Site icon HashtagU Telugu

Vintage Wine Theft: వామ్మో.. 13 కోట్ల రూపాయిల వైన్ మాయం.. అరెస్ట్ అయిన బ్యూటీ!

Spain

Spain

9 నెలల క్రితం స్పెయిన్‌ లో అత్యంత విలువైన పాతకాలపు వైన్ బాటిల్ మాయం అయ్యింది. అయితే ఆ పాతకాలపు వైన్ బాటిల్ చోరీని తొమ్మిది నెలల తర్వాత ఎట్టకేలకు చేదించారు పోలీసులు. 1.7 మిలియన్‌ డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.13.57 కోట్లు విలువైన ప్రఖ్యాత వైన్‌ బాటిళ్ల చోరీ కేసులో మాజీ మెక్సికన్‌ బ్యూటీ క్వీన్‌, రోమానియా డచ్‌ వ్యక్తిని పోలీసులు క్రోయేషియాలో అరెస్ట్‌ చేశారు. అయితే ఆ పాతకాలపు వైన్ బాటిల్ చోరీ చేసిన దొంగల కోసం యూరప్‌ మొత్తం జల్లెడపట్టినట్లు తెలిపారు పోలీసులు. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన చేసింది స్పెయిన్‌ జాతీయ పోలీసు విభాగం. 2021 అక్టోబర్ 21న పశ్చిమ నగరం కేసర్స్‌లో 1.65 మిలియన్‌ యూరోలు విలువ కలిగిన 45 వైన్‌ బాటిళ్లు చోరీకి గురయ్యాయి.

కాగా చోరీకి గురైన ఆ వైన్ బాటిళ్లలో 19వ శతాబ్దానికి చెందిన ఓ ప్రత్యేకమైన వైన్ బాటిల్‌ కూడా ఉందట. అయితే ఆ వైన్ బాటిల్ విలువ 3.10 లక్షల యూరోలు. వాటిని ప్రముఖ హోటల్‌ రెస్టారెంట్‌ ఈఐ అట్రియోలోని సెల్లార్‌ నుంచి పక్కా ప్రణాళికతో ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. స్పానిష్‌ డైలీ ఈఐ పైస్‌కు చెందిన 29 ఏళ్ల మెక్సికన్‌ యువతి అట్రియోలోని వెయిటర్స్‌ను రూమ్ సర్వీస్‌ అంటూ దారి మళ్లించింది. అప్పుడు ఆమెతో పాటు ఉన్న 47 ఏళ్ల వ్యక్తి వైన్‌ బాటిళ్లు ఉన్న సెల్లార్‌లోకి వెళ్లాడు. తన వద్ద ఉన్న మాస్టర్‌ కీతో బాక్సులను తెరిచి మూడు బ్యాగుల్లో నింపాడు. వాటిని టవల్స్‌లో చుట్టి, తరువాత ఆ మరుసటి రోజు ఉదయం 5 ప్రాంతంలో బ్యాగులతో సెక్యూరిటీని తప్పించుకుని హోటల్‌ నుంచి వెళ్లిపోయారు. హోటల్‌లోని సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు నమోదయ్యాయి.

అయితే ప్రాథమికంగా ఓ గ్యాంగ్‌ పక్కా ప్రణాళికతో చేసినట్లు పోలీసులు భావించారు. ఈ చోరీ జరగక ముందు ఇరువురు మూడు సార్లు అట్రియో హోటల్‌కి వచ్చారు. అందరిలాగే వారికి సైతం వైన్‌ బాటిళ్లు ఉన్న సెల్లార్‌ను చూపించారు హోటల్‌ సిబ్బంది. చోరీకి గురైన వాటిలో 1806 నాటికి చెందిన ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్‌ బోర్డియాక్స్‌ యక్వెమ్‌ బాటిల్‌ ఉంది. దాని విలువ భారీగా ఉంటుందని ఎల్‌ అట్రియో సహ యజమాని సొమెలియర్‌ జోస్‌ పోలో చెప్పారు.ఆ బాటిల్‌ నా వ్యక్తిగత చరిత్రలో భాగం. ఆ బాటిల్‌ అట్రియో, కేసర్స్, ఇక్కడి ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైన్‌ ప్రేమికుల చరిత్రలో ఒకటి అని పోలో తెలిపారు. చోరీ చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే దొంగలిద్దరు స్పెయిన్‌ దాటి వెళ్లారు. నెలల తరబడి వారికోసం యూరప్‌ మొత్తం గాలింపు చేపట్టగా ఇటీవలే మొంటెనెగ్రో నుంచి సరిహద్దు దాటేందుకు ప్రయత్నించి పట్టుబడ్డారు. వారిని పట్టుకునేందుకు నెదర్లాండ్స్‌, క్రొయేషియా, రొమానియా పోలీసులతో పాటు ఇంటర్‌పోల్‌ సహాయం తీసుకున్నప్పటికీ నిందితుల నుంచి అసలు సిసలైన వైన్ బాటిల్ ను స్వాధీనం చేసుకోలేకపోయారు.