ఓ భక్తుడు భార్య సరదాగా విసిరిన సవాల్ ను స్వీకరించి ఆమెను ఎత్తుకుని ఏకంగా తిరుమల కొండ 70 మెట్లు ఎక్కాడు. భార్యను మోసుకుని అన్ని మెట్లు ఎక్కాడంటే ఆయనేమీ యువకుడు కాదు. వీరి వివాహం 1998లో జరిగింది. వారికి ఇద్దరు ఆడ పిల్లలు, వారికి పెళ్లిళ్లు కూడా అయ్యాయి.
వారు అమ్మమ్మ, తాతయ్యలు కూడా అయ్యారు. ఆ జంటది తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక కావడంతో గోదారోళ్ళు అంటే ఎటకారమే కాదు భక్తి, ప్రేమాభిమానాలకు కూడా పెట్టింది పేరని ఈ ఘటనతో నిరూపించారని గర్వంగా చెబుతున్నారు ఆ జల్లా వాసులు. కడియపులంకకు చెందిన లారీ ట్రాన్స్‌పోర్ట్ యజమాని వరదా వీర వెంకట సత్యనారాయణ(సత్తిబాబు) లావణ్య దంపతులు ఏడుకొండలు దర్శనానికి తిరుపతి వెళ్లారు. వారు కాలినడకనే ఏడు కొండలు ఎక్కుతామని మొక్కుకున్నారు. ఆ ప్రకారం వారు శ్రీవారి మెట్లు ఎక్కుతున్నారు.
అయితే వేగంగా మెట్లు ఎక్కుతున్న సత్తిబాబును చూసి భార్య లావణ్య ‘‘మీరు ఎక్కడం కాదు దమ్ముంటే నన్ను ఎత్తుకుని ఎక్కు’’ అని సరదాగా సవాల్ విసిరింది. ఆ సవాల్ ను సీరియస్ గా తీసుకున్న సత్తిబాబు భార్యను భుజాలపైకి ఎక్కించుకుని మెట్లు ఎక్కడం మొదలు పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 మెట్లు ఎక్కారు. అలా ఆ జంట వెళ్తుంటే ఫోటోలు,వీడియోలు తీయడానికి మిగిలిన భక్తులు పోటీపడ్డారు. సత్తిబాబు ఈ వయసులో ఇంతటి సాహసం చేయడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు.
వీళ్ళ పెద్ద అల్లుడు గురుదత్త(చందు) మంచి సాప్ట్ వేర్ ఉద్యోగం వస్తే పుట్టింటి, అత్తంటి వారందరనీ తిరుమల తీసుకొస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు.
గురుదత్తకు ఉద్యోగం రావడంతో బస్సులో నలభై మందిని తిరుపతి తీసుకెళ్లి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగానే సత్తిబాబు ఈ సాహసం చేశారు. అయితే,ఈ సంఘటన జరిగి ఎన్ని రోజులైందో తెలియదు. సత్తిబాబు భార్యను ఎత్తుకుని మెట్లు ఎక్కుతున్న వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందరో యువ జంటలకు సవాల్ విసురుతోంది. తొందరపడి ఈ సాహసానికి అందరూ ప్రయత్నించొద్దని పెద్దలు సలహా ఇస్తున్నారు.తేడా వస్తే అసలకే ఎసరని హెచ్చరిస్తున్నారు.