ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో పుట్టినరోజువేడుకలో భోజనం చేసిన 24 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. వాంతులు, విరోచనాలు, కడుపునొప్పి రావడంతో చిన్నారులకు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మోహన్ లాల్ గంజ్ లోని గౌరా ప్రాంతంలో ఓ పుట్టినరోజు వేడుకకు చాలామంది చిన్నారులు హాజరయ్యారు. రాత్రి 8గంటలకు కేక్ కట్ చేసిన తర్వాత చిన్నారులకు స్వీట్లు, కేక్, శెనగలతోపాటు పలు రకాల వంటకాలను వడ్డించారు. అవి తిన్న చిన్నారులు గంటలోపే వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారందరినీ దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఎంఓ మనోజ్ అగర్వాల్ ఆసుపత్రిలో చిన్నారులను పరామర్శించారు. వారికి సరైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చిన్నారులే కాకుండా ఈ పుట్టినరోజు వేడుకలో భోజనం చేసిన పెద్దలు కూడా అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఇలా జరిగిందని లక్నో చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు.