NASA Mars Rover: మార్స్ గ్రహంపై.. హ్యాట్ మ్యాన్!!

నాసాకు చెందిన మార్స్ రోవర్ అంగారకుడిపై చక్కర్లు కొడుతూ.. రోజుకో కొత్త ఫోటోను భూమికి పంపుతోంది.

  • Written By:
  • Publish Date - July 20, 2022 / 02:23 PM IST

నాసాకు చెందిన మార్స్ రోవర్ అంగారకుడిపై చక్కర్లు కొడుతూ.. రోజుకో కొత్త ఫోటోను భూమికి పంపుతోంది. ఇటీవల అది పంపిన ఒక ఫోటోను కొంత మంది మార్ఫింగ్ చేసి, అంగారకుడి పై గుహ లాంటి నిర్మాణం ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవం వెలుగులోకి వచ్చింది. అది ఫేక్ ఫోటో అని తేలిపోయింది. దీన్ని మరువకముందే ఇప్పుడు మరో ఫోటోను మార్స్ రోవర్ భూమికి పంపింది. హ్యాట్ వేసుకున్న ఒక భారీ ఆకారం కలిగిన జీవి ఒక చోట దిట్టంగా కూర్చున్నాడా అనే సందేహం కలిగించేలా.. ఈ ఫోటోలో ఒక బండ రాయి ఉంటుంది. అయితే ఆ బండ రాయిపై హ్యాట్ తరహా ఆకారం ఎలా వచ్చిందనేది తెలియాల్సి ఉంది. జులై 13న మార్స్ రోవర్ ఈ ఫోటోను తీసి భూమికి పంపిందని నాసా వెల్లడించింది.మార్స్ రోవర్ పై ఉన్న ఎడమ నావిగేషన్ కెమెరా ద్వారా ఈ ఫోటో తీసినట్లు తెలిపింది. సోషల్ మీడియా లో ఈ ఫోటోపై భిన్న, విభిన్న కామెంట్స్ వెల్లువెత్తాయి. “అది కచ్చితంగా ఒక విగ్రహమే. ఆ బండరాయి కవళికలు, కాళ్ళు, చేతులు వంటివన్నీ .. మాతో ఇక ఆటలు ఆపు అని మార్స్ వాసులు నాసా మార్స్ రోవర్ కు సందేశం ఇస్తున్నట్లుగా ఉంది” అని ఒక ట్విట్టర్ వినియోగదారుడు కామెంట్స్ చేశాడు. “ఆ బండ రాయి బ్రోనటో సారస్ జీవుల మలంలా పేరుకుపోయి నిలబడింది” అని ఇంకో నెటిజన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. “మార్స్ రోవర్ పంపే ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి ఉందో తెలియడం లేదు” అని మరొక నెటిజన్ పేర్కొన్నారు.

మే 7 ఫోటో మిస్టరీ..

అంగారకుడి ఉపరితలంపై ఒక గుహ, తలుపు ఉన్న ఫోటో ఇటీవల వైరల్ అయింది. దాన్ని నాసా మే 7న విడుదల చేసింది.ఫోటోలో కనిపిస్తున్నది ‘‘తలుపు’’ అయి ఉంటుందని కొందరు చెబుతుంటే, మరో గ్రహానికి ద్వారం అని ఇంకొందరు కామెంట్ చేశారు.‘‘ఒక రాయిపై ఏర్పడిన చీలికను చాలా చాలా పెద్దదిగా జూమ్ చేసి చూస్తే ఇలా కనిపిస్తోంది’’అని నాసా చెప్పింది.