Queen In Clouds: రాణి వెడలే.. మేఘ సందేశంతో స్వర్గ సీమకు కదిలే!!

  • Written By:
  • Publish Date - September 9, 2022 / 10:06 PM IST

మేఘ సందేశం అంటే అదేనేమో..!!
ప్రపంచంలో ఇప్పటివరకు వెలుగొందిన ఒక ధ్రువ తార రాలిపోయిందనే సందేశం వస్తోందా? అనే సందేహం కలిగించేలా బ్రిటన్ దేశ ఆకాశంలో అద్భుతాలు జరిగాయి. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 మ‌ర‌ణానంత‌రం ఇవన్నీ జరగడంతో అందరిలో ఆలోచన రేకెత్తింది. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 నివసించిన బకింగ్‌హామ్ ప్యాలెస్ మీదుగా రెండు ఇంద్ర ధనస్సులు కనిపించాయి. అలాగే బ్రిటన్ లోని ఒక నగరంపై ఆకాశంలో ఎలిజబెత్‌ రూపంలో, బంగారు వర్ణంలో ఉన్న మేఘం ఆకట్టుకుంది.

ఎలిజబెత్‌ను పోలిన మేఘం..

ష్రాప్‌షైర్‌లోని టెల్ఫోర్డ్ ప్రాంతంపై ఆకాశంలో బంగారు వర్ణంలో ఎలిజబెత్‌ను పోలిన మేఘం కనిపించింది. లిన్నే అనే మహిళ కారులో వెళ్తుండగా ఆమె 11 ఏళ్ల కుమార్తె దీనిని గుర్తించింది. అమ్మా.. ‘క్వీన్‌’ అని అరిచిన ఆ బాలిక ఎలిజబెత్‌ రూపంలో ఉన్న ఆ మేఘాన్ని తల్లికి చూపించింది. ‘ఓ మై గాడ్‌’ అంటూ ఆ చిన్నారి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీంతో కారును నిలిపిన ఆ మహిళ తన మొబైల్‌ ఫోన్‌లో ఫొటోలు తీసింది. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా, క్వీన్‌ ఎలిజబెత్‌ను పోలిన బంగారు వర్ణంలో ఉన్న మేఘం ఫొటో వైరల్‌ అయ్యింది.

రెండు ఇంద్ర ధనస్సులు..

శుక్రవారం రోజున క్వీన్‌ ఎలిజబెత్‌ అధికార నివాసమైన బకింగ్‌హామ్ ప్యాలెస్ మీదుగా ఆకాశంలో రెండు ఇంద్ర ధనస్సులు కనిపించాయి. లండన్‌ ప్రజలు ఈ వింతను చూశారు. ఆ ఇంద్రధనస్సుల మీదుగా తమ రాణి స్వర్గానికి వెళ్లినట్లు వారు భావించారు. జర్నలిస్ట్ జెన్నిఫర్ వాలెంటైన్ ట్వీట్ చేసిన ఈ ఫొటో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కాగా,96 ఏళ్ల క్వీన్‌ ఎలిజబెత్‌, స్కాట్లాండ్‌లోని వేసవి విడిది నివాసంలో గురువారం కన్నుమూశారు. వృద్ధాప్యం, తీవ్ర అనారోగ్యానికి గురై రాణి ఎలిజబెత్ 2 కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు. గత ఏడాది అక్టోబర్‌ నుంచే ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నడవడం, నిలబడడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో అప్పటినుంచి స్కాట్లాండ్‌లోని బాల్మోరల్‌ క్యాజిల్‌లోనే ఆమె ఉంటున్నారు. చివరికి అనారోగ్యంతోనే కన్నుమూశారు. ఈ విషయాన్ని బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ వెల్లడించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, సహా యావత్ ఇంగ్లాండ్ శోకసంద్రంలో మునిగిపోయింది.