Meta: టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించగా, ఇప్పుడు ఈ జాబితాలో ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా కూడా చేరింది. ఈ సంస్థ గతంలో రెండు దఫాలుగా వేలాదిమంది ఉద్యోగులను తొలగించింది. తాజా సమాచారం ప్రకారం, మెటా ఫరిధిలోని వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, వర్చువల్ రియాలిటీని అభివృద్ధి చేస్తున్న రియాలిటీ ల్యాబ్ వంటి విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు నిర్ణయించింది. అయితే, ఈ లేఆఫ్‌ల గురించి మరియు ఎంతమంది ఉద్యోగులను తొలగించాలనుకుంటున్నదీ మెటా ఇంకా ధ్రువీకరించలేదు.
అయితే, ఆ సంస్థ అధికార ప్రతినిధి ప్రకారం, “మేము దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలు, ప్రాంతీయ వ్యూహాల్లో మార్పులు చేస్తున్నాము, అందులో భాగంగానే ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయి” అని పేర్కొన్నారు.
మెటా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే, రిక్రూటింగ్, లీగల్ ఆపరేషన్, డిజైన్ వంటి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉంది. 2022లో మెటా 11 వేల మందిని తొలగించింది, ఇక గతంలో మరో 10 వేల మందిపై వేటు వేసింది. తాజాగా, మరికొందరిపై తొలగింపు జరగనుందనే వార్తలు వస్తుండగా, ఇప్పటికే తొలగింపుకు గురైన కొంత మంది సోషల్ మీడియా వేదికలపై తమ అనుభవాలను పంచుకుంటున్నారు. 2023 ఆగస్టు నాటికి, 422 కంపెనీలు 1.36 లక్షల మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.