Site icon HashtagU Telugu

Case Of Missing Rat: పోలీసుల‌కు వింత ఫిర్యాదు.. ఎలుక పోయిందంటూ కేసు..!

Missing Rat

Missing Rat

ప్ర‌స్తుత స‌మాజంలో ఏదైనా స‌మ‌స్య వ‌స్తే కొంత‌మంది మొద‌టి ఆశ్ర‌యించేది పోలీస్ స్టేష‌న్‌. ఆ పోలీస్ స్టేష‌న్‌లో కూడా మ‌నం ఎలాంటి ఫిర్యాదులు చేస్తాం. మా ఇంట్లో దొంగలు ప‌డ్డారు. ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ పోయింది. కారు పోయింది. సైకిల్ పోయింది. ఫ‌లానా వాళ్ల‌తో మాకు ఫ‌లానా విష‌యంపై వాగ్వాదం జరిగింది అంటూ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదులు అందడం చూస్తునే ఉంటాం.

అయితే.. కొన్నిసార్లు పోలీస్ స్టేష‌న్‌లో వింత ఫిర్యాదులు వ‌స్తుంటాయి. అలాంటి ఓ వింత ఫిర్యాదు రాజ‌స్థాన్‌లో చోటుచేసుకుంది. ఓ వ్య‌క్తి త‌ను ప్రేమ‌గా పెంచుకుంటున్న ఎలుక‌ను ఎవ‌రో ఎత్తుకెళ్లారు అని రాజ‌స్థాన్‌కు చెందిన ఓ వ్య‌క్తి పోలీస్ స్టేష‌న్‌ను ఆశ్ర‌యించాడు. బాంస‌వాఢా జిల్లా సజ్జన్‌గఢ్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ వింత ఫిర్యాదు న‌మోదైంది. పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని పడ్లా వాఢ్కియా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆదివారం త‌న ఎలుక‌ను ఎవ‌రో ఎత్తుకెళ్లార‌ని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.

తాను పెంచుకునే ఎలుక 700 గ్రాముల బరువు ఉంటుందని, సెప్టెంబ‌ర్‌ 28న దానిని ఎవరో ఎత్తుకెళ్లారని ఆ వ్య‌క్తి చెప్ప‌డం ఇక్క‌డ మ‌రో విశేషం. అంతేకాకుండా.. తన త‌మ్ముడి ముగ్గురు కొడుకుల‌పై అనుమానం ఉందని చెప్పాడు. చివరకు చేసేదేమీ లేక పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురి పేర్లను అందులో నిందితులుగా పేర్కొన్నారు. ఇలాంటి వింత ఫిర్యాదు అందడం ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు.