Site icon HashtagU Telugu

LinkedIn Profile : రెండేళ్ల బాలుడి పేరిట లింక్డిన్‌ ప్రొఫైల్‌.. నెటిజన్ల రియాక్షన్ ఇదీ

2 Year Old Kids Linkedin Profile

LinkedIn Profile : లింక్డిన్‌ .. చాలాపెద్ద ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ యాప్‌. ఈ యాప్‌లో ఎంతోమంది ప్రముఖులు ఉంటారు. ఎన్నో కంపెనీల ఉన్నతాధికారులు కూడా లింక్డిన్‌ ప్లాట్‌ఫామ్‌లో యాక్టివ్‌గా ఉంటారు. జాబ్ సెర్చ్ కోసం ఎంతోమంది యువత ఈ వేదికను వాడుకుంటారు. ఎన్నో కంపెనీలు అర్హులైన ఉద్యోగులను వెతికేందుకు లింక్డిన్‌ ప్లాట్‌ఫామ్‌‌ను నిత్యం వాడుతుంటాయి.  అయితే తాజాగా ఓ కంపెనీ సహ వ్యవస్థాపకుడు తన రెండేళ్ల కొడుకు పేరిట లింక్డిన్‌ ప్రొఫైల్‌ను(LinkedIn Profile) క్రియేట్ చేశారు. దీంతో ఇప్పుడు దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

We’re now on WhatsApp. Click to Join

శివేష్‌ కుమార్‌.. ఈయన కాఫీ ఇండియా అనే కంపెనీ సహ వ్యవస్థాపకుడు. తన రెండేళ్ల కుమారుడి కోసం ఆయన లింక్డిన్‌‌లో ప్రొఫైల్‌ను తయారు చేశారు. ఆ ప్రొఫైల్‌లో తన కుమారుడి పేరును టైగర్‌ చౌహాన్‌ అని పెట్టారు. దీనికి సంబంధించిన బయోలో..  ‘‘నేను పిల్లాడిని. ఈ ప్రపంచంలో నా స్థానాన్ని తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నా. మా నాన్నగారి స్నేహితుడు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు. ‘నెట్‌వర్క్‌ ఈజ్‌ వెల్త్‌’ అని అందుకే కెరీర్‌కు సాయపడే నెట్‌వర్క్‌ కోసం ఇక్కడకు వచ్చాను’’ అని రాయడం విశేషం.  ‘ప్రస్తుతం నాకు రెండేళ్లు. ఇప్పటికే ప్రపంచంలో ఉన్న ఒత్తిడిని అనుభవిస్తున్నాను. నన్ను స్కూల్‌లో చేర్చేందుకు ఇంట్లో చర్చలు జరిగాయి. మంచి ప్రీస్కూల్‌లో చేరేందుకు ఈ నెట్‌వర్క్ సాయపడుతుందని అనుకుంటున్నా’’ అని ఆ పోస్టులో ప్రస్తావించడం గమనార్హం. ‘‘నేను సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు వారానికి ఒక్కసారైనా లాగిన్‌ అవుతాను’’ అని అందులో ఆసక్తికరంగా రాసుకొచ్చారు.

Also Read :Doctor case : కోల్‌కతా ఘటన..కాలేజ్‌ మాజీ ప్రిన్సిపాల్‌ పై సస్పెన్షన్ వేటు..

ఈ లింక్డిన్‌ ప్రొఫైల్‌, దానికి సంబంధించిన బయోపై నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ బాలుడి ఫొటో, పోస్ట్‌కు సంబంధించిన క్లిప్స్ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మైనర్ బాలుడి కోసం ఇప్పుడే సోషల్ మీడియా ప్రొఫైల్‌ తయారు చేయడానికి చాలామంది వ్యతిరేకిస్తున్నారు. బాలుడి ఫొటో, పేరు లాంటి విషయాలు ఎక్కడపడితే అక్కడ వెల్లడిస్తే.. పిల్లల సమాచార గోప్యతకు భంగం కలుగుతుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూడటం కంటే లింక్డిన్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం మంచిపనేనని కొందరు పేర్కొంటున్నారు.