Dogs Crematorium : కుక్కల కోసం శ్మశానవాటిక.. ఔను మీరు చదివింది నిజమే. డాగ్స్ కోసం, క్యాట్స్ కోసం శ్మశాన వాటిక రెడీ అవుతోంది. ఎక్కడో తెలుసా ? గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో. దీన్ని ఏదో స్వచ్ఛంద సంస్థ నిర్మించడం లేదు. స్వయంగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ కుక్కల శ్మశాన వాటికను నిర్మిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.30 లక్షల దాకా ఖర్చు పెడుతోంది.
Also Read :Aurangzebs Tomb: ఔరంగజేబ్ సమాధిపై ఐరాసకు మొఘల్ వారసుడి లేఖ.. ఎవరతడు ?
కుక్కలు, పిల్లుల శ్మశాన వాటిక వివరాలివీ..
- గుజరాత్‌లోని అహ్మదాబాద్(Dogs Crematorium) నగరం దానిలిమ్డా ప్రాంతంలో ఉన్న కరుణా మందిర్‌లో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక శ్మశాన వాటికను నిర్మిస్తున్నారు.
- కుక్కల కళేబరాలను దహనం చేసి బూడిదగా మార్చడానికి అధునాతన సీఎన్‌జీ ఫర్నేస్ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేస్తున్నారు.
- ఇక్కడి ఫర్నేస్‌లో ఒకేసారి రెండు కుక్కలను దహనం చేయొచ్చు.
- ఇకపై అహ్మదాబాద్ నగరం పరిధిలో చనిపోయే పెంపుడు కుక్కలు, పిల్లులను ఈ శ్మశాన వాటికలోనే దహనం చేస్తారు.
- ఈ సిటీ పరిధిలో పెంపుడు కుక్కలు, పిల్లులు కలిగిన వాళ్లంతా ఈ సేవను వాడుకోవచ్చు.
- సీఎన్‌జీ ఫర్నేస్ ద్వారా పర్యావరణహితమైన పరిస్థితుల్లో చనిపోయిన శునకాలు, పిల్లులను దహనం చేస్తారు.
- తాము ఎంతో ప్రేమగా పెంచుకునే పెంపుడు జంతువులకు గౌరవపూర్వక అంత్యక్రియ జరగాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. అందుకే ఈ శ్మశాన వాటికను ఏర్పాటు చేస్తున్నామని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికార వర్గాలు చెబుతున్నాయి.
- ఈ శ్మశాన వాటిక సర్వీసులను వాడుకోవాలని భావించే.. పెంపుడు జంతువుల యజమానులంతా మున్సిపల్ కార్పొరేషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- అహ్మదాబాద్ నగరం పరిధిలో దాదాపు 60,000 పెంపుడు కుక్కలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు 6వేల పెంపుడు కుక్కల యజమానులు మాత్రమే మున్సిపల్ కార్పొరేషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
- నగరంలో వేలాది పెంపుడు పిల్లులు కూడా ఉన్నాయి. వాటి యజమానులు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది.
- రానున్న రోజుల్లో వారంతా రిజిస్ట్రేషన్ కోసం మున్సిపల్ కార్పొరేషన్ వద్దకు క్యూ కట్టే ఛాన్స్ ఉంది.
- ఈ రిజిస్ట్రేషన్ కోసం కొంత ఛార్జీని అధికారులు వసూలు చేయనున్నారు. ఫలితంగా మున్సిపల్ కార్పొరేషన్‌కు కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది.
- ఇక అహ్మదాబాద్‌లో చనిపోయే కుక్కలు, పిల్లులను శ్మశాన వాటికకు తీసుకెళ్లడానికి ప్రత్యేక వాహన సర్వీసును కూడా తీసుకురానున్నారు. ఇందుకోసం ఆయా పెంపుడు జంతువుల పోషకులు కొంత మొత్తాన్ని మున్సిపల్ కార్పొరేషన్‌కు చెల్లిస్తే సరిపోతుంది.