ప్రసిద్ధ సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ మహానాడు భారీ విజయాన్ని సాధించినట్లు సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. దీపావళి సందర్భంగా రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు పోయెస్ గార్డెన్‌లోని ఆయన నివాసం ఎదుట గురువారం తెల్లవారుజామున అభిమానులు భారీగా గుమిగూడారు. తమ అభిమాన నటుడిని ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో ఉల్లాసంగా ఎదురుచూశారు.
ఉదయం 9.30కి రజనీకాంత్ ఇంటి నుంచి బయటకు వస్తుండగా, అభిమానులు నినాదాలు చేస్తూ ‘తలైవా, తలైవా’ అంటూ హర్షంగా ఆత్రుతగా స్పందించారు. రజనీకాంత్ తమకోసం స్నేహపూర్వకంగా అభివాదం చేస్తూ, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను చూసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేసారు.
ఈ సందర్బంగా విలేకర్లతో మాట్లాడిన రజనీకాంత్, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. “ప్రతి ఒక్కరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని ఆయన అన్నారు. విజయ్ మహానాడు గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, “విజయ్ మహానాడు నిజంగా భారీ విజయం సాధించింది. నేను విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని రజనీకాంత్ స్పష్టం చేశారు.
ఈ ప్రకటనతో రజనీకాంత్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. రజనీకాంత్ వ్యాఖ్యలు పరిశ్రమలో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేశాయి. అభిమానులు మాత్రమే కాదు, ఇండస్ట్రీలోని ఇతర ప్రముఖులు కూడా ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు.