Lottery : అప్పు తీర్చేందుకు ఇల్లు అమ్మకానికి.. లాటరీ తగలడంతో టర్నింగ్ పాయింట్!!

అప్పులు తీర్చేందుకు అతడు ఇంటిని అమ్మకానికి పెట్టాడు. కొద్ది గంట‌ల్లోనే రూ.కోటి లాట‌రీ త‌గ‌ల‌డంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిర‌య్యాడు.

  • Written By:
  • Publish Date - July 27, 2022 / 08:00 PM IST

అప్పులు తీర్చేందుకు అతడు ఇంటిని అమ్మకానికి పెట్టాడు. కొద్ది గంట‌ల్లోనే రూ.కోటి లాట‌రీ త‌గ‌ల‌డంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిర‌య్యాడు. ఈ అరుదైన అదృష్ట అనుభూతి కేర‌ళ‌లోని కొజికోడ్‌ కు చెందిన మ‌హ్మ‌ద్ బ‌వాకు ఎదురైంది.అదృష్టం త‌లుపు తడితే ఎంత‌టి విప‌త్క‌ర ప‌రిస్ధితినైనా అధిగ‌మించ‌వ‌చ్చ‌ని దీన్నిబట్టి వెల్ల‌డైంది.

ఎనిమిది నెల‌ల కింద‌టే కట్టుకున్న ఇల్లు.

పెయింట‌ర్ గా పనిచేసే మ‌హ్మ‌ద్ బ‌వా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.ఏమీ పాలుపోని స్ధితిలో.. ఎనిమిది నెల‌ల కింద‌టే కట్టిన కలల ఇంటిని అమ్మాలని డిసైడ్ అయ్యాడు. త‌న 2000 చ‌ద‌ర‌పు అడుగుల ఇంటిని అమ్మకానికి పెట్టాడు. సోమ‌వారం టోకెన్ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అద్దె ఇంటికి మారేందుకు ఏర్పాట్లు స్టార్ట్ చేశాడు. ఇది జరిగిన కొన్ని గంట‌ల్లోనే జాక్‌పాట్ వ‌రించింది.

పెళ్లిళ్లు, ఇల్లు కట్టి…

బ‌వాకు భార్య, న‌లుగురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నాడు. ఇద్ద‌రు పెద్ద కూతుళ్ల‌కు వివాహం జ‌రిపించ‌గా మ‌రో ఇద్ద‌రు కూతుళ్లు స్కూల్‌లో చ‌దువుతున్నారు. ఇద్ద‌రు కూతుళ్ల‌కు పెళ్లిళ్లు జ‌రిపించి ఇంటి నిర్మాణం చేప‌ట్ట‌డంతో బ‌వా అప్పుల పాల‌య్యాడు. బ్యాంకులు, బంధువుల వ‌ద్ద రూ.50 ల‌క్ష‌లు బాకీ ప‌డ్డాడు. త‌న కుమారుడు నిజాముద్దీన్‌ను ఖ‌తర్‌కు పంపించేందుకు కూడా బ‌వా అప్పు చేశాడు. స్నేహితులు ఎవ‌రూ సాయం చేసేందుకు ముందుకు రాక‌పోవ‌డంతో హోస‌న్‌గ‌డిలోని ఓ ఏజెన్సీ నుంచి లాట‌రీ టికెట్లు కొన్నాడు. ఏదో ఒక రోజు జాక్‌పాట్ కొడ‌తాన‌నే ఆశ‌తో లాట‌రీ టికెట్లు కొంటున్నాడు. ఇక లాభం లేద‌నుకుని అప్పులు తీర్చేందుకు త‌న ఇంటిని రూ 40 లక్ష‌ల‌కు విక్ర‌యించేందుకు సిద్ధ‌ప‌డ్డాడు. ఈక్రమంలో జాక్‌పాట్ త‌గిలింద‌నే స‌మాచారంతో బ‌వా ఉద్వేగానికి లోన‌య్యాడు. ట్యాక్స్‌లు మిన‌హాయిస్తే బ‌వాకు రూ.63 లక్ష‌ల వ‌ర‌కూ ల‌భించ‌నున్నాయి. ఇంటి అమ్మ‌కం ఆలోచ‌న విర‌మించుకున్న బ‌వా జాక్‌పాట్ మొత్తంతో అప్పులు తీర్చాల‌ని భావిస్తున్నాడు.