Goa Congress : గోవాలో కాంగ్రెస్‌కు భారీ షాక్..!!!

కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు భారత్ జోడో అంటూ పాదయాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ.

  • Written By:
  • Publish Date - September 14, 2022 / 07:36 PM IST

కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు భారత్ జోడో అంటూ పాదయాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ. కానీ హాస్తం పార్టీ నేతలు మాత్రం కాంగ్రెస్ ఛోడో అంటున్నారు. పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. తాజాగా 8 మంది గోవా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్‌, మాజీ CLP నేత మైఖేల్ లోబో సహా 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్.. కండువ కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించారని.. గోవాలో మాత్రం కాంగ్రెస్ ఛోడో ప్రారంభమైందన్నారు సీనియర్ నేత మైఖేల్ లోబో. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నుంచి వలసల ప్రవాహం ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి గోవాలో మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. ఇందులో 8 మంది బీజేపీలో చేరిపోయారు. అంతేకాదు.. కాంగ్రెస్ శాసనపక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలని తీర్మానించారు. విపక్ష నేతగా ఉన్న మైఖెల్ లోబో ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీన్ని మాజీ సీఎం, ఎమ్మెల్యే దిగంభర్ కామత్ బలపర్చగా.. మిగితా ఎమ్మెల్యేలు ఆమోదించారు. అనంతరం, స్పీకర్‌ను కలిసి లేఖ అందజేశారు.

మూడింట రెండొంతుల మంది పార్టీని వీడిన నేపథ్యంలో… అనర్హత వేటు పడే ప్రమాదం కూడా తప్పినట్టే. గోవాలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 40 స్థానాలకు గానూ బీజేపీ 20 సీట్లు గెలుచుకుంది. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. తాజాగా ఎమ్మెల్యేల చేరికతో గోవా అసెంబ్లీలో బీజేపీ బలం 28కు పెరిగింది. దిగంబర్‌ కామత్‌, మైఖేల్ లోబోలకు గోవా కేబినెట్‌లో మంత్రి పదవులు ఖాయమయ్యాయి.

ఇందుకోసం సిట్టింగ్‌ మంత్రుల్లో ముగ్గురు రాజీనామా చేస్తారని సమాచారం. 2019లోనూ 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 10 మంది బీజేపీలో చేరారు. అందుకే ఎన్నికల ఫలితాలు రాగానే అక్కడి పీసీసీ నేతలు పార్టీ ఫిరాయించబోమంటూ శాసనసభ్యులతో ప్రమాణాలు కూడా చేయించారు. అయితే జూలై నెలలోనే గోవా కాంగ్రెస్‌లో అలజడి రేగింది. ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీ అయ్యారన్న వార్తలు గుప్పుమన్నాయి. అధిష్టానం వెంటనే స్పందించి చర్యలు చేపట్టడంతో అప్పట్లో పరిస్థితి సద్దుమణిగింది. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ స్పందించే లోపే పార్టీ మార్పు జరిగిపోయింది.