12,000-year-old elephant: ఏనుగుల ముత్తాత శిలాజం.. 12000 ఏళ్ల కిందటిది చిలీలో లభ్యం!!

ఇప్పుడున్న ఏనుగుల ముత్తాతగా భావిస్తున్న ఓ ఏనుగు శిలాజాన్ని చిలీ శాస్త్రవేత్తలు గుర్తించారు.

  • Written By:
  • Publish Date - September 28, 2022 / 10:51 PM IST

ఇప్పుడున్న ఏనుగుల ముత్తాతగా భావిస్తున్న ఓ ఏనుగు శిలాజాన్ని చిలీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ శిలాజం 12000 ఏళ్ల కిందట భూమిపై జీవించిన ” గొంఫో థీరెస్ ” (Gomphotheres) అనే బాహుబలి ఏనుగుదని వెల్లడైంది.
దక్షిణ చిలీలోని టగువా టగువా అనే గ్లేసియర్ సరస్సు సమీపంలో గొంఫో థీరెస్ ఏనుగు శిలాజాలు దొరికాయి. దాని బరువు 4 టన్నులు, పొడవు 3 మీటర్లు (9.8 అడుగులు) ఉండేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అప్పట్లో పరిసర ప్రాంత ప్రజలు, వేటగాళ్ల వేట వల్ల ” గొంఫో థీరెస్ ” ఏనుగులు అంతరించాయని చెప్పారు. నాడు మారిన వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు కూడా వీటి అంతర్ధానానికి కారణమై ఉంటాయని అంచనా వేస్తున్నారు.

ఏడాది కింద..

ఒకప్పుడు ఈ భూమ్మీద మనుగడ సాగించి అంతరించిపోయిన డైనోసార్ల అవశేషాలు చిలీలోని దక్షిణ ప్రాంతంలోనే గత సంవత్సరం బయటపడ్డాయి. ఆ డైనోసార్లకి శాస్త్రవేత్తలు ‘స్టెగోరస్ ఎలెన్ గాసెన్’ అనే పేరు పెట్టారు. ఆంకిలోసారస్ జాతికి చెందిన ఇతర డైనోసార్ల తరహాలోనే దీని తల కూడా సాధారణంగానే ఉండగా, శరీరం, తోక విభిన్నంగా ఉన్నట్టు గుర్తించారు. ఇది రెండు మీటర్ల పొడవు ఉందని లభ్యమైన శిలాజాల ద్వారా అర్థమవుతోందని తెలిపారు. ఈ శిలాజం 74.9 మిలియన్ల సంవత్సరాల నాటిదని పరిశోధకులు భావిస్తున్నారు.