Raipur: మాట నిలబెట్టుకున్న సీఎం…హెలికాప్టర్ లో పర్యటించనున్న విద్యార్థులు..!!

ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్.

  • Written By:
  • Publish Date - October 8, 2022 / 06:55 AM IST

ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్. 10, 12 తరగతుల్లో మెరిట్ సాధించిన విద్యార్థులను హెలికాఫ్టర్ లో తిప్పుతానంటూ గతంలో మాటిచ్చారు. ఈ మాట ప్రకారం… 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో మెరిట్‌ జాబితాలో చోటు దక్కించుకున్న విద్యార్థులు శనివారం హెలికాప్టర్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2022 వార్షిక పరీక్షలో, 10వ తరగతికి చెందిన 90 మంది, 12వ తరగతికి చెందిన 35 మంది విద్యార్థులు మెరిట్ లిస్ట్‌లో స్థానం సంపాదించారు.

అక్టోబర్ 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి హెలికాప్టర్ ద్వారా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సంతోషపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. హెలికాప్టర్‌లో ఏడు సీట్లు ఉండటంతో ఒకేసారి ఏడుగురు విద్యార్థులు మాత్రమే ప్రయాణించగలరు. ఈ హెలికాప్టర్ 18 సార్లు ప్రయాణించి మెరిట్ జాబితాలో చేరిన మొత్తం 125 మంది విద్యార్థులను తీసుకెళ్లనుంది. ప్రతిభావంతులైన విద్యార్థుల తల్లిదండ్రుల నుండి సంతకం చేసిన సమ్మతి లేఖను బోర్డు కోరింది. ఇప్పటి వరకు 119 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రం అందిందని బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వీకే గోయెల్ తెలిపారు.

విద్యార్థుల పట్టుదల ముందు సీఎం ఓటమి
ఈ ఏడాది మే 6న ప్రతాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రఘునాథ్‌నగర్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి బఘేల్ హాజరయ్యారు. అక్కడ స్వామి ఆత్మానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని స్మృతి నేను హెలికాప్టర్‌లో ఎప్పుడు కూర్చుంటానని ముఖ్యమంత్రిని అడిగారు. ఎప్పుడైతే 12వ తరగతి టాపర్ అవుతావో అప్పుడు హెలికాప్టర్‌లో కూర్చోబెడతానని ముఖ్యమంత్రి చెప్పారు. స్మృతి టాపర్ గా నిలిచింది. ఆమె పట్టుదలను నెరవేర్చిన ముఖ్యమంత్రి ఆమెకే కాకుండా అనేక మంది విద్యార్థులు కూడా హెలికాప్టర్‌లో పర్యటించారు. ఈసారి 10, 12 తరగతుల టాపర్లను హెలికాప్టర్‌లో తీసుకెళ్తామని మే 5న ముఖ్యమంత్రి ప్రకటించారు.