Saline Water Lantern : ఉప్పు నీటితో నడిచే లాంతర్.. భారత శాస్త్రవేత్తల ఆవిష్కరణ!

భారత శాస్త్రవేత్తలు మరో సరికొత్త ఆవిష్కరణ చేశారు. ఉప్పు నీటితో పనిచేసే లాంతర్ ను అభివృద్ధి చేశారు.

Published By: HashtagU Telugu Desk
Saline Waster

Saline Waster

భారత శాస్త్రవేత్తలు మరో సరికొత్త ఆవిష్కరణ చేశారు. ఉప్పు నీటితో పనిచేసే లాంతర్ ను అభివృద్ధి చేశారు. దీన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆవిష్కరించారు. ఈ లాంతర్ కు “రోష్ని” అని పేరు పెట్టారు. ఉప్పు నీటిని వాడుకొని విద్యుత్ ను ఉత్పత్తి చేసుకొని.. దాని సాయంతో ఇందులో ఎల్ఈడీ బల్బు వెలుగుతుంది. చెన్నైలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ సంస్థ పరిశోధకులు “రోష్ని” లాంతర్ ను అభివృద్ధి చేశారు. ప్రత్యేకించి సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులకు ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దారు. సముద్ర తీర ప్రాంతాల వాళ్లకు సముద్ర నీరు లభ్యత అన్ లిమిటెడ్. సముద్రంలో చేపల వేటకు వెళ్ళినప్పుడు ఎలక్ట్రిక్ లాంతర్ లు తీసుకెళితే.. ఛార్జింగ్ అకస్మాత్తుగా అయిపోయినప్పుడు రాత్రిళ్ళు అసౌకర్యానికి గురవుతున్నారు. “రోష్ని” లాంతర్ తో ఇకపై మత్య్సకారులకు ఎంతో సౌకర్యం చేకూరుతుంది. సముద్రపు నీటిని ఒడిసిపట్టి లాంతర్ లోని ట్యాంకర్ భాగాన్ని నింపితే సరిపోతుంది. అది వెలుగులు విరజిమ్ముతుంది.మరో విశేషం ఏమిటంటే.. సాధారణ మంచినీళ్లలో ఉప్పు కలిపి కూడా ఈ లాంతర్ లో వాడొచ్చు.దీని నిర్వహణ పద్ధతి కూడా చాలా సులువు. దీన్ని పెద్దఎత్తున ఉత్పత్తి చేయించి దేశంలోని దాదాపు 7500 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీర ప్రాంతాల మత్స్యకారులకు అందించాలని కేంద్ర సర్కారు యోచిస్తోంది. 2015 సంవత్సరంలో ప్రధాని మోడీ ప్రారంభించిన “ఉజాలా” యోజనను బలోపేతం చేసేందుకు “రోష్ని” లాంతర్ దోహదం చేయనుంది.

  Last Updated: 15 Aug 2022, 11:21 AM IST