Dart : “డార్ట్” మిష‌న్ తొలి ఫోటోలు విడుదల.. స్పేస్ క్రాఫ్ట్ ఢీకొట్టాక ఆస్టరాయిడ్ పరిస్థితిదీ

గ్ర‌హ‌శ‌క‌లాల గండం నుంచి భూమిని కాపాడటానికి నాసా చేప‌ట్టిన "డార్ట్" మిష‌న్ ఇటీవల విజ‌య‌వంత‌మైంది.

  • Written By:
  • Updated On - October 1, 2022 / 11:13 AM IST

గ్ర‌హ‌శ‌క‌లాల గండం నుంచి భూమిని కాపాడటానికి నాసా చేప‌ట్టిన “డార్ట్” మిష‌న్ ఇటీవల విజ‌య‌వంత‌మైంది. ఇందులో భాగంగా నాసా ప్రయోగించిన డబుల్ ఆస్టరాయిడ్ రీ డైరెక్షన్ టెస్ట్ “DART” అనే స్పేస్ క్రాఫ్ట్.. డైమోర్ఫోస్ అనే ఆస్టరాయిడ్ ను బలంగా ఢీ కొట్టింది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను నాసా విడుదల చేసింది. స్పేస్ క్రాఫ్ట్ ఢీకొట్టిన తర్వాత డైమోర్ఫోస్ , డిడిమోస్ ఆస్టరాయిడ్ల పరిసరాల్లో దుమ్ము ధూళి కణాలు కమ్ముకోవడం కనిపించింది. ఈ ప్రయోగం జరిగిన 4 గంటల తర్వాత జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కు చెందిన నియర్ ఇన్‌ఫ్రారెడ్ కెమెరా (NIRCam) ఫోటోలు తీసి నాసాకు పంపింది. ఈ ఫోటోలు ఎరుపు రంగులో చూపబడ్డాయి. ఎందుకంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రధానంగా ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రమ్‌లో పనిచేస్తుంది.ఇక హబుల్ టెలిస్కోప్ తీసి పంపిన ఫోటోలు నీలం రంగులో ఉన్నాయి.

 

ఎందుకంటే అది వైడ్ ఫీల్డ్ రకం మూడో కెమెరా నుంచి విజువల్స్ తీసింది. ఆస్టరాయిడ్ ను స్పేస్ క్రాఫ్ట్ ఢీకొట్టిన తర్వాత 22 నిమిషాలకు ఒకసారి.. ఐదు గంటలకు ఒకసారి.. ఎనిమిది గంటలకు ఒకసారి హబుల్ టెలిస్కోప్ ఫోటోలు తీసింది.నాసా స్పేస్ క్రాఫ్ట్ ఢీకొట్టిన తర్వాత గ్రహశకలం ప్రస్తుతం 11గంటల 55 నిమిషాల కక్ష్యలో తిరుగుతోందని.. తాజా ప్రయోగంతో అది 10 నిమిషాలు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. గ్రహశకలం గమనం ఎంత మారిందో తెలుసుకోవడానికి కొన్ని రోజులు లేదా వారాలు పట్టవచ్చని పేర్కొన్నారు.610 కిలోల బరువున్న డార్ట్‌ అంతరిక్షవాహనాన్ని 2వేల 653కోట్ల వ్యయంతో 2021 నవంబర్‌ 24న నాసా ప్రయోగించింది. డైమార్ఫస్‌ను ఢీకొట్టడానికి ముందు జరిగే పరిణామాలను డార్ట్‌లోని కెమెరా ఫోటోలు తీసి పంపింది.