Site icon HashtagU Telugu

Bogus Court : బోగస్ కోర్టు నడిపిన ఘరానా మోసగాడు.. ఇలా దొరికిపోయాడు

Gujarat Conman Bogus Court Morris Samuel Christian

Bogus Court : అతగాడు బరి తెగించాడు. ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఏకంగా చిన్నపాటి నకిలీ కోర్టునే ఏర్పాటు చేశాడు. నల్ల కోటు ధరించి తనను జడ్జీగా అందరికీ పరిచయం చేసుకున్నాడు. ఎంతోమంది అతడు చెప్పింది నిజమేనని నమ్మి.. చాలా వివాదాలను ఆ నకిలీ కోర్టుకు తీసుకెళ్లారు. ఆ మోసగాడు నోటితో చెప్పిన మాటలనే తీర్పులుగా స్వీకరించారు. గత ఐదేళ్లుగా ఈ బాగోతం నడిపిస్తున్న 37 ఏళ్ల మోరిస్ శామ్యూల్‌ క్రిస్టియన్‌ అనే వ్యక్తిని గుజరాత్‌లోని  అహ్మదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

Also Read :China Vs India : భారత్‌తో కలిసి పనిచేస్తామన్న చైనా.. ఆర్మీ చీఫ్ కీలక ప్రకటన

ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. స్థానిక సిటీ సివిల్ కోర్టులోని భూవివాదాల పెండింగ్‌ కేసుల సమాచారాన్ని మోరిస్ శామ్యూల్‌ క్రిస్టియన్‌ సేకరించేవాడు. ఆ కేసుల్లో భాగంగా ఉన్నవారిని అతడు సంప్రదించేవాడు. తాను నడిపే ట్రిబ్యునల్‌కు వస్తే అనుకూలంగా తీర్పులు వస్తాయని నమ్మబలికేవాడు. అది నమ్మి ఎంతోమంది మోరిస్ శామ్యూల్ నడిపే నకిలీ ట్రిబ్యునల్‌లో (Bogus Court) పిటిషన్లు దాఖలు చేసేవారు. ఇలా పిటిషన్లు వేసిన వారిలో కొందరికి అనుకూలంగా తీర్పులు ఇచ్చేవాడు. తన తీర్పుల వల్ల సంతోషించిన వారి నుంచి డబ్బులను మోరిస్ వసూలు చేసేవాడు.

Also Read :YouTube Premium Lite: ‘యూట్యూబ్ ప్రీమియం లైట్’ వస్తోంది.. సబ్‌స్క్రిప్షన్ రేటు, ఫీచర్లు ఇవీ

మోరిస్ శామ్యూల్‌ క్రిస్టియన్‌ నడిపిన నకిలీ కోర్టు బాగోతం ఎలా వెలుగులోకి వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2019లో ఓ ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసు ఇతగాడి నకిలీ కోర్టులో విచారణకు వచ్చింది. దీన్ని విచారించిన మోరిస్ శామ్యూల్.. ఆ భూమి సమస్యను పరిష్కరించాలంటూ ఏకంగా జిల్లా కలెక్టర్‌కే ఆదేశాలు జారీ చేశాడు. అయితే ఆ నకిలీ ఉత్తర్వులను తీసుకొని సదరు కేసులో ఒక పక్షంగా ఉన్న వ్యక్తి  జిల్లా కేంద్రంలోని అసలైన కోర్టు రిజిస్ట్రార్ వద్దకు వెళ్లాడు.  దాన్ని చూసిన కోర్టు రిజిస్ట్రార్ షాక్ అయ్యారు. అది నకిలీది అని ఆయన గుర్తించారు. దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తద్వారా మోరిస్ శామ్యూల్‌ బండారం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి  2015లోనే మోరిస్‌పై చీటింగ్ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. అయితే అనంతర కాలంలో అతడి యాక్టివిటీని పోలీసులు అంతగా ట్రాక్ చేయలేదు. దీంతో నకిలీ కోర్టు వ్యవహారం అత్యంత ఆలస్యంగా.. ఐదేళ్ల తర్వాత బయటపడింది.