Site icon HashtagU Telugu

ఆదికేశవ : రివ్యూ

Vaishnav Tej Aadikeshava Review

Vaishnav Tej Aadikeshava Review

నటీనటులు : వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, అపర్ణా దాస్, రాధికా శరత్ కుమార్, సదా తదితరులు

సంగీతం: జివి ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ: డూడ్లీ

నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య

దర్శకుడు : శ్రీకాంత్ ఎన్ రెడ్డి

Vaishnav Tej Aadikeshava Review మెగా హీరో వైష్ణవ్ తేజ్ శ్రీ లీల జంటగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఆదికేశవ. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాను జివి ప్రకాశ్ మ్యూజిక్ అందించారు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

We’re now on WhatsApp : Click to Join

కథ :

పనిపాట లేకుండా జాలీగా తిరిగే బాలు(వైష్ణవ్ తేజ్) తండ్రి పోరు పడలేక ఒక కాస్మెటిక్ కంపెనీలో జాబ్ చేస్తాడు. ఆ సంస్థ సిఈఓ చిత్రావతి (శ్రీలీల) ని చూసి ప్రేమించడం మొదలుపెడతాడు.చిత్రావతి కూడా బాలుని ఇష్టపడుతుంది. కానీ ఆమె తండ్రి వేరొకరితో ఆమె పెళ్లి నిశచయిస్తాడు. ఈ టైం లోనే బాలు తన కుటుంబానికి సంబంధించిన ఒక విషయం తెలుసుకుంటాడు. ఆ తర్వాత సొంతూరు బ్రహ్మసముద్రంకు వెళ్తాడు. అక్కడ చెంగారెడ్డి (జోజు జార్జ్) మైనింగ్ మాఫియా చేస్తూ ప్రజలను చెప్పుచేతల్లో పెట్టుకుంటాడు. అక్కడ బాలు ఏం చేశాడు. అతను రుద్రకాలేశ్వరె రెడ్డి ఎలా అయ్యాడు అన్నదే సినిమా కథ.

కథనం – విశ్లేషణ :

స్టార్ హీరోగా కెరీర్ ని నిలబెట్టాలంటే మాస్ ఆడియన్స్ మనసులు గెలవాల్సిందే. అందుకే రెండు మూడు సినిమాలు చేసిన హీరోలంతా మాస్ పల్స్ పట్టేందుకు ఆ ప్రయత్నాలు చేస్తారు. ఉప్పెనతో మెప్పించిన వైష్ణవ్ తేజ్ కూడా మాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఆదికేశవ అంటూ చేసిన ఈ సినిమా మాస్ సినిమా అని టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. అయితే ఎంత మాస్ సినిమా అయినా రొటీన్ కి భిన్నంగా ఉండాలని అనుకుంటారు ఆడియన్స్.

మూసలో పోసినట్టుగా తీస్తే చూసేలా లేరు ఆడియన్స్. మాస్ సినిమాలకు ఉన్న ఆ లాజిక్ పట్టేస్తే చాలు.. అయితే ఆదికేశవ ఆ లాజిక్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. 3 సినిమాల అనుభవం ఉన్న హీరోతో మాస్ అప్పీల్ కథని రాసుకున్న శ్రీకాంత్ రెడ్డి అతన్ని సరిగా చూపించలేకపోయాడు. ఒక మాస్ కథకు అంతే మాస్ ఇమేజ్ ఉన్న హీరో కావాలి కానీ యూత్ ఫుల్ హీరోతో మాస్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు కథలో చాలా విషయం ఉండాలి. కానీ రొటీన్ కథతో మాస్ సినిమా చేస్తే ఫలితం తేడా కొట్టేస్తుంది.

హీరోకి జాబ్, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఇలా ఉండగా సెకండ్ హాఫ్ లో అతనికొక ఫ్లాష్ బ్యాక్ ఇదంతా కూడా డైరెక్టర్ రొటీన్ టెంప్లేట్ తో వెళ్లాడని అనిపిస్తుంది. మాస్ సినిమా కాబట్టి కావాల్సినంత రక్తపాతం పెట్టినా ఎక్కడ సరైన ఎమోషన్ పండలేదు. ఆది, జయం మనదేరా, సాంబ, ఇంద్ర ఇలాంటి ఫ్యాక్షన్ సినిమాల ప్రభావం ఆదికేశవలో కనిపిస్తుంది. అయితే ఎప్పుడో రెండు దశాబ్ధాల క్రితం వచ్చిన ఈ ఫార్ములాతో వచ్చిన ఆదికేశవ ఆడియన్స్ కు రుచించడు.

మెగా హీరోలంతా మాస్ పంథా కొనసాగించడం కష్టం. అది కొందరికే సాధ్యపడుతుంది. వైష్ణవ్ తేజ్ కొత్త కథలతో వెరైటీ సినిమాలు చేస్తే బెటర్ ఇలా మాస్ సినిమాల జోలికి వెళ్తే అసలకే మోసం వచ్చే పరిస్థితి ఉంటుంది.

మాస్ కమర్షియల్ సినిమాల్లో కూడా కంటెంట్ ఉంటేనే ఆడియన్స్ చూసేందుకు ఇష్టపడుతున్నారు. మరి అలాంటి ప్రయత్నం చేసి బలమైన కథలేకపోతే అదే ఆడియన్స్ తిప్పికొడతారు. ఆదికేశవ సినిమాలో అదే జరిగింది. సితార బ్యానర్ అంటే మంచి సినిమాలు చేస్తారన్న నమ్మకం ఉంది. కానీ ఈ సినిమాతో వారు కూడా రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నారని అనిపిస్తుంది. కొన్ని మాస్ అంశాలు అది కూడా మాస్ ఆడియన్స్ కోసం తప్ప సినిమాలో విషయం ఏమి లేదని చెప్పొచ్చు.

నటీనటులు :

ఉప్పెన, కొండపొలం, రంగ రంగ వైభవంగా 3 సినిమాలతో వైష్ణవ్ తేజ్ హీరోగా జస్ట్ ఓకే అనిపిస్తున్నా ఇంకా అతను మెరుగుపడాల్సి ఉందని అనిపిస్తుంది. సినిమాలో అతను మొదటి సగం బాగానే అనిపించినా సెకండ్ హాఫ్ లో తడబాటు కనిపిస్తుంది. శ్రీ లీల మరోసారి రొటీన్ పాత్రలో కనిపించింది. అంత పర్ఫార్మ్ చేసే అవకాశం కూడా లేదు. జీజు జార్జ్ విలనీ బాగానే ఉన్నా రొటీన్ గా అనిపిస్తుంది. రాధికా శరత్ కుమార్, సదా,జయ ప్రకాష్, సుదర్శన్ ఇలా అందరు రొటీన్ పాత్రల్లో కనిపించారు.

సాంకేతిక వర్గం :

సినిమాకు సంగీతం అనేది చాలా ఇంపార్టెంట్. జివి ప్రకాష్ ఈ సినిమాకు న్యాయం చేయలేదు. ఏదో మమా అనిపించాడు. డూడ్లీ సినిమాటోగ్రఫీ తో పాటుగా ఈ సినిమాకు ప్రసాద్ మూరెళ్ల, ఆర్ధర్ కె విల్సన్ కూడా పనిచేశారు. సినిమాకు గ్రాండ్ లుక్ తీసుకు రాగలిగారు కానీ కథ, కథనాలు వాటిని ఓవర్కం చేశాయి. దర్శకుడు ఒక రొటీన్ కథతో రొటీన్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా తెరకెక్కించాడు. ఆ విషయంలో అతని ప్రయత్నం విఫలమైందని చెప్పొచ్చు. సితార, ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

బాటం లైన్ :

ఆదికేశవ.. రొటీన్ మాస్ అటెంప్ట్..!