Site icon HashtagU Telugu

Nazi – Swasthik : “నాజీ” గుర్తు.. మన “స్వ‌స్తిక్” ఒక్కటేనా? నిషేధం దిశగా ఆస్ట్రేలియా, కెనడా!

Nazi Swasthik

Nazi Swasthik

“నాజీ” గుర్తుపై ఆస్ట్రేలియాలోని విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రాలు నిషేధాన్ని ప్రకటించాయి.క్వీన్స్ ల్యాండ్, టాస్మానియా రాష్ట్రాలు కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నాయి. జ‌స్టిన్ ట్రూడో నేతృత్వంలోని కెన‌డా ప్రభుత్వం కూడా “నాజీ” గుర్తుపై నిషేధం విధించే దిశ‌గా కసరత్తు ప్రారంభించింది. కెనడాలోని న్యూడెమోక్రెటిక్ పార్టీ ఎంపీ జ‌గ్‌మీత్ సింగ్ నాజీ గుర్తు వాడ‌కాన్ని నిషేధించాలంటూ పార్ల‌మెంట్‌లో ఓ బిల్లు తీసుకురావ‌డంతో ఈ వివాదం మొద‌లైంది.

“నాజీ” గుర్తు వర్సెస్ “స్వ‌స్తిక్” చిహ్నం..

“నాజీ” గుర్తు.. హిందువులు వాడే “స్వ‌స్తిక్” చిహ్నం ఒక్కటేనని అందరూ భావిస్తుంటారు. కానీ ఇవి రెండూ వేర్వేరు.”నాజీ”ల గుర్తును హ‌కెన్ క్రూజ్‌ అంటారు.
ఈ హ‌కెన్ క్రూజ్‌ని 20 వ శ‌తాబ్దంలో హిట్లర్ ప్రేరేపిత నాజీలు ఉప‌యోగించారు. ఆ గుర్తు చూడటానికి స్వ‌స్తిక్ చిహ్నం లాగే ఉంటుంది. కానీ ఈ రెండింటి మ‌ధ్యా హ‌స్తిమ‌శ‌కాంతం తేడా ఉంటుంది. స్వస్తిక్‌ గుర్తుకు 12 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కానీ హిట్లర్ వాడిన హ‌కెన్ క్రూజ్‌ గుర్తుకు పెద్ద చరిత్రేమీ లేదు. పురాతన గ్రీస్‌లోనూ స్వస్తిక్‌ గుర్తును ఉపయోగించారు. దీనికి సంబంధించిన అవశేషాలు ట్రోయ్‌లో కనిపిస్తాయి. స్వస్తిక్‌ను వివిధ దేశాల్లో అనేక పేర్లతో పిలుస్తారు. జపాన్‌లో మంజీ, ఇంగ్లాండ్‌లో ఫ్లైఫోట్, గ్రీస్‌లో టెట్రాస్కెలిన్ పేరుతో వ్యవహరిస్తారు.దురదృష్టవశాత్తు పశ్చిమ దేశాలు అతి పవిత్రమైన
స్వస్తిక్‌ గుర్తుపై వ్యతిరేక భావనలు ఏర్పరచుకున్నాయి.

కెనడాలో నాజీ గుర్తు రాద్ధాంతం ఎందుకు?

ట్ర‌క్కు డ్రైవ‌ర్ల‌కు వ్యాక్సిన్ తప్ప‌నిస‌రి చేస్తూ కెన‌డా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీన్ని వ్య‌తిరేకిస్తూ కొన్ని రోజులుగా ట్ర‌క్కు డ్రైవ‌ర్లు ఆందోళ‌న చేస్తున్నారు. నిర‌స‌న‌కారులు నాజీ గుర్తు తరహా ఉండే చిహ్నాలతో కూడిన జెండాలతో ఆందోళనకు దిగారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత న్యూ డెమొక్రెటిక్ పార్టీ ఎంపీ జ‌గ్మీత్ సింగ్ ఓ ట్వీట్ చేస్తూ… కాన్ఫిడ‌రేట్ జెండాల‌ను నిషేధించే స‌మ‌యం వచ్చిందని వ్యాఖ్యానించారు. ద్వేష‌పూరిత చిహ్నాల‌ను నిషేధించాలని ఆయన తెలిపారు.

హిందూమతంలో స్వాస్తిక్..

స్వాస్తిక్ అనే పదం సు, అస, వ క అక్షరాలు కలిస్తే వస్తుంది. ఇందులో సు అంటే శుభం అస అంటే అస్థిత్వం, క అంటే కర్త అని అర్ధం. అందుకే ఈ గుర్తుని శుభసూచకంగా భావిస్తారు. హిందూమతం ప్రకారం స్వాస్తిక్‌లో నాలుగు సమాంతర భుజాలుంటాయి.ఇవి నాలుగు దిశలను సూచిస్తాయి. అందుకే హిందూమతంలో స్వస్తిక్ గుర్తుని శుభకార్యాల సమయంలో వాడుతారు. స్వస్తిక్ గుర్తును శుభసూచకంగా పరిగణిస్తారు. ఇంటి ముఖద్వారంపై స్వస్తిక్ గుర్తు పెట్టడం వల్ల ఏ విధమైన చెడు లేదా నెగెటివ్ శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవని నమ్మకం. ఇంటి ముఖద్వారంపై పసుపుతోనే ఈ స్వస్తిక్ గుర్తు వేయాల్సి ఉంటుంది. అది కూడా ఈశాన్యం లేదా ఉత్తర దిశలో గోడపై ఆ గుర్తు ముద్రించాలి. వాస్తు ప్రకారం ఇంట్లోని మందిరంలో కూడా స్వస్తిక్ గుర్తు ఉండాలి.