఒక ఆర్మీ హెలికాప్టర్‌లను మన ఆర్మీ నష్టపోయింది. ఎట్టకేలకు భారత దళాలు జూన్‌ 29న టైగర్‌ హిల్స్‌ పర్వత పాదాల వద్దకు చేరుకున్నాయి. వారం రోజుల పాటు హోరాహోరీ పోరు జరిగింది. జులై 4న కీలకమైన టైగర్‌ హిల్స్‌ని భారత్‌ స్వాధీనం చేసుకుంది.
టైగర్‌ హిల్స్‌ పైకి చేరిన తరువాత భారత్ కు ఎదురే లేకుండా పోయింది. నియంత్రణ రేఖ దాటి చొరబాటు దారులు ఆక్రమించుకున్న స్థలాలను వేగంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

ముషారఫ్‌ పంపిన మూకలు తోక ముడిచి..

అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్‌ అండతో అతిక్రమణకు పాల్పడిన ఆర్మీ, టెర్రరిస్టులు తోక ముడిచారు. హిమాలయాల్లో దట్టంగా మంచు పేరుకుపోయే కాలంలో పర్వత శ్రేణుల నుంచి ఇరు దేశాల భద్రతా దళాలు వెనక్కి వస్తాయి. చాన్నాళ్లుగా ఇదే పద్దతి అమలవుతోంది. అయితే దీన్ని తుంగలో తొక్కి భారత దళాలు గస్తీలో లేని సమయం చూసి ముషారఫ్‌ ఆదేశాలతో పాక్‌ ఆర్మీతో కూడిన టెర్రరిస్టు మూకలు పాక్‌ గుండా భారత భూభాగంలో అడుగుపెట్టి కీలక స్థావరాలను ఆక్రమించుకున్నారు. ఫలితంగా యుద్ధం అనివార్యమైంది. దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో భారత్‌ వైపు 527 మంది జవాన్లు అమరులయ్యారు. పాకిస్తాన్‌ వైపు 453 మంది వరకు చనిపోయినట్టు సమాచారం.