Site icon HashtagU Telugu

Denver Dog: హైదరాబాద్ స్టార్టప్‌కి కొత్త ఉద్యోగి

Denver Dog

Denver Dog

హైదరాబాద్‌లోని ఒక స్టార్టప్‌ కంపెనీ తీసుకున్న భిన్నమైన నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగుల మానసిక ఆనందం పెరిగేందుకు, కార్యాలయ వాతావరణాన్ని సానుకూలంగా మార్చేందుకు ఆ సంస్థ చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. వారు ఏకంగా గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన డెన్వర్ అనే శునకాన్ని “చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్ (CH0)”గా నియమించారు!

ఈ స్టార్టప్ పేరు హార్వెస్టింగ్ రోబోటిక్స్. వ్యవసాయ రంగాన్ని మరింత స్థిరమైన మరియు సమర్థవంతమైన దిశగా తీసుకెళ్లేందుకు లేజర్-వీడింగ్ టెక్నాలజీపై పనిచేస్తోంది. ఈ సంస్థ సహ వ్యవస్థాపకుడు రాహుల్ ఆరెపాక, డెన్వర్ ఆఫీస్‌కు చేరిన తర్వాత లింక్డ్ఇన్‌లో ఓ పోస్టు చేసి ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ పోస్టు వేగంగా వైరల్ అయ్యి, నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.

రాహుల్ ఆ పోస్టులో ఇలా తెలిపారు:

“మా కొత్త నియామకం — డెన్వర్. ఇతను కోడింగ్ చేయడు, ఎటువంటి పనులు చేయడు. కానీ ఆఫీసుకు వచ్చి అందరి ముఖాల్లో చిరునవ్వులు నింపుతాడు. వాతావరణాన్ని సానుకూలంగా ఉంచుతాడు. ఇక నుంచి మేము అధికారికంగా పెట్-ఫ్రెండ్లీ ఆఫీస్ అయినందుకు గర్వంగా ఉంది. నిజంగా చెప్పాలంటే, మా ఆఫీసులో అత్యుత్తమ సౌకర్యాలు డెన్వర్‌కే ఉన్నాయి!” డెన్వర్‌ను కార్యాలయంలోకి తీసుకురావడం, ఉద్యోగుల ఒత్తిడిని తగ్గించేలా వాతావరణాన్ని మార్చడం తమ సంస్థ చేసిన అత్యుత్తమ నిర్ణయమని రాహుల్ పేర్కొన్నారు.

సీహెచ్‌ఓ డెన్వర్‌కు నెటిజన్ల అభినందనలు

రాహుల్ ఆరెపాక లింక్డ్‌ఇన్‌లో పెట్టిన డెన్వర్ పోస్టుకు వేగంగా స్పందన వచ్చింది. వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు, ప్రేమతో పొంగిపోయే మెసేజులు వెల్లువెత్తాయి. డెన్వర్‌కి కొత్తగా అప్పగించిన పాత్ర పట్ల నెటిజన్లు ఎంతో ఆసక్తిగా, సానుకూలంగా స్పందించారు.

ఒక యూజర్ హాస్యంగా వ్యాఖ్యానిస్తూ, “అందరినీ సంతోషంగా ఉంచే బాధ్యతతో సీహెచ్‌ఓ గారు అలసిపోయినట్టున్నారు!” అన్నాడు. మరొకరు, “నాలుగు కాళ్లు, సున్నా ఒత్తిడి, 100% తోక ఊపే సానుకూలత – అద్భుతమైన ఆలోచన!” అంటూ ప్రశంసించాడు. ఈ ఆలోచనను ఇతర సంస్థలు కూడా అనుసరించాలని చాలామంది సూచిస్తున్నారు. “మరిన్ని సీహెచ్‌ఓలు కావాలి – ఇది గ్లోబల్ అవసరం. బహుశా ఇదే పరిపూర్ణమైన ‘రిటర్న్ టు ఆఫీస్’ విజన్ కావచ్చు” అని ఒకరు పేర్కొన్నారు. ఇంకొకరు సరదాగా, “నేనైతే నా సీటు వదిలేవాడిని కాదు… అలాగే డెన్వర్‌ను నా సీటు నుంచి పంపేవాడిని కూడా కాదు!” అంటూ స్పందించారు.

పెట్-ఫ్రెండ్లీ ఆఫీసుల ప్రాధాన్యం పెరుగుతోంది

ఇటీవలి కాలంలో ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, ఒత్తిడి తగ్గింపు, శ్రేయస్సు వంటి అంశాలకు కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీనిలో భాగంగా పలు సంస్థలు తమ కార్యాలయాలను పెంపుడు జంతువులకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. అమెజాన్, గూగుల్, జాపోస్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే తమ ఆఫీసుల్లో పెంపుడు జంతువులను అనుమతిస్తున్నాయి.

జంతువుల సాన్నిహిత్యం ఉద్యోగులకు ఉపశమనం కలిగించడమే కాకుండా, సామాజిక సంబంధాలను మెరుగుపరచడం, ఉత్పాదకతను పెంచడం వంటి ప్రయోజనాలు కలుగజేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

హాబ్రి (Human Animal Bond Research Institute) చేసిన ఓ అధ్యయనం ప్రకారం, పెట్-ఫ్రెండ్లీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులలో 87% మంది తమ కంపెనీకి నిబద్ధత చూపుతారని, 91% మంది తమ పనిలో మరింత నిమగ్నతతో ఉంటారని తేలింది.

ఈ నేపథ్యంలో హార్వెస్టింగ్ రోబోటిక్స్ చేసిన డెన్వర్ నియామకం, ఉద్యోగుల సానుకూలతను పెంచడంలో చక్కటి ముందడుగు. ఇది ఇతర సంస్థలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.