Brahmastra & Sudarshan Chakra: పౌరాణిక అస్త్రాల పోలికలతో “హెల్ ఫైర్”.. ఎలా, ఎందుకు?

అల్ ఖైదా చీఫ్ అల్ జవహరిని మట్టుబెట్టేందుకు అమెరికా వాడిన ఒక పవర్ ఫుల్ అస్త్రంపైనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దాని పేరే..

  • Written By:
  • Publish Date - August 4, 2022 / 10:15 AM IST

అల్ ఖైదా చీఫ్ అల్ జవహరిని మట్టుబెట్టేందుకు అమెరికా వాడిన ఒక పవర్ ఫుల్ అస్త్రంపైనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దాని పేరే.. “హెల్ ఫైర్ ఆర్9ఎక్స్ క్షిపణి”!! జులై 31న రాత్రి 9.38 నిమిషాలకు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లోని తన ఇంటి బాల్కనీలో నిలబడి ఉన్న అల్ జవహరిని అత్యంత ఖచ్చితత్వంతో “హెల్ ఫైర్ ఆర్9ఎక్స్ క్షిపణులు” కడతేర్చాయి.
ఒక్కదుటున దూసుకెళ్లి జవహరి శరీరాన్ని చీల్చివేశాయి. దాంతో అక్కడేమీ పేలుడు లేకుండానే ఆపరేషన్ పూర్తయింది.  అగ్రరాజ్యం అమెరికా సీక్రెట్ వెపెన్ గా పేరొందిన “హెల్ ఫైర్ ఆర్9ఎక్స్ క్షిపణి” గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వార్ హెడ్ స్థానంలో 6 పదునైన బ్లేడ్లు..

హెల్ ఫైర్ మిస్సైల్ ఇది చాలా లైట్ వెయిట్ తో ఉంటుంది. అందుకే వేగం ఎక్కువ. ఖచ్చితత్వం ఎక్కువ. పేలుడు లేకుండానే పనిని పూర్తిచేయగలదు.. టార్గెట్ గా చేసుకున్న వ్యక్తిని చీల్చి చెండాడ గలదు. వాస్తవానికి మందుగుండు, బాంబులతో కూడిన వార్ హెడ్ లను మోసుకెళ్లే సామర్ధ్యం కూడా ఈ క్షిపణికి ఉంది. అయితే అల్ జవహరి లాంటి ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్లలో వాడేటప్పుడు ఈ క్షిపణిని వార్ హెడ్ ను తీసేసి..దాని స్థానంలో కత్తుల వంటి పదునైన ఆయుధాలను అమరుస్తున్నారు. అల్ జవహరిపై అటాక్ కోసం కూడా ఇలాగే చేశారు. ఈ క్షిపణి జవహరి శరీరంలో నుంచి దూసుకెళ్లి.. ఇంటి బాల్కనీలోని ఒక కిటికీని తాకింది.దీంతో ఆ కిటికి పగిలిపోయింది. అక్కడున్న మరెవరికి ప్రాణ నష్టం జరగలేదు.

2017లో ఉగ్రవాది అల్ మస్రీని ఇలాగే..

అంతకుముందు 2017లో అల్ ఖైదా అగ్రనేత అబు అల్ ఖాయిర్ అల్ మస్రీని అంతమొందించేందుకు కూడా ఈ వెపన్ నే అమెరికా ఉపయోగించింది. అల్ మస్రీ సిరియాలో ఓ కారులో వెళుతుండగా, హెల్ ఫైర్ క్షిపణులు అతడిని కడతేర్చాయి.  ప్రయాణిస్తున్న కారుకు పైభాగంలో పెద్ద రంధ్రం ఉండడం అప్పట్లో ఫొటోల్లో దర్శనమిచ్చింది. కారు ముందు, వెనుక భాగాలు చెక్కుచెదరకుండా ఉండగా, కేవలం కారు టాప్ మాత్రమే, అది కూడా అల్ మస్రీ కూర్చున్న చోటే పైభాగంలో రంధ్రం ఉంది.  అమెరికా ఎంత కచ్చితత్వంతో ఈ సర్జికల్ దాడులు చేసిందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.

హెల్ ఫైర్ మిస్సైల్ లోగుట్టు ఇదీ..

* హెల్ ఫైర్ మిస్సైల్ కు ‘ఫ్లయింగ్ జిన్సు’ అమర్చారు. దీన్ని జపాన్ కత్తి లేదా ‘నింజా బాంబ్’ అని కూడా పిలుస్తారు.
* ‘ఫ్లయింగ్ జిన్సు’ ఎలాంటి లోహాన్నయినా కోసేస్తుంది.
* ఈ క్షిపణికి మూలం ఏజీఎం 114 హెల్ ఫైర్ అనే మరో క్షిపణి.
* ఇది లేజర్ గైడెడ్ క్షిపణి. ఆకాశం నుంచి భూమి మీదకు దీన్ని ప్రయోగిస్తారు.
* ధ్వని కంటే తక్కువ వేగంతో ప్రయాణించే ఈ క్షిపణికి సంబంధించి అనేక వేరియంట్లు ఉన్నాయి. వాటిలో ఒకటి “హెల్ ఫైర్ ఆర్9ఎక్స్”.
* దీన్ని మాజీ అమెరికా అధ్యక్షుడు ఒబామా హయాంలో డెవలప్ చేశారు.
* దాదాపు 5 అడుగులు.. 45 కేజీల బరువుతో ఉండే ఈ క్షిపణిని డ్రోన్లు.. హెలికాఫ్టర్లు.. విమానాలు.. హమ్వీ వాహనాలతో ప్రయోగించే వీలుంది.
* 500 మీటర్ల నుంచి 11 కిలోమీటర్ల రేంజ్ వరకు దీన్ని ప్రయోగించే వీలుంది.
* క్షిపణి ముందు భాగంలో పదునైన కత్తులు లాంటి బ్లేడ్లు ఉంటాయి. లక్ష్యం సమీపానికి వెళ్లగానే.. ఈ బేడ్లు విచ్చుకొని ఒక్కసారిగా లక్షిత వ్యక్తుల్ని టార్గెట్ చేసి.. శరీరాన్ని ఛిద్రం చేసేస్తాయి.

పౌరాణిక అస్త్రాలను తలపించేలా..

హెల్ ఫైర్ మిస్సైల్ ముందు భాగంలో అమర్చిన 6 పదునైన బ్లేడ్లు.. మన పురాణాల్లో అభివర్ణించిన సుదర్శన చక్రాన్ని పోలి ఉన్నాయని కొందరు అంటున్నారు. సుదర్శన చక్రం శత్రువును వెంటాడి వేటాడి చంపుతుంది. హెల్ ఫైర్ మిస్సైల్ కూడా అదే విధంగా టార్గెట్ ను తునాతునకలు చేసి తీరుతుంది. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే వెనక్కి తీసుకోలేరు. అదే విధంగా హెల్ ఫైర్ మిస్సైల్ ను ఎక్కు పెట్టినా వెనక్కి తీసుకోవడం అసాధ్యం. పరశురామ అస్త్రం గొడ్డలి. హెల్ ఫైర్ మిస్సైల్ లోని బ్లేడ్లు కూడా శత్రువుపై గొడ్డలి పెట్టులా విరుచుకుపడుతుంది.ఇంద్రుడి ఆయుధం అంజలికాస్త్రం పోలికలు కూడా హెల్ ఫైర్ మిస్సైల్ కు ఉంటాయి.