“కిస్కా” గుండెలు పిండే కథ.. ఒంటరితనం శాపమైన గాధ!!

చేదు అనుభవాలను ఇప్పుడొక తిమింగలం చవిచూస్తోంది. దాని పేరు "కిస్కా". ఇది ఒంటరితనంతో కుమిలిపోతోంది.

  • Written By:
  • Publish Date - October 10, 2022 / 12:58 PM IST

ఒంటరితనం .. మనిషికైనా జంతువుకైనా ఒక్కటే.

పేగు బంధం.. మనిషికైనా జంతువుకైనా ఒక్కటే.

గుండెలోని బాధ..మనిషికైనా జంతువుకైనా ఒక్కటే.

ఇవే చేదు అనుభవాలను ఇప్పుడొక తిమింగలం చవిచూస్తోంది. దాని పేరు “కిస్కా”. ఇది ఒంటరితనంతో కుమిలిపోతోంది. స్వేచ్ఛగా సముద్రంలో తిరగాల్సిన తాను.. కెనడాలోని మెరీన్ ల్యాండ్ అనే ఒక జూ పార్క్ లో 43 ఏళ్లుగా బందీగా ఉంటున్నందుకు కిస్కా వెక్కి వెక్కి ఏడుస్తోంది. గత 11 ఏళ్లుగా ఒంటరిగా ఒక నీటి ట్యాంకులో తనను ఒంటరిగా ఉంచినందుకు తల గోడకేసి బాదుకుంటోంది.

ఈ తిమింగలాలు డాల్ఫిన్ జాతికి చెందిన క్షీరదాలు. దాదాపు ప్రతి సముద్రంలో ఇవి ఉంటాయి. సముద్రంలో సహజ వాతావరణంలో ఉంటే ఇవి 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల దాకా బతుకుతాయి. కానీ జూ పార్క్ లలో వీటిని బందీగా ఉంచితే కృత్రిమ వాతావరణం వల్ల ఆయుష్షు తగ్గిపోతుంది. వీటికి తెలివి ఎక్కువ. చాలా ఇంటెలిజెంట్. కిస్కా లాంటి తిమింగలాలను బందీగా పార్కులలో ఉంచడం సరికాదు. వాటిని తల్లి ఒడి లాంటి సముద్రంలో వదిలేయాలి.

కిస్కా ఫ్లాష్ బ్యాక్ ..

ఈ కిస్కా రెండు సంవత్సరాల వయసులోనే తల్లిలాంటి సముద్రం నుంచి తప్పిపోయింది. 1947లో ఐస్‌ల్యాండ్‌ తీరానికి సమీపంలో మెరైన్‌ ల్యాండ్‌ వారి చేతికి చిక్కి, బందీగా మారింది. వారు ఈ కిల్లర్‌ తిమింగలానికి ‘కిస్కా’గా పేరు పెట్టి, ప్రతిరోజూ ఆహారం అందిస్తున్నా.. ఏదో తెలియని బాధ. దీనికి తోడు తన పిల్లల్ని చూసుకుంటూ అయినా జీవితం సాగిద్దాం అనుకుంటే.. పుట్టిన  ఐదు బిడ్డలు పుట్టినట్లుగానే చనిపోయాయి.

స్నేహితులతో కలిసి కాస్త సరదాగా గడుపుదాం అనుకున్నా.. పక్కనే ఉండే మరో రెండు తిమింగలాలు కూడా కిస్కాని వదిలి వేరే లోకాలకు వెళ్లిపోయాయి. ఇలా ఎటు చూసినా కిస్కాకు కష్టాలు తప్పట్లేదు. దాదాపు పదేళ్లుగా ఒంటరిగానే జీవిస్తోంది. ఇక ఈ ఒంటరి జీవితం జీవించలేనని అనుకుందో ఏమో.. ఈ మధ్యనే ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. తన తలను తానే వాటర్‌ ట్యాంకర్‌ గోడలకేసి బాదుకుంటూ కనిపించింది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో ఎవరో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.